Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తనను రాజ్యాంగ విరుద్ధంగా తొలగించారంటూ మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్ పై ఐదురోజులపాటు వాదప్రతివాదనలు జరిగాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించడం తో ఈ పిటిషన్ లో ఇంతటితో వాదనలు ముగిసినట్లు హైకోర్టు ప్రకటించింది. తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పిటిషన్ పై తుది తీర్పు ఎప్పుడు వెల్లడిస్తారనే అంశంపై స్పష్టత లేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష పూరితంగా తన తొలగించిందని, సంస్కరణల పేరుతో తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ప్రస్తుతం పదవిలో ఉన్న తనకు వర్తించదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరఫున న్యాయవాది వాదించగా.. ప్రభుత్వం తరఫు న్యాయవాది.. 243k అధికరణలో పదవీకాలం రక్షణ లేదని కోర్టుకు తెలిపారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగానే ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందని, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందన్న వాదనను తోసిపుచ్చారు.
కాగా, ఇదే అంశంపై ప్రస్తుత ఎన్నికల కమిషనర్ వి. కనగరాజ్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.ఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. మాజీ న్యాయమూర్తి ఎన్నికల కమిషనర్ గా నియమించడం శుభపరిణామమని ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. కమిషనర్ పదవిని వయస్సు తో ముడి పెట్టడం సరికాదన్నారు. మరోవైపు ఎన్నికల కమిషన్ తరఫున రాతపూర్వకంగా వాదనలు సమర్పించేందుకు మాజీ అడ్వకేట్ జనరల్ మోహన్ రెడ్డి సమయం కోరారు. ఈ నేపథ్యంలో వచ్చే సోమవారం వరకు గడువు ఇస్తూ చేస్తూ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది.
గత కొద్ది నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం తుది అంకానికి చేరుకుందని చెప్పవచ్చు. ఈ వ్యవహారంలో హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతొందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్ధిస్తుందా.. లేదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాదనతో ఏకీభవిస్తుందా.. అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.