Idream media
Idream media
తెల్లారుతుంది. అలారం ఆఫ్ చేయాలి. పేపర్ , పాల ప్యాకెట్లు లోపల పెట్టాలి. జింజర్ టీ చేయాలి. తర్వాత టిఫెన్, కారియర్ రెడీ చేస్తే , భర్త లేచి టిఫెన్ తిని ఆఫీస్‌కు వెళ్తాడు. సాయంత్రం వస్తాడు. టీ చేయాలి. రాత్రి డిన్నర్‌కి రెడీ చేయాలి. Next Day..
తెల్లారుతుంది. అలారం ఆఫ్ చేయాలి. పేపర్ , పాల ప్యాకెట్లు లోపల పెట్టాలి. జింజర్ టీ చేయాలి. బోర్ కొడుతుందా? ఒకటికి రెండు సార్లు వాక్యాలు రిపీట్ అయితేనే బోర్ కొడితే, మీ అమ్మ, మా అమ్మ…లోకంలో చాలా మంది అమ్మలు ఇంతే రొటీన్‌గా జీవించారు.
పిల్లలు పుడితే ఇంకా కొన్ని పనులు Add అవుతాయి. వాళ్లని నిద్రలేపి స్నానాలు చేయించి, హోంవర్క్ చేయించి , మారాం చేస్తున్నా బుజ్జగించి టిఫెన్ పెట్టి, క్యారియర్ కట్టి , ఆటో కోసం ఎదురు చూసి స్కూల్‌కి పంపి, బట్టలన్నీ ఉతికి, వంట చేసి…ఒకటి కాదు…రెండు కాదు…లెక్కలేనన్ని పనులు. మగాళ్లు ఉద్యోగం మాత్రమే చేస్తారు. ఆడవాళ్లు ఒకేసారి నాలుగు ఉద్యోగాలు చేస్తారు. ఆడాళ్లు కదా…అన్నిటికి అడ్జెస్ట్ అయిపోవాలి.
అలా కుదరదని అనుభవ సిన్హా అంటున్నాడు. ఆయన “తప్పడ్” సినిమా డైరెక్టర్. తప్పడ్ అంటే చెంప దెబ్బ. ఒక చెంప దెబ్బ కోసం సినిమా తీయాలా? అది చెంప దెబ్బకాదు. ఒక అమ్మాయి ఆత్మగౌరవ నినాదం.
తాప్సీ తెలుసు కదా, మన తెలుగు వాళ్లు ఆమె బొడ్డు మీద బత్తాయిలు దొర్లించి అవమానించారు. హిందీ వాళ్లు నెత్తిన పెట్టుకున్నారు. తాప్సీ అద్భుతంగా నటించిన సినిమా “తప్పడ్”.
అమృత (తాప్సీ) హౌస్ వైఫ్. పైన చెప్పిందంతా ఆమె దినచర్యే. బాగా చదువుకుని , మంచి డ్యాన్సర్ అయినప్పటికీ గృహిణిగా అత్తగారి వైద్య సేవల దగ్గర నుంచి , అన్నీ తానే చేస్తూ ఉంటుంది. రోజూ పక్కింటి పాపకు కాసేపు డ్యాన్స్ నేర్పడం తప్ప ఆమెకి ఇంకే వ్యాపకం లేదు. ఆఫీస్‌లో ప్రమోషన్ పైన భర్తని లండన్‌కి పంపిస్తున్న సందర్భంగా ఇంట్లో పెద్ద పార్టీ. అమృత అమ్మానాన్నలతో పాటు బంధువులు, స్నేహితులు అందరూ వస్తారు. డ్రింక్స్ పార్టీ. ఆనందంతో అమృత డ్యాన్స్ చేస్తుంది.
ఇంతలో భర్తకి ఫోన్. లండన్‌లో చిన్న చేంజ్. అతని మీద ఇంకో బాస్ ఉంటాడు. అక్కడే ఉన్న సుపీరయర్‌తో భర్త గొడవ పడతాడు. అమృత అడ్డు వెళితే, అమె చెంప మీద భర్త కొడతాడు.
ఒక్క క్షణం అంతా నిశ్శబ్దం. అందరి ముందు అవమానం. అందరూ చూస్తున్నారు అనే దానికంటే, తానెంతగానో ప్రేమిస్తున్న వ్యక్తి అందరి ముందు ఇలా ఎలా?
అతనో మగాడు. జాగ్రత్తగా చూస్తే మనకి తెలిసిన చాలా మంది మగవాళ్లు అతనిలో కనిపిస్తారు. మనం మొహం కూడా మనకు కనపడవచ్చు. మగాడికి కోపం వస్తే ఆ మాత్రం తిట్టడా , కొట్టడా? అనుకునే సంస్కృతి మనది. సినిమా చివర్లో అమృత భర్త ఎవరితో గొడవ పడ్డాడో ఆ సుపీరియర్ ఒక ప్రశ్న వేస్తాడు.
“నువ్వు గొడవ పడింది నాతో కదా, మరి నన్నెందుకు కొట్టలేదు. నీ భార్యని ఎందుకు కొట్టావు?” …ఎందుకంటే భార్యని కొట్టొచ్చు, అతనికి తెలియకుండానే రక్తంలో ఇంకిపోయి ఉంది కాబట్టి.
కానీ అమృత అలా అనుకోలేదు. అమ్మానాన్నల దగ్గరికి వెళ్లిపోయింది. ఇక ఆ ఇంటికి వెళ్లనని చెప్పింది. ఒక్క చెంప దెబ్బకే కాపురం వదులుకుంటావా అని అందరూ అడిగారు. అతని మీద తనకి ప్రేమ పోయిందని చెబుతుంది.
భర్త కూడా , తాగిన మైకంలో ఏదో జరిగిపోయిందని అంటాడు తప్ప ఆమెకి క్షమాపణ మాత్రం చెప్పడు. చాలా సన్నివేశాల్లో తాప్సీ మాట్లాడదు, ఆమె కళ్లే మాట్లాడతాయి.
చివరికి విడాకుల వరకు వెళుతుంది కథ. స్లో నెరేషన్‌లో సాగే ఈ సినిమాలో చాలా లేయర్స్ ఉన్నాయి. అమృతతో పాటు ఇంకో నలుగురు ఆడవాళ్ల కథ కూడా ఇది.
“ఇన్నేళ్లలో నా ఇష్టాలేమిటో ఎప్పుడైనా అడిగావా?” అని ఒక పెద్దావిడ ప్రశ్నించినప్పుడు ఆ భర్త తడుముకుంటాడు.
యాక్టివిస్ట్‌లంతా లాయర్లు కావడం వల్ల , సంసారాలు నాశనం అవుతున్నాయని ఒక మగ లాయర్ ఆక్రోశం వెలిబుచ్చితే, ఆమె లాయర్‌గా , యాక్టివిస్ట్‌గా కాదు, ఒక స్త్రీగా మాట్లాడుతుంది, సరిగా అర్థం చేసుకో అంటుంది అమృత.
అమృత తన భర్తని తిట్టదు, అతని నుంచి నష్టపరిహారాన్ని కోరదు. ప్రేమ లేనప్పుడు కలిసి ఉండటం సాధ్యం కాదని మాత్రమే అంటుంది.
అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ చూడాలి ఈ సినిమాని. ఎందుకంటే ప్రేమతో పాటు గౌరవం కూడా చాలా ముఖ్యమని తెలుసుకోవడానికి.