iDreamPost
iDreamPost
తెలంగాణ ఆర్టీసీ మరోసారి ప్రజలపై చార్జీల భారం మోపింది. ఈ ఏడాది మార్చిలోనే డీజిల్ సెస్సు పేరుతో రెండు నుంచి అయిదు రూపాయల దాకా పెంచింది. తాజాగా కిలోమీటరు వారీగా మళ్ళీ డీజిల్ సెస్సును వడ్డించింది. అలాగే విద్యార్థుల బస్ పాసు ఛార్జీలను కూడా పెంచాలని అనుకుంటుంది. దీంతో మరోసారి సామాన్య ప్రజలపై భారీ భారం పడనుంది. డీజిల్ భారం భరించలేకే మరో దఫా సెస్సును పెంచుతున్నట్టు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్‌లు ప్రకటించారు.
పెరిగిన చార్జీలు నేటి(జూన్ 9) నుంచే అమలు కానున్నాయి. వివిధ బస్సుల్లో కిలోమీటర్ల చొప్పున ఈ డీజిల్ సెస్ ని వివిధ రకాలుగా పెంచారు. పల్లెవెలుగు బస్సుల్లో 250 కి.మీ దూరానికి రూ.5 నుంచి 45 రూపాయలు పెంచారు. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో 500 కి.మీ దూరం వరకు రూ.5 నుంచి రూ.90, డీలక్స్ బస్సుల్లో 500 కి.మీ వరకు రూ.5 నుంచి రూ.125, సూపర్ లగ్జరీ బస్సుల్లో 500 కి.మీ వరకు రూ.10 నుంచి రూ.130 వరకు పెంచారు. ఏసీ సర్వీసులలో 500 కి.మీ వరకు రూ.10 నుంచి రూ.170 వరకు పెంచారు.
దీంతో వేరే ఊళ్ళకి ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఏ బస్సు ఎక్కినా భారం తప్పదు. మార్చిలోనే పెంచి మళ్ళీ ఇప్పుడు పెంచడంతో జనాలు గగ్గోలు పెడుతున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ డీజిల్ సెస్ పెంపు లేకపోవడం కాస్తంత ఊరట.