iDreamPost
android-app
ios-app

TG venkatesh – టీజీ వెంకటేష్ కు అంత సీన్ ఉందా?

  • Published Nov 23, 2021 | 2:50 PM Updated Updated Mar 11, 2022 | 10:34 PM
TG venkatesh – టీజీ వెంకటేష్ కు అంత సీన్ ఉందా?

రాజధానిని ముక్కలు చేయకుండా ముఖ్యమంత్రి జగన్ నా సలహాలు వింటే బీజేపీని ఒప్పించే బాధ్యత నాది అంటూ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ప్రకటించడంతో ఆయనకు అంత సీన్ ఉందా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. అమరావతిని అలాగే ఉంచి కర్నూలులో సమ్మర్ లేదా వింటర్ క్యాపిటల్ పెట్టాలని రాయలసీమ హక్కుల ఐక్యవేదిక మొదటి నుంచి డిమాండ్ చేస్తోందని తెలిపారు. ఒక చోట సెక్రటేరియట్, మరోచోట శీతాకాల సమావేశాలు, ఇంకోచోట వేసవికాల సమావేశాలు నిర్వహిస్తే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు.

బీజేపీలో ఈయన మాట వినేది ఎవరు?

సీఎం జగన్మోహనరెడ్డి తన ప్రతిపాదనలకు అంగీకరిస్తే బీజేపీని తాను ఒప్పిస్తానని టీజీ చెప్పడం మరీ అతిగా ఉంది. చంద్రబాబు సూచనలతో బీజేపీ పంచన చేరి రాజకీయంగా ఉనికిని కాపాడుకుంటున్న ఈయన బీజేపీని ఒప్పించేస్తానని బిల్డప్ ఇవ్వడం ఏమిటి అని వైఎస్సార్ సీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. ఈయనకు బీజేపీలో అంత పలుకుబడి ఉంటే ఇటీవల రెండు రోజులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కు పడిగాపులు కాసిన తన మాజీ బాస్ చంద్రబాబునాయుడు కోసం ఎందుకు ఉపయోగించలేదని ప్రశ్నిస్తున్నారు. ఈయన పరపతి ఉపయోగించి రాష్ట్ర ప్రజలు కోరుకొనే ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల అమలు, విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడం వంటి పనులు చేయవచ్చు కదా అన్న సూచనలు వినిపిస్తున్నాయి.

అప్పట్లో బాబును ఎందుకు ఒప్పించలేదు?

తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని శ్రీ కృష్ణ కమిటీకి తెలియజేశామని వెంకటేష్ చెప్పారు. వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి, తర్వాత హైకోర్టు కోసం ప్రయత్నం చేయాలని, లేకపోతే రెండూ పోతాయని టీజీ సూచించారు. విశాఖలో సెక్రటేరియట్ పెడితే తమ ప్రాంతానికి దూరం అవుతుందని, కాబట్టి కర్నూలులో కూడా మినీ సచివాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరి అమరావతిని ఏకైక రాజధాని చేయాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నప్పుడు టీడీపీలోనే ఉన్న టీజీ ఎందుకు ప్రశ్నించలేదు? సీమ ప్రయోజనాలకు అనుగుణంగా తన సూచనలతో బాబును ఎందువల్ల ఒప్పించలేదు అన్న ప్రశ్నలు సహజంగానే వినిపిస్తున్నాయి.

రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వాలి..

మూడు రాజధానులపై మళ్లీ చట్టం చేసి కోర్టుకు వెళ్లితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. అమరావతినే క్యాపిటల్‌గా ఉంచాలి. రాజధాని రైతులకు ముఖ్యమంత్రి ఎలాంటి భరోసా ఇవ్వకుండా వికేంద్రీకరణతో ముందుకు వెళ్లడం వల్లే సమస్య మొదలైందని అంటున్న వెంకటేష్ వారికి భరోసా ఇవ్వడం ఎందుకో వివరిస్తే బాగుండేది. అసలు రైతులకు వచ్చిన నష్టం ఏమిటి? వారి వద్ద తీసుకున్న భూమికి కౌలు చెల్లిస్తుండడమే కాక, వారికి ప్లాట్లు కూడా ప్రభుత్వం కేటాయించింది. శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతోంది. మరి అలాంటప్పుడు వారికి ఇంకా ఏమని భరోసా ఇవ్వాలి. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిందని ఉద్యమాలు చేయిస్తున్నవారి ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం పనిచేయాలా?

బీజేపీని ఒప్పించేది ఏముంది?

మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం వికేంద్రీకరణకు మొగ్గుచూపుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే ఇలా వింత ప్రతిపాదనలు చేయడం ఏమిటో? అసలు ఈ అంశంలో వెంకటేష్ బీజేపీని ఒప్పించేది ఏముంది? రాష్ట్ర ప్రభుత్వం కొత్త బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి, మూడు రాజధానులపై ముందుకు వెళతామని స్పష్టంగా చెప్పాక బీజేపీ సమ్మతితో పనేముంది? ప్రభుత్వం ప్రజల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటుంది కానీ రాజకీయ పార్టీల అంగీకారంతో కాదు కదా? ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా ఈ విషయంలో సలహాలు, సూచనలు ఇవ్వడం వరకూ ఓకే కానీ ఎవరినీ ఒప్పించనవసరం లేదని వెంకటేష్ గుర్తిస్తే మంచిది.

Also Read : 3 Capitals -టీడీపీ ఉక్కిరిబిక్కిరి, అధికార పార్టీ ఎత్తులతో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయం