iDreamPost
android-app
ios-app

ఆడియన్స్ చేతలకు అర్థాలే వేరులే

  • Published Sep 05, 2021 | 6:53 AM Updated Updated Sep 05, 2021 | 6:53 AM
ఆడియన్స్ చేతలకు అర్థాలే వేరులే

సెకండ్ లాక్ డౌన్ తర్వాత మునుపటిలా జనం థియేటర్లకు రావడం లేదన్నది తేటతెల్లమయ్యింది. ఏది బడితే ఆ సినిమాకు వచ్చే పరిస్థితులు లేవని చాలా చోట్ల బోసిపోతున్న టికెట్ కౌంటర్లు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. పట్టుమని పది టికెట్లు కూడా తెగలేక షోలు క్యాన్సిల్ అవుతున్న సందర్భాలు కొత్త భయాన్ని పుట్టిస్తున్నాయి. ఎవరు ఔనన్నా కాదన్నా దీనికి కారణం ముందుగా ఓటిటినే.రెండు కరోనా గండాలు దాటుకొచ్చిన ప్రేక్షకులు కంటెంట్ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటున్నారు. బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేసే విషయం ఫలానా సినిమాలో ఉందా లేదా అని ముందుగానే ఒక అవగాహనకు వచ్చి అప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారు.

అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ కంటే హాలీవుడ్ మూవీ శాంగ్ ఛీ కి ఫస్ట్ డే ఎక్కువ కలెక్షన్ వచ్చిందంటే ఆశ్చర్యం కలగక మానదు. కొన్ని మల్టీ ప్లెక్సుల్లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9కి తెగిన టికెట్లలో 101 జిల్లాల అందగాడుకి సగం కూడా రాలేదనే చేదు నిజాన్ని ఒప్పుకుని తీరాలి. పెద్ద టార్గెట్ తో వచ్చిన శ్రీదేవి సోడా సెంటర్ రెండో వారంలోపే సగం హాలు కూడా నిండని పరిస్థితులు నెలకొన్నాయి. ఇచట వాహనములు నిలుపరాదు ఓటిటికి ఇచ్చినా బాగుండేదని అభిమానులే ఫీలైన దాఖలాలు ఉన్నాయి. ఇలా ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే జులై 30 దాకా చాలానే ఉన్నాయి. కనీసం హాలు కరెంటు బిల్లు కూడా తేలేని వాటి గురించి చెప్పకపోవడం మంచిది.

ఈ నెల 10న రాబోతున్న కంగనా రౌనత్ తలైవి హిందీ వెర్షన్ థియేటర్ రిలీజ్ తర్వాత ఓటిటికి కేవలం రెండు వారాల విండోని మాత్రమే ఫిక్స్ చేసుకోవడం పట్ల పివిపి మల్టీ ప్లెక్స్ నిన్న అసంతృప్తిని వ్యక్తం చేయడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు తమిళం కూడా నెలలోపే అని టాక్ ఉంది. ఇలా గ్యాప్ ని తగ్గించుకుంటూ పోతే కొద్దిరోజులు వెయిట్ చేయడం వల్ల పోయేదేముందనే అభిప్రాయానికి ప్రేక్షకులు రావడంలో ఆశ్చర్యం లేదు. చిన్న మీడియం రేంజ్ సినిమాలను ఖచ్చితంగా థియేటర్లోనే ప్రేక్షకులకు చూపించాలంటే ఇకపై దర్శకులు రచయితలు ఒళ్ళు దగ్గరపెట్టుకోవాల్సిందే. లేదంటే ఇంకా గడ్డు పరిస్థితులు వస్తాయి

Also Read : టాలీవుడ్లో మొదటిసారి ఇలాంటి పోటీ