iDreamPost
iDreamPost
ఏదైనా తన దాకా వచ్చే వరకు తెలియదట. తెలంగాణ సీఎం కేసీఆర్ పరిస్థితి కూడా ఇలాంటిదే. తనకు, తన కొడుక్కి కరోనా సోకే సరికి ఆయన మేల్కొన్నారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత, ప్రజల అవస్థలు అర్థమయ్యాయి. టెస్టులు, ట్రీట్ మెంట్, వ్యాక్సినేషన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ అన్నివైపుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న కేసీఆర్.. శనివారం సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించారు. ఇందుకోసం రూ.2,500 కోట్లు ఖర్చు అవుతుందని, ప్రజల ఆరోగ్యం కంటే డబ్బు ముఖ్యం కాదని పేర్కొన్నారు.
నాలుగు కోట్ల మందికి..
మే 1వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన వాళ్లకు వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. తమ రాష్ట్ర ప్రజలకు ఫ్రీగా టీకాలు వేస్తామని ఏపీ సహా కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ క్రమంలో తెలంగాణలో వ్యాక్సినేషన్ పై సీఎస్‌కు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వయసుతో పని లేకుండా ప్రతి ఒక్కరికీ ఉచితంగా టీకాలు వేస్తామని ప్రకటించారు. వ్యాక్సినేషన్ కోసం రూ.2,500 కోట్లకుపైగా ఖర్చవుతుందని.. భారత్ బయోటెక్, రెడ్డీ ల్యాబ్స్ సహా కొన్ని సంస్థలు ముందుకొచ్చాయని చెప్పారు. దీంతో తెలంగాణలో మొత్తంగా 4 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రజలు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారికి కూడా టీకా వేయనున్నారు. ఇప్పటిదాకా 35 లక్షల మందికి వ్యాక్సిన్ అందించిన సర్కార్.. ఇక రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభాకు వ్యాక్సిన్ పంపిణీ చేయనుంది.
మొదటి నుంచీ విమర్శలు
కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ విమర్శలు ఎదుర్కొంటోంది. టెస్టులు సరిగ్గా చేయట్లేదని, ట్రీట్ మెంట్ సరిగ్గా అందించడం లేదని ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. కేసులు, టెస్టుల సంఖ్యను దాచిపెడుతున్నారని చివరికి హైకోర్టు కూడా మండిపడింది. పలు సార్లు మొట్టికాయలు వేసింది. ఘాటుగా కామెంట్లు చేసింది. ఒక్కోసారి ఒక్కోమాట చెబుతున్నారని, ఏది నిజమో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు గతేడాది ఏప్రిల్ మొదట్లో కరోనాపై హడావుడి చేసిన కేసీఆర్.. తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆయన వేసుకోలేదు. కనీసం వ్యాక్సిన్ వేసుకోవాలంటూ ప్రజలకు కూడా చెప్పలేదు.
ఇకనైనా గాడిలో పెడుతారా?
తాను కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత అధికారులతో సమీక్షిస్తానని కేసీఆర్ వెల్లడించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. రెమ్ డెసివిర్, ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. జిల్లాల వారీగా ఇన్ చార్జ్ లను నియమించి వ్యాక్సిన్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. అయితే ప్రతిసారి ఇలానే హామీలు ఇవ్వడం.. తర్వాత చల్లబడటం షరా మామూలైపోయింది.. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రులు అడ్డగోలుగా ఫీజులు వసూళ్లు చేస్తున్నాయి. మరోవైపు అంత్యక్రియలకు కూడా తిప్పలు తప్పడం లేదు. కరోనాతో చనిపోయిన వారి డెడ్ బాడీలను కాల్చాలంటే 50 వేలకు పైనే వసూలు చేస్తున్నారు. మెడికల్ ఆక్సిజన్ సిలిండర్ల కొరత వేధిస్తోంది. రెమ్ డెసివిర్ మందులను బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు. వీటిపై ఇప్పటికైనా కేసీఆర్ దృష్టి పెట్టాలని, పరిస్థితిని గాడిలో పెట్టాలని జనం కోరుకుంటున్నారు.
ఆరోగ్యశ్రీలోకి ఎప్పుడు చేరుస్తారు?
అందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించిన కేసీఆర్.. 6 నెలల కిందట తాను ఇచ్చిన హామీ గురించి మాత్రం మాట్లాడటం లేదు. కరోనాను ఆరోగ్యశ్రీలోకి చేరుస్తామని, తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామని గతంలో ప్రకటించారు. కానీ ఇప్పటికీ అది అమల్లోకి రాలేదు. మరోవైపు ట్రీట్ మెంట్ కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్న జనం.. లక్షలకు లక్షలు బిల్లులు చెల్లించి అప్పులపాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రీట్ మెంట్ గురించి కూడా కేసీఆర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.