iDreamPost
android-app
ios-app

Gazette Notification – ప్రాజెక్టులు అప్పగింత లేదు .. అధ్యయనం కోసం కమిటీ

Gazette Notification – ప్రాజెక్టులు అప్పగింత లేదు .. అధ్యయనం కోసం కమిటీ

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీ జలాల వివాదం ఇంకా మరికొన్ని రోజులు కొనసాగబోతోంది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య మండలి పరిధులను ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని ప్రాజెక్టులు, వాటి పరిధిలోని కేంద్రాలు, విద్యుత్‌ ప్రాజెక్టులను బోర్డులకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉండగా.. తెలంగాణ వైఖరి వల్ల ఆ పని మరికొంత ఆలస్యం కావడం ఖాయమైంది.

ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా నది జలాలు, ప్రాజెక్టుల విషయంలోనే వివాదాలు నెలకొని ఉన్నాయి. రెండు నదులపై ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిద్ధమైనా.. తెలంగాణ మాత్రం ముందు నుంచీ ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో 14వ తేదీన ప్రాజెక్టుల అప్పగింతపై నెలకొన్న సందేహాలు నిజమని తేలాయి. గత సోమవారం ప్రాజెక్టుల అప్పగింతపై ఏర్పాటు చేసిన ఉప సంఘం నివేదికపై ఇరు రాష్ట్రాల అధికారులతో కృష్ణా నదీ యాజమాన్య మండలి (కేఆర్‌ఎంబీ) చైర్మన్‌ ఎంపీ సింగ్‌ సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో ప్రాజెక్టులు అప్పగిచేందుకు తాము సిద్ధమని ఏపీ చెప్పగా.. 14వ తేదీన నిర్ణయం చెబుతామని తెలంగాణ ఉన్నతాధికారులు వివరించారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం తమ వైఖరిని తెలిపింది. ఇప్పటికిప్పుడు ప్రాజెక్టులను అప్పగించేది లేదని చెప్పిన తెలంగాణ.. సమగ్ర అధ్యయనం తర్వాతే నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొంది.

Also Read : గెజిట్ల అమలుకు వేళాయే..

ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించే విషయంపై లాభనష్టాలు, అప్పగిస్తే వచ్చే ఇబ్బందులు, కోల్పోయే అధికారాలు తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈఎన్‌సీ మురళీధర్‌రావు అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ అన్ని ప్రాజెక్టులపై అధ్యయనం చేసి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారమే ప్రాజెక్టుల అప్పగింతపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ సర్కార్‌ భావిస్తోంది.

తాము ప్రాజెక్టులను అప్పగించే విషయంపై ఇప్పటికీ ఒకే వైఖరితో ఉన్న ఏపీ ప్రభుత్వం. తెలంగాణ ముందుకు రాకపోవడంతో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించకుండా అధ్యయన కమిటీని ఏర్పాటు చేయడంతో ఆంధ్రప్రదేశ్‌ కూడా ప్రాజెక్టుల అప్పగింతను వాయిదా వేసుకుంది. తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి ప్రభుత్వం, ఉన్నతాధికారులతో చర్చించాలని జలవనరులశాఖ అధికారులు నిర్ణయించారు. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగానే ఏపీ ప్రభుత్వం తన నిర్ణయాలను వెలువరించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. 15 రోజుల్లో కమిటీ నివేదిక ఇచ్చినా.. దానిపై వెంటనే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదు. నివేదికలోని అంశాలపై చర్చించేందుకు మరికొంత సమయం తీసుకునే అవకాశాలైతే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులు ఎప్పుడు వస్తాయన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

Also Read : తెగని పేచీ.. కేఆర్‌ఎంబీ గెజిట్‌ అమలుపై ఉత్కంఠ