iDreamPost
android-app
ios-app

ఇకపై పుట్టిన వెంటనే ఆటోమేటిక్‌గా టెంపరరీ ఆధార్.. మరణం డేటా కూడా అప్‌డేట్..

  • Published Jun 15, 2022 | 8:37 PM Updated Updated Jun 15, 2022 | 8:37 PM
ఇకపై పుట్టిన వెంటనే ఆటోమేటిక్‌గా టెంపరరీ ఆధార్.. మరణం డేటా కూడా అప్‌డేట్..

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఇక నుంచి జననం నుంచి మరణం దాకా మొత్తం జీవిత చక్ర సమాచారాన్ని ‘ఆధార్’తో నిక్షిప్తం చేయనుంది. ఇందులో భాగంగానే రాబోయే రోజుల్లో బిడ్డ పుట్టిన వెంటనే వాళ్ల పేరిట ఆటోమేటిక్‌గా టెంపరరీ ఆధార్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. పుట్టిన వెంటనే ఆధార్‌ నెంబర్‌ పొందే చిన్నారులు ఆ తర్వాత వేలిముద్రలతో ఆధార్‌ను అప్ డేట్ చేసుకోవాలి.

అయితే ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకే త్వరలోనే రెండు పైలట్ కార్యక్రమాలను మొదలుపెట్టనుంది కేంద్రం. ఇందులో భాగంగానే UIDAI తరపున తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం. 2010లో ఆధార్ మొదలైనప్పటి నుంచి దేశంలో ఉన్న పెద్దలు అందరికీ ఆధార్ జారీ అయింది. ఇకపై పుట్టిన దగ్గర్నుంచి మరణించే వరకు వ్యక్తులకు సంబంధించిన అన్ని ముఖ్యమైన వాటికి ఆధార్ ను తప్పనిసరి చేసే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే చాలా వాటికి ఆధార్ తప్పనిసరి అయింది.

అలాగే మరణ రికార్డులతోనూ ఆధార్ డేటాను జతచేయడం వల్ల ప్రభుత్వ ప్రయోజనాలు పొందే విషయంలో దుర్వినియోగాన్ని అరికట్టాలని చూస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించి మరణించిన వారి వివరాలు వెంటనే ఆధార్ డేటా బేస్ లోకి చేరేలా UIDAI చర్యలు తీసుకోనుంది. ఇటీవల మరణించిన వారి ఆధార్ యాక్టివ్ గా ఉండడం వల్ల వారి పేరిట పెన్షన్ ఆటోమేటిక్‌గా జమ అవుతోంది. అందుకని ఇలాంటి వాటిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు UIDAI అధికారులు తెలిపారు. అలాగే కొంతమంది ఫేక్ ఆధార్ లు సృష్టిస్తున్నారని, ఒక వ్యక్తికి ఒక ఆధార్ మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.