iDreamPost
android-app
ios-app

మళ్లీ గళం విప్పిన జీ 23.. తీవ్ర ఒత్తిడిలో గాంధీలు

  • Published Oct 01, 2021 | 10:19 AM Updated Updated Oct 01, 2021 | 10:19 AM
మళ్లీ గళం విప్పిన జీ 23.. తీవ్ర ఒత్తిడిలో గాంధీలు

అధ్యక్షుడే లేని పార్టీలో ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియడం లేదు.. ఏ హోదా లేకుండానే రాహుల్ గాంధీ అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయనతోపాటు మరో ఇద్దరి వల్ల కాంగ్రెస్‌కు ఈ దుర్గతి పట్టింది.. అంటూ సీనియర్ నేతలు వరుసగా దుమ్ము దులిపేస్తుండటంతో కాంగ్రెస్ నాయకత్వంపై ఒత్తిడి పెరిగింది.

పార్టీ పరువును బజారుకు ఈడ్చిన పంజాబ్ పరిణామాలు, ఇతర రాష్ట్రాల్లో కుమ్ములాటలు, నేతల వరుస వలసల నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలు అధిష్టానానికి వ్యతిరేకంగా మళ్లీ గళం విప్పారు. గతం జీ 23 పేరుతో నాయకత్వ మార్పు, పార్టీ ప్రక్షాళనకు డిమాండ్ చేస్తూ లేఖలు రాసిన ఈ నేతలు మళ్లీ తమ డిమాండ్లను తెరపైకి తెచ్చారు. ఈ ఒత్తిడికి తలొగ్గిన పార్టీ అధిష్టానం ఎట్టకేలకు సెంట్రల్ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటుకు అంగీకరించింది. అయితే ఈ సమావేశం ఎప్పుడు జరుగుతుంది.. పార్టీ ప్రక్షాళనపై ఇందులో నిర్ణయం తీసుకుంటారా అన్నది స్పష్టం చేయాలని అసంతుష్ట నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Also Read : కాంగ్రెస్ యూత్ ఫార్ములా సక్సెస్ అయ్యేనా..?

మళ్లీ జీ 23 నిరసన గళం

2019 ఎన్నికల్లో పరాజయం అనంతరం పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయగా అప్పటి నుంచీ ఆ పదవి ఖాళీగా ఉంది. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగుతున్నారు. సంస్థాగత ఎన్నికల నిర్వహణకు ఇంతవరకు పూనుకోలేదు. దాంతో పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఈ దుస్థితిపై గత ఏడాది ఆగస్టులో 23 మంది సీనియర్ నేతలు అధిష్టానానికి వ్యతిరేకంగా గళం విప్పారు. పార్టీలో నాయకత్వ మార్పు, అధ్యక్ష ఎన్నిక, సంస్థాగత సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. అయితే పార్టీ వారి డిమాండ్లపై ఇంతవరకు స్పందించలేదు. అయినా జీ 23 నేతలు సమయం వచ్చినప్పుడల్లా నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా పంజాబ్ పరిణామాలు, వాటిని సమర్థవంతంగా పరిష్కారించడంలో అధిష్టానం వైఫల్యం నేపథ్యంలో మరోసారి వారు తమ డిమాండ్లను తెరపైకి తెచ్చారు.ఈసారి మరింత తీవ్ర స్వరంతో.. నేరుగా అగ్రనేతలుగా ఉన్న గాంధీ కుటుంబంపైకే విమర్శలు ఎక్కుపెట్టారు.

ఏ హోదాలేని వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు

పంజాబ్‌లో గత కొన్నాళ్లుగా నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో తొలుత ఎంపీ కపిల్ సిబల్ గళం విప్పారు. పార్టీకి అధ్యక్షుడే లేరు. నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో తెలియడంలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. పార్టీ నుంచి నాయకులు ఎందుకు వెళ్లిపోతున్నారన్న దానిపై ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. వెంటనే సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేసి వీటిపై చర్చించాలని, పార్టీ ప్రక్షాళనపై నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తాము జీ హుజూర్ నేతలం కామని.. జీ 23 నేతలమని స్పష్టం చేశారు. పార్టీలో సమస్యలపై ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు నిరసన సిబల్ ఇంటి వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేయడంతో సిబల్‌కు మద్దతుగా పలువురు జీ23 నేతలు నిలిచారు.

Also Read : సిద్ధూ తీరు.. రాహుల్ , ప్రియాంక‌ల‌ను ఇర‌కాటంలో ప‌డేసిందా?

ధర్నా చేసిన కార్యకర్తలపై పార్టీ చర్యలు తీసుకోవాలని ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. మాజీమంత్రి చిదంబరం, ఎంపీ శశి థరూర్‌ కూడా ఇదే విధంగా స్పందించారు. కపిల్ సిబల్ వ్యాఖ్యల్లో తప్పు లేదని సంస్థాగత మార్పులు అవసరమని అన్నారు. ఇవే అంశాలను ప్రస్తావిస్తూ మరో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సోనియాగాంధీకి లేఖ కూడా రాశారు. విదేశాంగ శాఖ మాజీమంత్రి నట్వర్ సింగ్ మరింత తీవ్రంగా స్పందించారు. ఏ హోదా లేకుండానే రాహుల్ గాంధీ నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఆయనతోపాటు మరో ఇద్దరి వల్లే పార్టీకి ఈ దుస్థితి దాపురించిందని పరోక్షంగా సోనియా, ప్రియాంకలను టార్గెట్ చేశారు. వారే దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

సీడబ్ల్యూసీ భేటీకి అంగీకారం.. 

చుట్టుముట్టిన సమస్యలు, అసంతుష్ట నేతల ఒత్తిళ్లు పెరగడంతో పార్టీ ఎట్టకేలకు స్పందించింది. చాలా కాలం నుంచి జరగని వర్కింగ్ కమిటీ సమావేశ నిర్వహణకు అంగీకరించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఈ విషయం వెల్లడించారు. త్వరలోనే సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. అధ్యక్ష, ఇతర సంస్థాగత ఎన్నికల నిర్వహణ, రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలు, గాంధీల నుంచి నాయకత్వ మార్పు అంశాలపై గట్టిగా పట్టుబట్టాలని అసమ్మతి నేతలు భావిస్తున్నారు.

Also Read : కెప్టెన్‌ కొత్త పార్టీ.. అమిత్‌షాను కలిసిన మరుసటి రోజే ప్రకటన