Idream media
Idream media
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మోకా భాస్కర రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తన చర్యల ద్వారానే అడ్డంగా బుక్కయ్యారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. హత్య జరిగిన ఐదు రోజుల వరకూ కొల్లు రవీంద్ర మచిలీపట్నంలోని తన ఇంటిలోనే ఉన్నారు. జూన్ 29వ తేదీన భాస్కర రావు హత్య జరగ్గా నిందితులను పోలీసులు 30వ తేదీన పట్టుకున్నారు. వారు ఇచ్చిన వాగ్మూలం తర్వాతనే ఈ హత్య కేసులో కొల్లు రవీంద్ర పాత్ర ఉన్నట్లు తేలింది. అయితే కొల్లును అదుపులోకి తీసుకునేందుకు తొందరపడని పోలీసులు ఈ కేసులో ఆయన పాత్రపై పక్కా ఆధారాలు సేకరించారు. ఆ తర్వాతనే విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు.
అయితే విచారణకు హాజరుకాకుండా కొల్లు మొదటి తప్పు చేశారని చెబుతున్నారు. పోలీసులు పిలిచిన వెంటనే వెళ్లి వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి ఉంటే ఆయన పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారు. విచారణ తర్వాత పోలీసులు అరెస్ట్ చేసినా ఆయన పాత్రపై ప్రస్తుతం ఉన్నంత బలంగా ప్రజల్లో వాదనలు ఉండేవి కాదంటున్నారు. ఈ నెల 3వ తేదీన కొల్లు రవీంద్ర పోలీసుల విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే హత్య కేసులో తన అరెస్ట్ తప్పదనుకున్న కొల్లు రవీంద్ర ఇంటి వెనుక గోడ దూకి పారిపోయారు. ఇంటి వద్ద పోలీసుల నిఘా ఉంటుందన్న కారణంతోనే ఆయన వెనుక గోడ దూకి పరారయ్యాని తెలుస్తోంది. నిచ్చెన సహాయంతో ఆయన ఎత్తయిన ఇంటి వెనుక గోడను దూకారు. ఆ తర్వాత పోలీసులు ఇంటిలో సోదా చేశారు. కుటుంబ సభ్యులను విచారించారు.
తప్పు చేసిన వాడిలా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కొల్లు రవీంద్ర గోడ దూకడమే ఆయన చేసిన మొదట చేసిన పొరపాటని అంటున్నారు. ఆ తర్వాత పరారవడం, విశాఖ వెళుతుండగా తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద మఫ్టిలో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకోవడం అంతా సినీ పక్కీలో జరిగింది. పారిపోవడం వల్లనే ఈ హత్యలో కొల్లు రవీంద్ర పాత్ర ఉందని రాష్ట్రం మొత్తం భావించింది. కృష్ణా జిల్లా ఎస్పీ ప్రెస్‌మీట్ తర్వాత టీడీపీ నాయకులు ఒకరిద్దరు మినహా నోరు మెదపలేదు. అంతకు ముందు కొల్లు రవీంద్ర సౌమ్యుడు, వివాద రహితుడు, మృదుస్వభావి, అజాతశత్రువు అంటూ ఆయన్ను వెనుకేసుకు వచ్చిన టీడీపీ మాజీ మంత్రులు ప్రస్తుతం మిన్నుకుండిపోయారు. ప్రస్తుతం చంద్రబాబు ఒక్కరే తన తెలివితేటలతో కొల్లు పాత్రపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తొలగించేందుకు తంటాలు పడుతున్నారు. కొల్లు భవిష్యత్ ఏమిటన్నది 14 రోజుల రిమాండ్ ముగిసిన తర్వాత గానీ తెలిసే అవకాశం లేదు.