Idream media
Idream media
తెలుగు జర్నలిజంలో సాక్షి దినపత్రిక ఓ సంచలనం. సాక్షి రాక ముందు.. సాక్షి వచ్చిన తర్వాత అనేలా జర్నలిజంలో మార్పులు చోటు చేసుకున్నాయి. 2008 మార్చి 24వ తేదీన సాక్షి ప్రారంభమైంది. నాడు యువ పారిశ్రామిక వేత్తగా, సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడుగా ఉన్న నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ పత్రికను ప్రారంభించారు. మెయిన్ నుంచి జిల్లా వరకు అన్ని కలర్ పేజీలతో రెండు రూపాయలకే పాఠకుడుకు సాక్షి అందింది. వార్తలు, ఉద్యోగుల జీతాలు, సంక్షేమం.. ఇలా అనేక అంశాల్లో స్పష్టమైన మార్పులు వచ్చాయి.
వార్తల్లో మార్పు.. పాఠకులకు ఛాయిస్..
మీడియాను ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అంటారు. ఇవి ఒకప్పటి మాటలు. మీడియాలోకి వ్యాపారులు, రాజకీయ నేతలు ప్రత్యక్షంగానూ, పరోక్షంగాను చేరడంతో.. తామనుకున్నదే ఆయా సంస్థలు రాసేవి. ముఖ్యంగా తెలుగు మీడియాలో ఆధిపత్యం చెలాయించే పత్రికలు ఓ పార్టీకి కొమ్ము కాయడంతో.. నాణేనికి ఒక వైపు మాత్రమే కనిపించేది. ఇలాంటి పరిస్థితుల్లోనే సాక్షి ఆవిర్భవించింది. నాణేనికి రెండో వైపును సాక్షి చూపించింది. అప్పటి వరకు తాము రాసిందే వార్త, చెప్పిందే నిజమనేలా వ్యవహరించిన సంస్థలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. 2008 నుంచి తెలుగు ప్రజలు నాణేనికి రెండు వైపులా చూస్తున్నారు. సాక్షి వల్ల పాఠకులకు ఆ అవకాశం దక్కింది. ఏది నిజం..? ఏది అబద్ధమో..? వారే ఓ నిర్ణయానికి వస్తున్నారు.
జీతాలు.. ఉద్యోగుల జీవితాలు..
సాక్షి రాక ముందు ఈనాడు వంటి అగ్రశ్రేణి పత్రికల్లోనూ జీతాలు అంతంత మాత్రంగానే ఉండేవి. ఎప్పుడైతే సాక్షి వచ్చిందో.. అప్పటి నుంచి ఈనాడు సహా ఇతర తెలుగు పత్రికలతోపాటు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఇంగ్లీష్ దిన పత్రికలు, టీవీ ఛానెళ్లలోని జర్నలిస్టులు, ఇతర విభాగాల సిబ్బందికి జీతాలు రెట్టింపయ్యాయి. అత్తెసరు జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న ఉద్యోగుల జీవితాల్లో సాక్షి వెలుగులు నింపింది. వేజ్ బోర్డును అమలు చేయాల్సి ఉన్నా.. పట్టించుకోని మీడియా సంస్థలు సాక్షి రాకతో ఉద్యోగులు జీతాలను పెంచడం ఇక్కడ గమనించాల్సిన అంశం. రాష్ట్ర, జిల్లా స్థాయి రిపోర్టర్లతోపాటు మండల స్థాయి విలేకర్లకు కూడా సాక్షి లైన్ అకౌంట్‌తోపాటు (వార్తలు రాసే దాన్ని బట్టి పారితోషకం ఇవ్వడం) గౌరవ వేతనం ఇచ్చింది. ఈ పరిణామం వల్ల ఇతర దిన పత్రికల్లోని మండల స్థాయి రిపోర్టర్ల అక్షరాలకు విలువ పెరిగింది.
జర్నలిస్టుల సంక్షేమం..
క్షేత్రస్థాయిలో ఉండే రిపోర్టర్లు, వారు పంపే వార్తలను కార్యాలయంలో తీర్చిదిద్దే సబ్ ఎడిటర్లు అనేక సవాళ్లు, ఒత్తిడుల మధ్య పని చేస్తుంటారు. క్షేత్రస్థాయిలోని రిపోర్టర్లు సమయపాలనతో సంబంధం లేకుండా అవసరమైనప్పుడు 24 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఇతర రంగాల్లోని ఉద్యోగులు సాయంత్రం ఇంటికి వెళ్లే సయమంలో సబ్ ఎడిటర్లు కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. అర్థరాత్రి 1, 2 గంటల వరకు పని చేయాలి. నిర్ణీత కాలంలో పని ముగించాలి. కాలంతో పరిగెత్తాల్సి ఉంటుంది. కాల చక్రానికి భిన్నమైన పని కావడంతో.. అనేక ఆనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అయినా అక్షరంపై మక్కువతో, కుటుంబ పోషణ కోసం ఈ పని చేస్తుంటారు. నాలుగైదేళ్లు ఈ పని చేసిన వారు.. ఇక మరే పని చేసేందుకు ఆసక్తి చూపలేరు. జర్నలిజం ఒక వ్యసనం లాంటిది.
ఇతర రంగాల్లోని ఉద్యోగులకు మంచి జీతంతోపాటు ఇతర అలవెన్సులు ఉంటాయి. వారి కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కంపెనీలు అనేక చర్యలు చేపడతాయి. కానీ మీడియాలో ఇలాంటి పరిస్థితి లేదు. కానీ సాక్షి ఆ పరిస్థితిని మార్చేసింది. ఉద్యోగి కుటుంబ సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుంది. ఎవరైనా ఉద్యోగి చనిపోతే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటోంది. పది లక్షల రూపాయలు అందిస్తోంది.
ఇప్పుడు కరోనా కాలంలోనూ తన ఉద్యోగుల కుటుంబాల గురించి సాక్షి ఆలోచించింది. కరోనా వైరస్ సోకి చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి అండగా నిలిచే నిర్ణయం తీసుకుంది. ఉద్యోగి మరణిస్తే.. ఆ కుటుంబానికి 12 నెలల వేతనం అందించేందుకు సిద్ధమైంది. ఉద్యోగి జీతం లేదా 25 వేల రూపాయలు.. వీటిలో ఏది ఎక్కువ అయితే ఆ మొత్తాన్ని అందించాలని సాక్షి యాజమాన్యం నిర్ణయించింది. వీటితోపాటు ఇన్యూరెస్స్ ద్వారా వచ్చే పది లక్షల రూపాయలు, ఉద్యోగికి కంపెనీ తరఫున వచ్చే పీఎఫ్, గ్రాట్యూటీ, ఫైనల్ సెటిల్‌మెంట్ చేయనుంది.
కరోనా వల్ల ఆదాయం పడిపోయిందంటూ కాస్ట్ కటింగ్ పేరుతో ఏళ్ల తరబడి కోట్లాది రూపాయలు ఆర్జించిన సంస్థలు ఉద్యోగులను నిర్ధాక్షణ్యంగా తీసేయగా.. సాక్షి మాత్రం తన ఉద్యోగులకు అండగా ఉండేలా నిర్ణయాలు తీసుకోవడం అభినందనీయం. ఉద్యోగుల రెక్కల కష్టంతో తమ సామ్రాజ్యాలను విస్తరించుకున్న కొన్ని మీడియా సంస్థల యాజమాన్యాలు కష్టకాలంలో ఆ ఉద్యోగులకు అండగా నిలవకపోవడంపై జర్నలిస్టుల్లోనే కాదు పాఠకుల్లోనూ చర్చ జరుగుతోంది.