iDreamPost
iDreamPost
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని బహిష్కరించాలని బీజేపీ నిర్ణయించుకుంది. అది తెలుగుదేశం పార్టీ కరపత్రిక అని విమర్శించింది. నైతిక విలువలు గాలికొదిలేసి టీడీపీ మౌత్ పీస్ గా మారిపోయిందని మండిపడింది. విష్ణు వర్ధన్ రెడ్డి ఎపిసోడ్ నేపథ్యంలో తమకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అప్పటి వరకూ తమ మీడియా సమావేశాలు, కార్యక్రమాలకు ఆ సంస్థ నుంచి మీడియా ప్రతినిధులను రానివ్వబోమని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆపార్టీ మీడియా ఇన్ఛార్జ్ గంగాధర్ రావు చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది.
తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు కాపాడడం కోసమే ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. అదే సమయంలో విష్ణువర్తన్ రెడ్డి పై లైవ్ డిబేట్లో జరిగిన దాడి ఘటనపై కేసు నమోదు చేయాలని అంటోంది. దాడికి పాల్పడిన శ్రీనివాసరావుని చర్చల నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి మళ్లీ ఆయనతో డిబేట్ నిర్వహించడం ఏమిటని నిలదీసింది. దాంతో బీజేపీ వైఖరి చర్చనీయాంశం అవుతోంది. ఏబీఎన్ సంస్థలు చంద్రబాబు శ్రేయస్సు కోసమేనన్నది జగమెరిగిన సత్యం. ఇప్పటికే వైఎస్ జగన్ శిబిరం ఆ సంస్థలను బహిష్కరించాయి. అప్పట్లో వైఎస్సార్సీపీ నిర్ణయాన్ని బీజేపీ తప్పుబట్టింది. కానీ ఇప్పుడు తనవరకూ వచ్చేసరికి అదే బాట పట్టింది.
దానికితోడుగా క్షమాపణ చెప్పేవరకూ బహిష్కరణ అంటూ మెలికపెట్టడం విస్మయకరంగా మారింది. ఏబీఎన్ క్షమాపణ చెబితే అది టీడీపీ ప్రయోజనాల కోసం పాటుపడుతుందన్న బీజేపీ ఆరోపణలకు అర్థమారిపోతుందా.. అప్పటి నుంచి ఆ సంస్థ నైతిక విలువలు పాటించినట్టవుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అంతేగాకుండా విష్ణువర్థన్ రెడ్డి మీద చెప్పుతో జరిగిన దాడి వెనుక ముందస్తు వ్యూహం ఉందని పలువురు భావిస్తున్న తరుణంలో బీజేపీ వైఖరి విశేషంగా కనిపిస్తోంది. తమ పార్టీలో కొందరు నేతలను చర్చలకు పిలిచి, తమకు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలను బీజేపీ అధికారిక వాయిస్ అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారని ఆపార్టీ అధికారిక ప్రకటనలో పేర్కొనడం విడ్డూరంగా మారింది. అలాంటివి ఆపకపోతే చట్టపరమైన చర్చలతో పాటు ఇతర అవసరమైన చర్యలకు కూడా పూనుకుంటామని బీజేపీ పేర్కొంది. అంటే బీజేపీ తన పార్టీ నేతలను కట్టడి చేయలేనని భావిస్తోందా లేక బీజేపీ నేతలు చెప్పే మాటలన్నీ అధికారిక వైఖరికి అనుగుణంగా ఉండవని చెప్పదలచుకుందా అన్నది అర్థంకాని విషయంగా మారింది.
బీజేపీ తీరుని ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఖాతరు చేసేలా కనిపించడం లేదు. విష్ణుని చెప్పుతో కొట్టిన శ్రీనివాస్ ని మళ్లీ పిలిచి చర్చలు జరపగడమే దానికి తార్కాణం. పైగా దాడికి పాల్పడిన వ్యక్తిని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి 24 గం.లు గడవకముందే తన నిర్ణయం మార్చుకుని బీజేపీ తీరు మీద ఎదురుదాడికి పూనుకున్న తీరు ఆంధ్రజ్యోతి నైజం చాటుతోంది. ఇక ఇప్పుడు బీజేపీ ఏం చేసినా లెక్కలేదనే తీరులో ఆ సంస్థ వ్యవహరిస్తోంది కాబట్టి బంతి బీజేపీ ఏపీ శాఖ కోర్టు పరిధిలో ఉందనే చెప్పవచ్చు. ఆ పార్టీ నేతలు ఏం చేస్తారు, తమ ప్రకటనలకు ఎంతవరకూ కట్టుబడి ఉంటారన్నది చూడాలి.