iDreamPost
iDreamPost
‘జమ్మూ కాశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తాము. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తాము’ అని కేంద్ర హోమ్‌శాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన జమ్మూ, కాశ్మీర్ వాసుల్లో ఎంత సంతోషాన్ని నింపిందో తెలియదు కాని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ ప్రకటన చాలా ఆసక్తి రేకెత్తిస్తోంది. రెండు రాష్ట్రాల్లోను అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేస్తామని, అసెంబ్లీ సీట్లు పెంచుతామని రాష్ట్ర విభజన చట్టంలో ఉంది. కాని దీనిని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అటకెక్కించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ సీట్ల పెంపుకోసం గతంలో తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులు శక్తివంచన లేకుండా కృషిచేసినా ఫలితం దక్కలేదు.
2028లో దేశవ్యాప్తంగా చేపట్టినప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలలోను పునర్విభజన చేస్తామని కేంద్రం తెగేసి చెప్పడంతో నాటి ప్రయత్నాలు ఆగాయి. తాజాగా అమిత్ షా ప్రకటనతో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన రెండు రాష్ట్రాలలోను మరోసారి చర్చకు వచ్చింది. కాశ్మీర్‌లో నియోజకవర్గ పునర్విభజన చేస్తే ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా పునర్విభజన చేసి అసెంబ్లీ స్థానాలు పెంచాలని మాజీ ఎంపీ, తెలంగాణా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర హోమ్‌శాఖకు లేఖ రాశారు. వినోద్‌తోపాటు రెండు రాష్ట్రాలలో పలువురు నాయకులు ఈ డిమాండ్ చేయనున్నారని, వీరికి కొన్ని రాజకీయ పార్టీలు తోడు కానున్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Also Read : Chandrababu Delhi Tour – చంద్రబాబు కు మోడి దర్శనం దక్కనట్లే
రాష్ట్ర విభజన సమయంలో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలనే డిమాండ్ ప్రధానంగా వినిపించింది. ఇందుకు నియోజకవర్గ పునర్విభజన అమలు చేస్తామని నాటి యూపీఏ ప్రభుత్వం విభజన చట్టంలో పెట్టింది. ఇది అమలులోకి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 225 వరకు పెరుగుతాయి. అంటే కొత్తగా 50 నియోజకవర్గాలు ఏర్పడతాయి. అలాగే తెలంగాణాలో 119 ఉన్న అసెంబ్లీ స్థానాలు 153 వరకు అంటే 34 కొత్త స్థానాలు వస్తాయి. గతంలో దేశ వ్యాప్తంగా 2008లో పునర్విభజన జరిగింది. 2009 సాధారణ ఎన్నికల్లో కొత్త స్థానాల్లో ఎన్నికలు జరిగాయి.
2014లో రెండు రాష్ట్రాలలోను విడివిడిగా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణా సీఎం కేసీఆర్‌లు పునర్విభజన కోసం ప్రయత్నాలు చేశారు. ఇందుకోసం వీరిద్దరూ కేంద్రం విభజన చట్టంలో చేసిన చాలా విషయాలను సైతం వదులుకున్నారు. తెలంగాణాలో కేసీఆర్ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే పనిలో భాగంగా కాంగ్రెస్, టీడీపీలను చీల్చడం ద్వారా ఆ పార్టీ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తెచ్చుకున్నారు. అలాగే చంద్రబాబు సైతం వైఎస్సాఆర్ సీపీ ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున తన పార్టీలోకి తీసుకున్నారు. నియోజకవర్గాలలో ఉన్న పార్టీ ఇన్‌చార్జిలతోపాటు పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చేందుకు పునర్విభజన ఒక్కటే మార్గమని గుర్తించిన కేసీఆర్, చంద్రబాబులు పునర్విభజన కోసం కేంద్రంపై తీవ్ర స్థాయిలో వత్తిడి తెచ్చారు.
Also Read : Central Government Stopped Coal Supply – బొగ్గు సంక్షోభంలో విశాఖ ఉక్కు
బాబు అయితే చేయని ప్రయత్నమంటూ లేదు. నాటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న ఎం.వెంకయ్యనాయుడు ద్వారా మంత్రాంగం నడిపారు. అప్పటికే ప్యాకేజీ పేరుతో ప్రత్యేక హోదాను వదులుకున్న బాబు, నియోజకవర్గాల పెంపు కోసం ప్యాకేజీని సైతం వదులుకునేందుకు సిద్ధపడ్డారు. అయితే కేంద్రం ఈ డిమాండ్‌ను లైట్ తీసుకుంది. 2028 వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో పునర్విభజన ఉండదని లోక్‌సభలో ప్రకటించడమే కాకుండా, పలు సందర్భాలలో స్పష్టం చేసింది. తాజాగా కాశ్మీర్‌లో పునర్విభజన ప్రక్రియను చేపడతామని అమిత్ షా ప్రకటనతో తెలుగు రాష్ట్రాలలో కూడా నియోజవర్గాల పునర్విభజన అంశం తెరమీదకు రానుంది. అయితే ఈ డిమాండ్‌ను కేంద్రం ఎంత వరకు పరిశీలనకు తీసుకుంటుందో అనేది వేచి చూడాల్సి ఉంది.