Idream media
Idream media
ఇల్లు లేదా ఇళ్ల స్థలం లేని కుటుంబం ఉండకూడదనే మహోన్నత లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి తాజాగా ముహూర్తం ఖరారైంది. జూలై 8 వ తేదీన వైఎస్సార్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో అర్హులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. తాజాగా ఈ రోజు అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్ ఇళ్ల పట్టాల పంపిణీపై నిర్ణయం తీసుకున్నారు.
సాధారణంగా పోయిన ఉగాది రోజునే 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఏడాదిలోనే నిర్ణయించారు. అందుకు అనుగుణంగా అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా భూమిని సేకరించారు. చదును చేసి, లే ఔట్ కూడా వేశారు. అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 27 లక్షల మందిని అర్హులుగా తేల్చారు. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఉగాది రోజున పంపిణీ చేయలేకపోవడంతో ఆ కార్యక్రమాన్ని శ్రీరామనవమికి వాయిదా వేశారు. అయితే అదే సమయంలో కరోనా వైరస్ ప్రారంభం కావడంతో ఆ కార్యక్రమం మళ్లీ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇళ్ల పట్టాలు పంపిణీ సీఎం జగన్ ముహూర్తం నిర్ణయించడం విశేషం.
2019 సాధారణ ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర లో పేద ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు 25 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు నవరత్నాలలో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఇళ్ల స్థలాలు ఇవ్వడంతోపాటు ఇల్లు కూడా నిర్మించి ఇస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఓవైపు కరోనా వైరస్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోవైపు సాధారణ పరిపాలనను కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ రోజు డ్వాక్రా మహిళకు సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించారు. దీనికోసం 1,400 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశారు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అధికారం లోకి వచ్చిన మొదటి ఏడాది లొనే సీఎం జగన్ తన హామీని నెరవేర్చడం గమనార్హం.