తెలుగు సినిమాల్లో హీరోలకు ఒక విచిత్ర లక్షణం ఉంటుంది. హీరోలను కొట్టడానికి వచ్చిన ఫైటర్స్ కి రకరకాల రూల్స్ పెట్టి ఫైట్స్ చేస్తూ ఉంటారు. తనంతట తానుగా ఏదో ఒక అవసరంలేని ఛాలెంజ్ చేసి విలన్ మనుషులను మట్టి కరిపిస్తారు. ఈమధ్య ఈ పైత్యం తగ్గింది కానీ 1980ల్లో వచ్చిన తెలుగు సినిమాల్లో ఈ ఛాలెంజింగ్ ఫైట్స్ రాజ్యమేలాయి.
ముందుగా ఈ లిస్టులో చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవిని.. తెలుగు సినిమాల్లో చిరంజీవి ఫైట్స్ కి డాన్సులకు ఒక ట్రేడ్ మార్క్ ఉంది.. కేవలం అయన ఫైట్స్ కి ప్రత్యేకంగా అభిమానగణం ఉంది. కానీ ఆయన సినిమాల్లో విలన్లను ఛాలెంజ్ చేస్తూ చేసే పైత్యపు ఫైట్స్ కాస్త ఎక్కువే.. ముఖ్యంగా రుస్తుం సినిమాలో కుర్చీ నుండి కిందకు దిగకుండా విచిత్ర విన్యాసాలు చేస్తూ అయన సాగించే ఫైట్ చూస్తే ఆకాలపు ఫైట్ మాస్టర్లు దర్శకులు ఏ విధంగా ఆలోచించేవారో అర్ధం చేసుకోవచ్చు. ఆ తర్వాత అదే ట్రెండ్ కొంతకాలం తన సినిమాల్లో కొనసాగింది. యముడికి మొగుడు సినిమాలో విలన్ ఫైటర్స్ తనను కొట్టడానికి ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని చేతులు కట్టేసుకుని మరీ ఫైట్ చేస్తాడు(ఎందుకో అంత కష్టపడటం మరి). కొండవీటి రాజా,కొండవీటి దొంగ సినిమాల్లో మాత్రం కాలు కిందపెట్టకుండా ఫైట్ చేస్తానని ఛాలెంజ్ చేసి మరీ ఇరగదీసాడు. స్టేట్ రౌడీ లో స్కూటర్ ఫైట్ లో కూడా కాస్త అతి ఎక్కువగానే ఉంటుంది. ఏవేవో స్విచ్చులు నొక్కుతూ విలన్లను భయపెడతాడు చిరంజీవి.
ఇక ఆ తర్వాత వంతు బాలకృష్ణది..పల్నాటి పులి చిత్రంలో బాలకృష్ణ రిక్షా కింద కాలు పెట్టకుండా విలన్ల బెండు తీస్తాడు. ఇక “రాము” చిత్రంలో పెద్ద అద్దాలను రోడ్డు మధ్యలో అమర్చి అద్దాల రిఫ్లెక్షన్ సహాయంతో భలే ఫైట్ చేస్తాడు బాలకృష్ణ.. అదే లైట్ రిఫ్లెక్షన్ ను వాడి “విజయేంద్ర వర్మ”లో టెర్రరిస్టుల భరతం పడతాడు బాలయ్య. “పట్టాభిషేకం”లో గొడుగును కాస్త పారాచూట్ లాగ వాడుకుని హీరోయిన్ తో కలిసి విలన్ల బారి నుండి తప్పించుకుంటే, నిజమైన పారాచూట్ తో ఇండియా నుండి పాకిస్తాన్ వెళ్లి టెర్రరిస్టుల అంతు చూస్తాడు బాలకృష్ణ.
వెంకటేష్ ఒంటరి పోరాటం సినిమాలో ఓడలో కూడా బైక్ వేసుకుని విన్యాసాలు చేస్తాడు. మరో సినిమాలో రేండు చేతులపై సారాయి పోసుకుని నిప్పంటించుకుని మరీ ఫైట్ చేస్తాడు. ఆ మంటలవల్ల ఫైటర్లు కాలిపోతారు తప్ప వెంకటేష్ కి కనీసం వేసుకున్న చొక్కా కూడా కాలదు.. మరో ఫైట్ లో విమానం నడిపేస్తూ విలన్ గ్యాంగ్ ని విమానంతోనే అంతు చూస్తాడు..నాగార్జున విక్రమ్ సినిమాలో ఫ్రెండ్ కి పెళ్లి చేస్తూ, తోరణం దాటితే తాను ఓడిపోయినట్లే అని ఛాలెంజ్ చేసి మరీ ఫైట్ చేస్తాడు. ఘరానా బుల్లోడు సినిమాలో తెల్లబట్టలేసుకొచ్చి వాటిని నలుపు చేస్తే చాలని ఛాలెంజ్ విసురుతాడు. కానీ ఒక్కరు కూడా మరక అంటించలేరనుకోండి అది వేరే విషయం.
పాత సినిమాల్లో ఉన్న పోరాటాల్లో మరొక విషయం గమనించవచ్చు.. హీరో ఏ పని చేస్తే ఆ పనిని గుర్తించేలా ఫైట్స్ ఉండేవి. ఉదాహరణకు హీరో రిక్షా తొక్కితే రిక్షా ఫైట్స్, ఆటో నడిపితే ఆటోలతో ఫైట్స్ చేస్తుంటారు. అప్పట్లో అదే ట్రెండ్ మరి..
ఇప్పుడొస్తున్న సినిమాల్లో పాతకాలపు పైత్యాలు తగ్గినా అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో అలాంటి పైత్యపు ఫైట్స్ దర్శనం ఇస్తూనే ఉంటాయి. కాంచన మూవీలో లారెన్స్ సర్కిల్ గీసి మరీ ఫైటర్లను ఛాలెంజ్ చేస్తాడు. అతడులో మహేష్ బాబు, కందిరీగ సినిమాలో రామ్ హీరోయిన్ ని తాకితే చాలు హీరోయిన్ ని తీసుకెళ్లిపోవచ్చని విలన్లతో ఛాలెంజ్ చేస్తారు. అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ తన కళ్లజోడును ముట్టుకుంటే చాలని విలన్లను హెచ్చరిస్తాడు. దాన్ని తాకాలని ప్రయత్నిస్తున్న వారిని కొడుతూ ఛాలెంజ్ లో గెలుస్తాడు.
ఇలాంటి ఫైట్స్ లో ఉన్న కామెడి ఏంటంటే హీరో ఛాలెంజ్ చేసినప్పుడు హీరోని కొట్టడానికి ట్రై చేయకుండా హీరో చేసిన ఛాలెంజ్ ని పూర్తి చేయాలనే విలన్స్ చూస్తారు. ఇప్పుడొస్తున్న ఫైట్స్ చాలావరకు మారాయి కానీ హీరో కొట్టగానే ఫైటర్స్ నేలకి తగిలి బంతిలా గాల్లోకి బౌన్స్ అవుతుంటారు విలన్ మనుషులు. హీరోయిజం చూపించటం మంచిదే కానీ అవసరమైనంత వరకు సహజంగా చూపించడానికి డైరెక్టర్స్ కృషి చేస్తే ఆ సీన్స్ పండుతాయి. కానీ అనవసర హీరోయిజం కోసం ప్రయత్నిస్తే నవ్వుల పాలవ్వడం తప్ప మరేమి ఉండదు.