iDreamPost
android-app
ios-app

బందరు పోర్టు పనులకు వడివడిగా అడుగులు

  • Published Jul 15, 2021 | 3:06 AM Updated Updated Jul 15, 2021 | 3:06 AM
బందరు పోర్టు పనులకు వడివడిగా అడుగులు

సుదీర్ఘకాలంగా కలగా మిగిలిపోయిన బందరు పోర్టు నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. దానికి సంబంధించి ఏపీ మారిటైమ్ బోర్డు టెండర్లు కూడా పిలిచింది. రూ 3645 కోట్ల విలువ చేసే పనులకు ఈనెల 24వ తేదీ గడువుతో టెండర్లు పిలిచారు. రివర్స్ టెండరింగ్ పద్ధతిలో కాంట్రాక్టర్ ని ఎంపిక చేస్తారు. మూడేళ్లలోపులోనే పనులు పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నట్టు ప్రకటించారు. దానికి అనుగుణంగా టెండర్లలో నిబందన విధంచారు.

బ్రిటీష్ వారి హయంలో ఓ వెలుగు వెలిగిన బందరు పోర్టు ఆ తర్వాత క్రమంగా కళ తప్పింది. దానిని పునరుద్దిరించాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. వైఎస్సార్ హయంలో ఓ ప్రయత్నం జరిగింది. చంద్రబాబు పాలనలో నవయుగ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించి, శంకుస్థాపన శిలాఫలకాలు వేసినా అంతటితోనే సరిపోయింది. చివరకు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఎన్నికల నాటి హామీకి కట్టుబడి బందరు పోర్టు నిర్మాణానికి పూనుకున్నారు. బందరుతో పాటుగా రాష్ట్రంలో మూడు చోట్ల పోర్టులు, ఆరు ఫిషింగ్ హార్బర్లు కూడా నిర్మిస్తూ సముద్ర తీర వనరులను సద్వినియోగం చేసుకునే దిశలో సాగుతున్నారు.

బందరు పోర్టుని తెలంగాణాకి అప్పగించేస్తున్నట్టు కొంతకాలం క్రితం టీడీపీ ఆరోపణలు కూడా చేసింది. కానీ ఏపీ ప్రభుత్వం ప్రైవేటు పోర్టు కాకుండా మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్మాణానికి పూనుకోవడం ఆసక్తికరం. అనుభవం కలిగిన కాంట్రాక్టర్ ని ఎంపిక చేసి పోర్టు నిర్మాణ పనులు వేగంగా సాగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్టు టెండర్ ప్రకటనలో పేర్కొన్నారు. దాంతో బందరు ప్రాంతీయుల కల సిద్ధించేందుకు సమయం ఆసన్నమయ్యిందనే అంచనాలు పెరుగుతున్నాయి.

బందరు పోర్టు అభివృద్ధి చేయడం ద్వారా ఒక నాటి ప్రధాన పట్టణం మచిలీపట్టణానికి మళ్లీ మంచిరోజులు వస్తాయని అంతా భావిస్తున్నారు. మంత్రి పేర్ని నాని దానికి అనుగుణంగా కృషి చేస్తున్నారు. కళ తప్పిన మచిలీపట్నం మరింత అభివృద్ధి సాధించేందుకు ఈ పోర్టు ఎంతో తోడ్పడుతుందని చెబుతున్నారు. చిత్తశుద్ధితో సర్కారు చేస్తున్న కృషి ఫలిస్తే కృష్ణా జిల్లాలో కీలక పోర్టు ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఎంతో మేలు చేస్తుందనే భావించవచ్చు.

Also Read : టీడీపీకి అతనితో తలనొప్పులే..