iDreamPost
android-app
ios-app

ధ‌ర‌ణిలో చేరిన ప్ర‌జాప్ర‌తినిధులు!

ధ‌ర‌ణిలో చేరిన ప్ర‌జాప్ర‌తినిధులు!

తెలంగాణలో రెవెన్యూ పరిపాలన వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా ప్ర‌భుత్వం కొత్తగా ధరణి అనే వెబ్‌సైట్‌ను తీసుకొస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు ప్ర‌భుత్వ అధికారులు, సిబ్బంది ఇంటింటికీ తిరిగి వ్యవసాయేతర భూముల వివరాలను న‌మోదు చేయిస్తున్నారు. దానిపై ఉన్న సందేహాల‌ను తీరుస్తూ ఈ కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగిస్తున్నారు. తొలుత ఈ నెల 10 వ‌ర‌కూ అని భావించ‌గా.. మ‌రో ప‌ది రోజుల పాటు గ‌డువు పెంచుతూ కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌రిన్ని రోజులు పొడిగించే అవ‌కాశాలు కూడా ఉన్నాయి. ఈ కార్య‌క్ర‌మంలో ముందుగా ప్ర‌జా ప్ర‌తినిధులు అంద‌రూ ధ‌ర‌ణి వెబ్ సైట్ లో త‌మ వివ‌రాలు న‌మోదు చేయించుకుంటున్నారు. కొంద‌రు ఆన్ లైన్ లో చేసుకుంటుండ‌గా.. మ‌రికొంద‌రు ఇంటికి వ‌చ్చిన సిబ్బందికి త‌మ ఆస్తుల వివ‌రాలు వెల్ల‌డిస్తున్నారు.

స్వ‌యంగా వివ‌రాలు చెప్పిన కేసీఆర్

తెలంగాణలోని ప్రజలంతా తమ ఆస్తుల వివరాలు ధరణి పోర్టల్‌లో నమోదు చేసేందుకు సహకరించాలని సూచించిన సీఎం కేసీఆర్.. తన ఫామ్ హౌస్‌కు సంబంధించిన వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో తనను కలిసిన గ్రామ కార్యదర్శికి సీఎం కేసీఆర్ కొద్ది రోజుల క్రితం స్వ‌యంగా ఈ వివరాలు తెలియజేశారు. మర్కుక్ మండలం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పంచాయితీ రాజ్ అధికారులకు సాధారణ ప్రజల మాదిరిగానే సీఎం కేసీఆర్ తన నివాస గృహా వివరాలను స్వయంగా అందించారు. ఎర్రవెల్లి గ్రామ కార్యదర్శి సిద్దేశ్వర్ సీఎం కేసీఆర్‌ను కలిసి ఆయన నివాస గృహానికి చెందిన వివరాలను ఫొటోతో సహా ప్రత్యేకించిన అప్లికేషన్ TSNPB లో నమోదు చేశారు.

మంత్రులు, ఎంపీలు సైతం..

తెలంగాణ‌కు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ధ‌ర‌ణి యాప్ లో త‌మ ఆస్తుల వివ‌రాల‌ను న‌మోదుచేయించుకుంటున్నారు. ఇప్ప‌టికే రాజ్య‌స‌భ స‌భ్యుడు కె.కేశ‌వ‌రావు, ఎంపీ సంతోష్‌, మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్, గ్రేట‌ర్ ఎమ్మెల్యేలు ధ‌ర‌ణి యాప్ లో వివ‌రాలు న‌మోదు చేసుకున్నారు. త‌మ ఇంటికి వ‌చ్చిన సిబ్బందికి త‌మ వ్య‌వ‌సాయోత‌ర ఆస్తుల వివ‌రాల‌ను తెలియ‌జేస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు మార్గ‌ద‌ర్శ‌కంగా నిలుస్తున్నారు. ఇదే క్ర‌మంలో ఈ కార్య‌క్ర‌మంపై ప్ర‌జ‌ల్లో ఉన్న అపోహ‌లు తొల‌గేలా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నారు.

ఇదో మైలు రాయి..

దేశంలోనే తొలిసారిగా చేపట్టిన స్థిరాస్తుల నమోదు ప్రక్రియ చర్రితలో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు సీఎం కేసీఆర్ చెబుతున్నారు. ఆస్తులపై ప్రజలకు హక్కు, వాటికి భద్రత కల్పించేందుకు ప్రతి కుటుంబ స్థిరాస్తుల వివరాలను నమోదుచేస్తున్నామని తెలిపారు. గ్రామాలు, పట్టణాలలో ప్రాపర్టీ ల నమోదు దేశంలో మొట్టమొదటి అతి పెద్ద ప్రయత్నమన్నారు. వ్యవసాయ భూముల తరహాలో వ్యవసాయేతర ఆస్తులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ‘‘గ్రామీణ, పుర ప్రజలు తమ స్థిరాస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. ఆస్తులపై ప్రజలకు హక్కు, భద్రత కల్పించేందుకే ఈ కార్యక్రమం. ఆస్తుల నమోదు అనేది దేశంలోనే మొట్టమొదటి, అతి పెద్ద ప్రయత్నం’’ అని కేసీఆర్ ప్ర‌క‌టించారు.