iDreamPost
android-app
ios-app

గల్ఫ్‌లో తీవ్ర విషాదం.. తెలుగు కుటుంబం దుర్మరణం!

గల్ఫ్‌లో తీవ్ర విషాదం.. తెలుగు కుటుంబం దుర్మరణం!

గల్ఫ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సౌదీ అరేబియానుంచి కువైట్‌కు వెళుతున్న ఓ తెలుగు కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. వారు ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కుటుంబంలోని నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. గురువారం చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణానికి చెందిన గౌస్‌భాషా పదవ తరగతి వరకు చదివాడు.

తర్వాత చదువు మానేసి ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశం అయిన కువైట్‌కు వెళ్లాడు. కొన్నేళ్ల క్రితం గౌస్‌కు పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఈ నేపథ్యంలోనే గౌస్‌ తన కుటుంబంతో కలిసి బెంగళూరులో స్థిరపడ్డాడు. అక్కడ తల్లిదండ్రులతో పాటు ఇతర కుటుంబసభ్యుల్ని ఉంచాడు. భార్యా పిల్లల్ని తనతో పాటు గల్ఫ్‌ తీసుకుపోయాడు. అప్పుడప్పుడు భార్యా,పిల్లలతో కలిసి బెంగళూరు వచ్చి వెళుతూ ఉన్నాడు. గురువారం గల్ఫ్‌లో ఉన్న గౌస్‌ ఫ్యామిలీ సౌదీ అరేబియాను నుంచి కువైట్‌కు కారులో ప్రయాణం అయింది.

ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో గౌస్‌, అతడి భార్యా.. ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే చనిపోయారు. పాస్‌పోర్టు ఆధారంగా వివరాలు రాబట్టేందుకు ఎంబసీ అధికారులు రాజంపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ మృతుల వివరాల కోసం ఆరా తీశారు. గౌస్‌ బంధువులు కొందరు రాజంపేటలోనే ఉండటంతో విషయం వెలుగులోకి వచ్చింది. మరి, తెలుగు కుటుంబం కువైట్‌లో జరిగిన కారు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.