iDreamPost
android-app
ios-app

వారంలోపు ఉరి తీయాలి

వారంలోపు ఉరి తీయాలి

భారతదేశంలో ఏదైనా నేరానికి ఉరిశిక్ష ఖరారైన తర్వాత, నిందితులకు ఆ శిక్షను తప్పించుకోవడానికి లేదా ఉరిశిక్ష అమలు జాప్యం చేయడానికి పలు మార్గాలు ఉన్నాయి.

అందులో భాగంగా రివ్యూ పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్, రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ ల రూపంలో వివిధ పిటిషన్లు దాఖలు చేయడం ద్వారా ఉరిశిక్ష నుండి తప్పించుకునే ప్రయత్నాలు నిందితులు చేయవచ్చు. ఇలా పలు పిటిషన్లు దాఖలు చేయడం వలన ఉరిశిక్ష రద్దు కావొచ్చు, లేదా ఉరిశిక్ష అమలు కావడం జాప్యం కావొచ్చు..

దీనికి తోడు ఏదైనా మరణ శిక్ష విధించబడిన కేసులో నిందితులు ఒకరికన్నా ఎక్కువగా ఉంటే అందరికీ ఒకేసారి మరణశిక్షను అమలు చేయాలన్న నిబంధన ఉండటం వలన, ఒక నిందితుడి పిటిషన్ తిరస్కరణకు గురికాబడినా, శిక్ష అమలయ్యే సమయానికి మరొక నిందితుడు పిటిషన్ దాఖలు చేయడం వల్ల పిటిషన్ విచారణకు వచ్చి తీర్పు వచ్చే వరకు మరణ శిక్షను అమలు చేయడానికి వీలులేదు.. ఈ విధానంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

నిర్భయ కేసులో నిందితులకు మరణ శిక్ష జాప్యం కావడానికి నిందితులు తెలివిగా అనుసరిస్తున్న పద్దతులే కారణం.. శిక్ష అమలవుతుందన్న సమయానికి ఏదొక పిటిషన్ దాఖలు చేయడం వల్ల శిక్ష విధించడం సాధ్యం కావడం లేదు.. అయితే ఈ పద్ధతిని మార్చాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కేంద్ర హోం శాఖ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన వారం రోజుల్లో డెత్‌ వారంట్‌ జారీ చేయాలి. మరుసటి వారంలో ఉరి శిక్షను అమలు చేయాలి. సహ దోషుల రివ్యూ, క్యూరేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు ఏ స్థాయిలో ఉన్నా వాటిని పట్టించుకోకూడదు. అన్ని కోర్టులు, రాష్ట్ర ప్రభుత్వాలు, జైలు అధికారులు దీన్ని అమలు జరిపేలా ఆదేశాలివ్వండి’ అని హోంశాఖ తన పిటిషన్‌లో కోరింది.

ఒకవేళ నిందితుల రివ్యూ పిటిషన్ ను కోర్టు తిరస్కరిస్తే క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడానికి ఖచ్చితమైన కాల పరిమితి విధించాలని హోం శాఖ కోరింది..అత్యాచారం కేవలం ఒక వ్యక్తిపై చేసే నేరం కాదు. మానవత్వంపై జరిగిన ఘాతుకం. అది నాగరిక సమాజం క్షమించలేని దారుణం అని హోంశాఖ వ్యాఖ్యానించింది. దోషుల హక్కులను కాకుండా బాధితుల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం శాఖ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది.

నిందితుడికి శిక్ష ఖరారు అయిన తర్వాత క్షమాభిక్ష కోరుకుంటే, డెత్ వారెంట్ జారీ అయిన వారంలోపే పిటిషన్ దాఖలు చేసేలా నిబంధనలు మార్చాలని, చట్టంలో ఉన్న లొసుగులను వాడుకుని చట్టంతో ఆడుకుంటూ శిక్షను వాయిదా వేసే అవకాశం నిందితులకు ఇవ్వకుండా నిబంధలను మార్చాల్సిన అవసరం ఉందని కేంద్రం సుప్రీం కోర్టును అభ్యర్ధించింది.