Idream media
Idream media
నవ్విపోదురుగాక మాకేంటి..? అన్నట్లుగా ఉంది ఏపీలో ప్రతిపక్షాల పరిస్థితి. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం అయితే అధినేత చంద్రబాబు నాయుడు నుంచి కింది స్థాయి నేతల వరకూ ఒకే పంథా అవలంబిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆ పార్టీపై ప్రజలకున్న నమ్మకం తేలిపోయింది. కేవలం 23 సీట్లతో సరిపెట్టారు. అయినప్పటిక ప్రజాభీష్టం మేరకు పనిచేయకుండా సొంత అజెండా అమలు చేస్తున్నారు. ఫలితంగా ఆ 23 మంది ఎమ్మెల్యేలలో కూడా ఇప్పటికే ముగ్గురు, నలుగురు వైసీపీ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అప్పటికైనా చంద్రబాబు తనకు తాను ఓసారి పునఃపరిశీలించుకుని ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషిస్తే బాగుండేది. ప్రభుత్వంపైనో, లేదా సీఎం జగన్ పైనో కక్షతో అన్నట్లుగా ఆయన రాజకీయాలు చేస్తున్నారు. దేవాలయాల ఘటనపై ఆయన స్పందిస్తున్న తీరు, మాట్లాడుతున్న విధానాలే ఇందుకు నిదర్శనం.
ఇదిలా ఉండగా.. ఏపీలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై ప్రస్తుతం రచ్చ కొనసాగుతోంది. ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ అయిన నిమ్మగడ్డ వారి అభిప్రాయాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా సమావేశం ముగిసిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయడం వివాదాస్పదంగా మారింది. దీనిపై వైసీపీ ఎమ్మెల్యేలు నిమ్మగడ్డ రమేష్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా విపత్కర వేళ.. తమకు ఎన్నికల కంటే ప్రజారోగ్యం ముఖ్యమని చెబుతున్నారు. టీడీపీ నాయకులు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. ఎన్నికలు పెడితే ఓడిపోతామన్న భయంతోనే వైసీపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారని చెబుతున్నారు. వారి వ్యాఖ్యలకు నవ్వుకోవడం వైసీపీ నేతల ఒంతైంది.
ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. ‘కొవిడ్ ప్రభావం ఉందని 2022 జూన్ దాకా స్థానిక ఎన్నికలు జరపరా?. ప్రతిపక్షాలపై దాడులు, అన్నివర్గాల ప్రజలపై దౌర్జన్యాలు, చివరికి ఆలయాల ధ్వంసాలు. ప్రజల్లో ఆగ్రహం చూసే ఎన్నికల నిర్వహణకు సీఎం జగన్ రెడ్డి ఆటంకాలు సృష్టిస్తున్నారు. స్థానిక ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం జగన్ రెడ్డి అండ్ కో కు లేకనే ఈ జగన్నాటకం ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. అసలు ప్రభుత్వానికి ఆ అవసరం ఉందా..? 19 నెలల కాలంలోనే జగన్ ప్రవేశపెట్టిన, ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫలాల ఫలితాలు ఎలా ఉన్నాయో అక్కడి ప్రజల స్పందనను గమనిస్తేనే అర్థం అవుతోంది. అయినప్పటికీ ఈ తరహా వ్యాఖ్యలతో టీడీపీ నాయకులు నవ్వులపాలవుతున్నారు.
వాస్తవానికి గత మార్చిలోనే ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తి అయింది. అప్పటికి రాష్ట్రంలో కరోనా జాడలు కూడా పెద్దగా లేవు. అయినప్పటికీ ఎన్నికలు వాయిదా వేసి నిమ్మగడ్డ విమర్శల పాలయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పరిశీలిస్తే ఏపీలో 125 మండలాల్లో జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు ఏకగ్రీవం అయ్యారు. 652 జెడ్పీటీసీ స్థానాలకు గానూ సుమారు నాలుగో వంతు సీట్లు ఏకగ్రీవం కావడం విశేషంగా మారింది. ఇక ఎంపీటీసీలలో కూడా సుమారు 2080 స్థానాల్లో ఏకగ్రీవం జరిగాయి. వాటితో పాటుగా మున్సిపల్ వార్డుల్లో కూడా 159 చోట్ల ఏకగ్రీవం అయిపోయాయి.
అప్పటికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మొదలై ఏడాది కూడా కాలేదు. అయినప్పటికీ ప్రజలు ప్రభుత్వానికి, వైసీపీ అభ్యర్థులకు జై కొట్టారు. ఎన్నిక లేకుండానే చాలా మందిని ఏకగ్రీవంగా గెలిపించారు. ఆ తర్వాత కరోనా, లాక్ డౌన్ వంటి సంక్షోభ సమయంలోనూ ఏపీలో సంక్షేమ జోరు కొనసాగింది. కరోనా కట్టడిలో ఏపీ పేరు దేశంలోనే మార్మోగింది. లాక్ డౌన్ తో ప్రజలు ఉపాధి కోల్పోయినప్పటికీ ప్రభుత్వం అందించిన నగదు బదిలీ పథకాలతో ఆకలిదప్పులు లేకుండా బతికారు. ప్రభుత్వ పనితీరుకు కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసలు అందించింది. ఎంతో మంది ప్రముఖులు సీఎం జగన్ కు అభినందనలు తెలిపారు. ఇక తాజాగా ఇళ్ల స్థలాల పంపిణీ చారిత్రాత్మకంగా నిలుస్తోంది. పేదల గుండెల్లో జగన్ గూడుకట్టుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తే అది వైసీపీకే మంచిది. బ్రహ్మండమైన మెజార్టీతో అత్యధిక స్థానాలను ఆ పార్టీ అభ్యర్థులే సొంతం చేసుకోవడం ఖాయమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయినప్పటికీ అధికారం కన్నా ప్రజల ఆరోగ్యమే మిన్న గా భావిస్తూ ప్రభుత్వం స్థానిక ఎన్నికలను వాయిదా వేయమంటోంది. ఆ విషయం తెలుగుదేశం నేతలకు కూడా తెలియంది కాదు. కానీ.. ప్రజల కన్నా రాజకీయాలే ముఖ్యంగా భావిస్తూ తమ పంతం నెగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అది సరే కానీ.. ఓడిపోతామన్న భయంతోనే వైసీపీ ఎన్నికలు వద్దంటోందంటూ ప్రచారం చేస్తుండడమే విడ్డూరంగా మారింది.