iDreamPost
android-app
ios-app

టిడిపికి పడాల అరుణ రాజీనామా!!

టిడిపికి పడాల అరుణ రాజీనామా!!

పంచాయతీ ఎన్నికలు, వాటి వెంట మండల పరిషత్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో తెలుగుదేశానికి విజయనగరం జిల్లాలో గట్టి దెబ్బ తగిలింది. 1989-99మధ్య రెండుసార్లు గజపతినగరం ఎమ్మెల్యేగాను, ఐదేళ్లపాటు చంద్రబాబు ప్రభుత్వంలో మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రిగాను పని చేసిన సీనియర్ నాయకురాలు పడాల అరుణ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తనకు పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదని, ప్రస్తుత నాయకత్వం తనను గుర్తించడం లేదని ఆరోపిస్తూ ఆమె పార్టీని వీడారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అరుణ అప్పట్లో జిల్లాలో ప్రభావవంతమైన నాయకురాలిగా వెలుగొందారు. అయితే ఆ తరువాత జరిగిన రాజకీయ మార్పులు, పరిణామాల్లో నిలదొక్కుకోలేకపోయారు. కొత్త తరం రాజకీయాల్లోకి వస్తుండడం, సామాజిక మార్పులు, సమీకరణాలకు అనుగుణంగా మారకపోవడంతో క్యాడర్ మెల్లగా ఆమెకు దూరమయ్యారు. అప్పట్లో జిల్లాలో అశోక్ గజపతి రాజుతో సమానంగా పార్టీలో హవా కొనసాగించారు. అయితే ఆ తరువాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ టికెట్ దక్కించుకోలేక అవమానంగా ఫీలయ్యారు. ఆతరువాత పలుమార్లు పార్టీమీద తన అసంతృప్తిని వెళ్లగక్కినా పట్టించుకునేవాళ్ళు కరువయ్యారు. దీంతో ఇప్పుడు ఆమె అనివార్యంగా పార్టీని వీడారు.

అరుణ చూపు..బిజెపి వైపు!!

ఇదిలా ఉండగా అరుణ ఇప్పుడు బిజెపి వైపు నడుస్తారని భావిస్తున్నారు. బిజెపి ఇప్పుడు ఎలాగూ కాపు సామాజిక వర్గ మద్దతును కూడగట్టే పనిలో ఉంది. ప్రతిజిల్లాలోను బలమైన కాపు నాయకులను గుర్తించి తమవైపు లాక్కునే పనిలో బిజేపీ నేతలు ఉన్నారు. అందులో భాగంగానే ఆ మధ్య సోము వీర్రాజు వెళ్లి ముద్రగడ పద్మనాభం ను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. అదే క్రమంలో అరుణ సైతం బీజేపీలోకి వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆమెకు సొంత క్యాడర్ ఉందా లేదా అన్న సంగతి పక్కనపెడితే మాజీ మంత్రి హోదా, దానికితోడు కాపు ఫ్యాక్టర్ కారణంగా ఆమెకు బీజేపీలో సముచిత స్థానం దక్కవచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇలాంటి సీనియర్ నేతల నిష్క్రమణ పార్టీకి ఎంతోకొంత నష్టం చేకూర్చేదే అని కార్యకర్తలు అంటున్నారు.