iDreamPost
android-app
ios-app

కృష్ణా జలాల వివాదం : 50% వాటా కుదరదన్న కేఆర్‌ఎంబీ

కృష్ణా జలాల వివాదం : 50% వాటా కుదరదన్న కేఆర్‌ఎంబీ

కృష్ణా జలాల విషయంలో ఇన్నాళ్లు తెలంగాణ వ్యవహరించిన తీరు సరికాదని ఈ రోజు జరిగిన కృష్ణా యాజమాన్య మండలి (కేఆర్‌ంఎబీ) సమావేశంలో తేలిపోయింది. కృష్ణా జలాలను ఇరు రాష్ట్రాలకు సమానంగా 50- 50% పంచాలనడం, ఆయకట్టుతో సంబంధం లేకుండా నిరంతరంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడాన్ని కేఆర్‌ఎంబీ చైర్మన్‌ ఎంపీ సింగ్‌ తప్పుబట్టారు. తెలంగాణ తీరు పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకమని తేల్చారు.

శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలో నీటి అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని ఎంపీ సింగ్‌ స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ అధికారులు సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. ఐదు గంటల పాటు సాగిన సమావేశంలో నీటి పంపకం, వాడకం, ఇటీవల తలెత్తిన వివాదాలపై చర్చ జరిగింది.

కృష్ణా నదిలో వరదలేకపోయినా, శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టుల్లో నీరు డెడ్‌ స్టోరేజీకి చేరుకున్నా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి చేసింది. దీని వల్ల ఆయకట్టుకు తీవ్ర నష్టం జరుగుతుందన్న ఏపీ ఆందోళనను భేఖాతరు చేసింది. ఏపీ ఫిర్యాదుతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, కేఆర్‌ఎంబీలు విద్యుత్‌ ఉత్పత్తి ఆపాలని పలుమార్లు ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం పెడచెవినపెట్టింది. ఇప్పటికీ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. తాజా సమావేశంలో తెలంగాణ తీరు సరికాదని కేఆర్‌ఎంబీ చైర్మన్‌ ఎంపీ సింగ్‌ తేల్చి చెప్పడంతో.. ఇకనైనా నిబంధనల మేరకు తెలంగాణ నడుచుకుంటుందా అనేది ఆసక్తిరమైన అంశం.

జల వివాదం మొదలైన తర్వాత.. ఇరు రాష్ట్రాలు ప్రాజెక్టుల నిర్మాణం, నీటి వాడకంపై పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలను సమానంగా పంచాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల పంపిణీపై బచావత్‌ ట్రిబ్యూనల్‌ ఇచ్చిన అవార్డును పట్టించుకోకుండా 50–50 చొప్పన జలాలను పంచాలంటూ వాదించింది. ఈ వాదన కూడా సరికాదని కేఆర్‌ఎంబీ చైర్మన్‌ ఎంపీ సింగ్‌ తేల్చి చెప్పారు. బచావత్‌ ట్రిబ్యూనల్‌ ఇచ్చిన అవార్డు ప్రకారమే కృష్ణా జలాల వినియోగం ఉంటుందని స్పష్టం చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాలను ఆయా ప్రాంతాలలో ఉన్న ప్రాజెక్టుల ఆధారంగా నికర జలాలను కేటాయిస్తూ బచావత్‌ ట్రిబ్యూనల్‌ అవార్డును ప్రకటించింది. కృష్ణా జలాల్లో ఎగువ రాష్ట్రాలకు కేటాయించిన వాటా పోను ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు దక్కాయి. ఇందులో తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు 299 టీఎంసీలు, కోస్తా, రాయలసీమలోని ప్రాజెక్టులకు 511 టీఎంసీలను బచావత్‌ ట్రిబ్యూనల్‌ కేటాయించింది. రాష్ట్ర విభజన తర్వాత 2015లో ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి వద్ద జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు బచావత్‌ అవార్డు ప్రకారం నీటిని వాడుకునేందుకు అంగీకరించారు. ఇవేమీ పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలను ఇరురాష్ట్రాలకు సమానంగా పంచాలంటోంది. తాజాగా కేఆర్‌ఎంబీ చైర్మన్‌ ఎంపీ సింగ్‌ ఈ విషయంపై కూడా స్పష్టత ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తోందో వేచి చూడాలి.