iDreamPost
android-app
ios-app

జీతాల పై తుది నిర్ణయం ప్రభుత్వానిదే : హైకోర్టు

  • Published Jan 24, 2022 | 9:43 AM Updated Updated Mar 11, 2022 | 10:22 PM
జీతాల పై తుది నిర్ణయం ప్రభుత్వానిదే : హైకోర్టు

ఉద్యోగుల జీతాల విషయంలో తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్పీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ జీవోలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి.దీనిపై ఫిబ్రవరి 6వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. జీవోలు రద్దు చేయాలని వారు హైకోర్టును ఆశ్రయించారు.

ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీపై దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదోపవాదాలు జరుగుతున్న సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగుల తరపున న్యాయవాది రవితేజ తన వాదనలు వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న కోర్టు జీతాలు తగ్గించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని పేర్కొంది.

దీనికి స్పందించిన రవితేజ పీఆర్సీ నివేదికను బహిర్గతం చేేయలేదని, నోటీసు లేకుండా జీతాల్లో కోత విధించటం చట్టవిరుద్ధమన్నారు. హెచ్‌ఆర్‌ఏ విభజన చట్టప్రకారం జరగలేదన్నారు. దీనికి స్పందించిన కోర్టు జీతం ఎంత తగ్గింది? అంకెల్లో జీతం పెరిగిందా? లేదా? అని ఉద్యోగులను ప్రశ్నించింది. ఇందుకు సంబంధించి వివరాలు తమ ముందుంచాలని కోర్టు ఆదేశించింది. సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధపడ్డ వివిధ ఉద్యోగ సంఘాలకు చెందిన 12 మంది స్టీరింగ్‌ కమిటీ సభ్యులు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. తిరిగి మధ్యాహ్నంకు విచారణను వాయిదా వేసింది.