iDreamPost
iDreamPost
ప్రసిధ్ధ శైవ క్షేత్రమైన ద్రాక్షారామం అనేక విశిష్టతల సమాహారంగా అలరారుతోంది. తొమ్మిదో శతాబ్డంలో భీమ అనే పేరు గల తూర్పు చాళుక్య రాజు నిర్మించిన ఈ ఆలయంలోని శిల్ప సౌందర్యం చూపరులను కట్టి పడేస్తుంది. నలువైపులా ఎత్తుగా రాతి ప్రాకారాలు, గోపురాలు, ఆలయ గోడలపై రాజ శాసనాలు ఉంటాయి. చాళుక్య, చోళ శిల్ప శైలుల మేళవింపుతో దీన్ని నిర్మించారు. ఈ విషయాలన్నీ ఆలయం లోపలి రాతి గోడలపై చెక్కిన శాసనాల ద్వారా అర్ధం అవుతుంది. ఈ ఆలయం కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో ఉంది. భక్త సులభుడైన పరమేశ్వరుడు ఇక్కడ మాణిక్యాంబా సమేత భీమేశ్వరునిగా దర్శనమిస్తాడు.
దక్షుని అరామమే ద్రాక్షారామం..
శివుని మామగారైన దక్షుడు తాను చేసిన యజ్ఞానికి దేవతలందరిని ఆహ్వానించి కుమార్తె దాక్షాయణిని, అల్లుడిని పిలవకుండా అవమానిస్తాడు. తండ్రి పిలవక పోయినా, భర్త అయిన శివుడు వారిస్తున్నా వినకుండా పుట్టింటిలో జరిగే అ యజ్ఞానికి దాక్షాయణి వెళుతుంది. అక్కడ దక్షుడు శివుడిని దూషించడమే కాక పిలవని పేరంటానికి వచ్చిన ఆమెను అందరి ముందు అవమానిస్తాడు.
దీనికి ఆగ్రహించిన ఆమె ఇకపై తనను దక్షుని కుమార్తెగా భావించి దాక్షాయణిగా ఎవరూ పిలువ వద్దని, సతీదేవిగా పేరు మార్చుకుంటున్నానని ప్రకటిస్తుంది. తండ్రి వల్ల పుట్టింటిలో కలిగిన ఆ అవమాన భారంతో తిరిగి భర్త వద్దకు వెళ్ళలేక ఆ యజ్ఞ గుండంలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది. ఈ విషయం తెలిసిన పరమేశ్వరుడు తన ప్రమద గణాలను ఆదేశించి దక్షవాటికను ధ్వంసం చేయిస్తాడు. దక్షుని తలనరికి ఆ యజ్ఞగుండంలోకి విసిరేస్తారు. అలా దక్షుడు యజ్ఞం చేసిన చోటు కనుక ద్రాక్షారామంగా ఈ ప్రాంతానికి పేరు వచ్చింది.
Also Read : రాజకీయాల్లో గ్లామర్ కన్న గ్రామర్ ముఖ్యం
పలు విశేషాలు..
ఇక్కడ సూర్య ప్రతిష్ఠమైన శివలింగం ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆయనకు వామ భాగంలో మాణిక్యాంబ అమ్మవారి ఆలయం ఉంటుంది. ఇక్కడి శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, ఈ క్షేత్రం పంచారామ క్షేత్రాలలో ఒకటిగా ఉంది. ఇక్కడి మాణిక్యాంబ అమ్మవారి పీఠం అష్టాదశ పీఠాల్లో ఒకటిగా అలరారుతోంది.
సప్తరుషులు అంతర్వాహినిగా తీసుకువచ్చిన సప్త గోదావరిలో భక్తులు నిత్యం స్నానం చేస్తుంటారు. ఈ క్షేత్రం చుట్టూ బ్రహ్మ గుండం, సోమగుండం వంటి స్నాన ఘట్టాలు, ఆదివారపుపేట నుంచి శనివారపు పేట వరకు ఏడు వారాలకు ఏడు పేటలు ఉండడం ప్రత్యేకత. మాఘ శుద్ద ఏకాదశికి స్వామి కల్యాణం నిర్వహిస్తారు. మహా శివరాత్రికి ఇక్కడ మూడు రోజులపాటు నిర్వహించే ఉత్సవాలకు వేలాదిగా భక్తులు వస్తారు. ఈ గ్రామానికి చుట్టుపక్కల అష్ట సోమేశ్వరాలు ఉండడం మరో విశేషం. వీటన్నిటినీ దర్శించుకోవడానికి రోజూ దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తూనే ఉంటారు. అందుకే ఇది పర్యాటక కేంద్రంగా కూడా పేరు పొందింది.
Also Read : మహేష్‌బాబు మురారీ సినిమా షూటింగ్ జరిపిన రామచంద్రాపురం రాజుగారి కోట గురించి తెలుసా..?
రాజకీయంగా విచిత్రమైన చరిత్ర..
ఎక్కడైనా గ్రామ పంచాయతీ మేజరు పంచాయతీగా మారడం చూస్తూంటాం. కానీ ఒకప్పుడు మున్సిపాలిటీగా ఉన్న ద్రాక్షారామం నేడు మేజరు పంచాయతీగా ఉంది. బహుశా దేశంలోనే ఇదో అరుదైన ఘటనగా చెప్పవచ్చు. 1949- 52 మధ్య ద్రాక్షారామం మునిసిపాలిటీగా ఉండేది. దీనికి కళా సుబ్బారావు ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. ముద్రగడ స్వామినాయుడు ఆధ్వర్యంలోని సభ్యులు కొందరు తను చేసే ప్రతి పనికి అడ్డు తగులుతున్నారన్న కోపంతో కళా సుబ్బారావు మునిసిపాలిటీ రద్దుకు తీర్మానం చేసి రాష్ట ప్రభుత్వానికి పంపించారు.
అప్పటి మంత్రి కళా వెంకట్రావు దగ్గర తనకు గల పలుకుబడి ఉపయోగించి ఆ తీర్మానాన్ని ఆగమేఘాలపై ఆమోదింపజేశారు. రేడియో వార్తల్లో వినే వరకు ఈ విషయం ఎవరికీ తెలియక పోవడం ఆశ్చర్యకరమని అప్పటి వారు ఇప్పటికీ కథలుగా ఆ వివరాలు చెబుతూంటారు. ఆ విధంగా కేవలం దాదాపు రెండేళ్లు మునిసిపాలిటీగా ఉన్న ద్రాక్షారామంను అయిదు పంచాయతీలుగా ప్రభుత్వం వేరు చేసింది.
అప్పటి నుంచి ద్రాక్షారామం, వెలంపాలెం, జగన్నాయకులపాలెం, తోటపేట, అన్నాయిపేట పంచాయతీలుగా ద్రాక్షారామం మునిసిపాలిటీ విడిపోయింది. కొన్నేళ్లకు ద్రాక్షారామం మేజర్ పంచాయతీగా మారింది. ఆ తరువాత వచ్చిన సర్పంచులు కొందరు ఈ అయిదు పంచాయతీలను విలీనం చేసి మళ్లీ మునిసిపాలిటీగా మారుద్దామని ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. కొందరు సర్పంచులు తమ అధికారాన్ని వదులుకోవడానికి సిద్దం కాకపోవడం, మునిసిపాలిటీగా మారితే పన్నుల భారం పెరుగుతుందని స్థానికులు కూడా సమ్మ తించకపోవడంతో ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు.
Also Read : కింగ్‌మేకర్ రాయవరం మునసబు గురించి తెలుసా..?