Krishna Kowshik
Krishna Kowshik
‘చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా.. చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా’ అని ఓ జాన పద కవి అన్నట్లు.. ఇప్పటి పరిస్థితుల్లో విద్య అనేది చాలా కీలకం. మార్కులు, సంపాదనే విద్యకు కొలమానం కాదూ .. అంతకు మించిన జ్ఞానాన్ని అందిస్తుంది. ఆలోచన శక్తిని కల్గిస్తుంది. ఈ జ్ఞానాన్ని అందిచే ఆలయాలు విద్యా సంస్థలు. బడి నుండి కాలేజీ వరకు మనల్ని నడిపించే మార్గదర్శకులు గురువులు. తల్లిదండ్రులు కని పెంచితే.. మనకు విద్యా బుద్దులు నేర్పేది గురువులే. వక్రమార్గంలో వెళుతున్న విద్యార్థులను నయాన్నో, భయాన్నో, బుజ్జగించో, బతిమాలో దారిన పెట్టే దేవుళ్లు వీళ్లు. అందుకే ప్రతి విద్యార్థి జీవితంలో ఓ బెస్ట్ టీచర్ ఉంటారు. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులకు దక్కుతుంది. దేశానికి మంచి పౌరులను అందించే గొప్ప హోదా కల్గిన టీచర్లు.. ఇప్పుడు విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
పిల్లలకు పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే సాధారణంగా.. ఆ క్వశ్చన్ పేపర్లలోని ఆన్సర్లను రెండు మూడు సార్లు రాయమని, లేదంటే మరో ఇంపోజిషన్, పేరేంట్స్ తీసుకు రావాలని ఉపాధ్యాయులు చెబుతుంటారు. కానీ ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చేసిన ఓ చర్య ఇప్పుడు వార్తల్లో చర్చనీయాంశమైంది. పిల్లలకు మార్కులు తక్కువ మార్కులు వచ్చాయని జుట్టును కత్తిరించాడు హెడ్మాస్టర్. ఈ ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సూర్యనారాయణ పురంలోని ఎస్ఎస్ఎస్ ఆర్కే పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు ఇటీవల పరీక్షలు నిర్వహించగా.. మార్కులు తక్కువగా వచ్చాయి. మార్కులు సరిగా రాని 9 మంది విద్యార్థులను హెడ్మాస్టర్ పిలిచి.. జుట్టును కత్తిరించాడు. ఈ విషయం తల్లిదండ్రుల దృష్టికి వెళడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెడ్మాస్టర్ పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.