Idream media
Idream media
భూమిని భూమాత అంటారు. భూమి మనకు తల్లి. పిల్లలు లేని తల్లి ఉంటుందేమో కానీ, తల్లి లేకుండా పిల్లలు పుట్టరు. మనం లేకపోయినా భూమి ఉంటుంది. భూమి లేకుండా మనం ఉండం.
అమ్మ మనకు జన్మనిస్తుంది. పాలు తాగిస్తుంది. స్నానం చేయిస్తుంది. మనం బాగుండడానికి చాలా చేస్తుంది. మనం పెద్ద వాళ్లై అన్నీ ఆమెకి తిరిగి చేస్తామని కాదు. ఏమీ ఇవ్వకపోయినా చేస్తుంది. అమ్మ కదా!
భూమి మనకి అన్నీ ఇచ్చింది. చెట్లని , పండ్లని, సెలయేళ్లని, జలపాతాలని, ఎండని, వానని, వెన్నెలని, పాడే పక్షుల్ని ఇచ్చింది. మనం పండ్లని తిని చెట్లని కొట్టేశాం. ఏరుని ఎండబెట్టాం. నదుల్లోకి ఫ్యాక్టరీల మలమూత్రాలని వదిలాం. పాడే పక్షుల గొంతులు కోశాం. అడవుల్ని తగలబెట్టాం. భూమాత ముఖాన్ని ప్లాస్టిక్ చెత్తతో కప్పేశాం. అయినా క్షమించింది. అమ్మ కదా!
మనకి ఆశ పెరిగింది. భూమిని నిలువుగా కోశాం, అడ్డంగా కోశాం. అధిపతులుగా ప్రకటించుకున్నాం. సమస్త జీవుల్ని పాదాల కింద బంధించాం. చచ్చిపోయే వాటిని చంపేశాం. బతుకుతున్న వాటిని భయంతో బతికేలా చేశాం. కొండల్ని కంకర చేశాం. సముద్రాల్ని తోడేశాం. అయినా భరించింది అమ్మ కదా!
ఆకాశంలో పొగ , సముద్రంలో పొగ. ఫ్యాక్టరీ గొట్టాల్లో పొగ, అమ్మ మొహం పొగచూరి నల్లగా మారింది. యుద్ధాల పొగ, తుపాకీ గుళ్ల పొగ, ఫిరంగి గొట్టంలో పొగ. బిడ్డల రక్తంతో తల్లి తడిసింది. ఓర్పు పట్టింది. తల్లి కదా!
బలవంతులు యజమానులయ్యారు. బలహీనులు బానిసలయ్యారు. విమానాలు బాంబుల్ని ప్రసవించాయి. ఆయుధాలు దాహంతో అరిచాయి. ఊయలలు ఊగాల్సిన పిల్లలు అలల మీద శవాలుగా తేలుతూ వచ్చారు. తల్లి జోల పాటతో నిద్రపోవాల్సిన పిల్లలు బాంబుల శబ్దానికి ఉలిక్కి పడి లేస్తున్నారు. అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటే, సునామీగా మారింది. మనకు అర్థం కాలేదు. ఆమె బాధతో నిట్టూర్పు విడిస్తే తుపానుగా మారింది. మనకి అర్థమైతే కదా!
ఆమె గుండెల్లో బోరు బావులు వేశాం. ఎరువులు చల్లి, పురుగుల మందు వేశాం. శవంగా చేసి చిల్లర పైసలు ఏరుకున్నామనుకున్నాం. అమ్మకి కూడా కోపం వస్తుంది. వచ్చింది. కోపంతో, దుక్కంతో కళ్లు ఎర్రబడి , గొంతు బొంగురుపోయింది. మనమంతా మూతికి మాస్కులు వేసుకున్నాం.
జలుబు చేయడమంటే శరరీం తనని తాను శుభ్రం చేసుకోవడం. భూమాత కూడా అదే పనిలో ఉన్నట్టుంది.
ఇంకా మనకి అర్థం కాలేదు. అందుకే దేవుడికి దీపాలు వెలిగించాల్సిన చేతులతో , శవాల తల దగ్గర దీపాలు పెడుతున్నాం.