iDreamPost
android-app
ios-app

Telangana election code -కోడ్ ముగిశాక వార్ పెర‌గ‌నుందా..?

Telangana election code -కోడ్ ముగిశాక వార్ పెర‌గ‌నుందా..?

కొద్ది కాలం క్రితం వ‌ర‌కు తెలంగాణ రాజ‌కీయాల్లో వార్ వ‌న్ సైడే అన్న‌ట్లుగా ఉండేది. అధికార పార్టీ టీఆర్ఎస్‌కు తిరుగులేద‌నే ప‌రిస్థితి క‌నిపించేది. ప్ర‌స్తుతం రాజ‌కీయ ముఖ‌చిత్రంలో మార్పు వ‌స్తోంది. గ్రేట‌ర్ ఎన్నిక‌లు, ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ప‌రిశీలిస్తే.. టీఆర్ఎస్ కు పోటీ పెరుగుతుంద‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. కాగా, ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో జోష్ మీదున్న బీజేపీ, టీఆర్ఎస్ కు ప్రాధాన్యం త‌గ్గుతున్న దృష్ట్యా అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవాల‌ని కాంగ్రెస్ ప్ర‌జాక్షేత్రంలో దూసుకెళ్ల‌డానికి ప్రయ‌త్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి రావడంతో ప్ర‌తిప‌క్షాల యాత్ర‌ల‌కు, ఆందోళ‌న కార్య‌క్ర‌మాల‌కు కాస్త బ్రేక్ ప‌డింది. కోడ్ ముగిశాక స‌ర్కారుపై యుద్ధానికి ప‌టిష్ట‌మైన ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నాయి విప‌క్షాలు.

2023 అసెంబ్లీ ఎన్నిక‌లు గ‌త రెండు ప‌ర్యాయాలు కంటే భిన్నంగా జ‌రిగేలా క‌నిపిస్తున్నాయి. రాష్ట్రంలో అనూహ్యంగా బీజేపీ పుంజుకుంటోంది. బ‌లాన్ని, బ‌ల‌గాన్ని పెంచుకుంటోంది. కేసీఆర్ కు ధీటుగా బీజేపీ నేత‌ల స‌వాళ్లు ఉంటున్నాయి. ఎన్నిక‌ల నాటికి ప‌రిపూర్ణంగా స‌న్న‌ద్ధ‌మ‌వుతామ‌ని కాంగ్రెస్ ప్ర‌క‌టిస్తోంది. ఈ నేప‌థ్యంలో భ‌విష్య రాజ‌కీయ తెలంగాణ రంజుగా ఉండ‌నుంది. ఈ మేర‌కు ఇప్ప‌టి నుంచే అన్ని పార్టీలూ స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, బీఎస్ పీ (ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్).. స‌ర్కారుపై దాడి చేస్తూనే ఉన్నాయి. సభలు సమావేశాలు ర్యాలీలు పాదయాత్రల పేరుతో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఇక ఈ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు ప్రత్యర్థి పార్టీలు సన్నద్ధమయ్యాయి. కానీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి రావడంతో ఇప్పుడా పార్టీ కార్యకలాపాలకు బ్రేక్ పడ్డట్లయింది.

Also Read : Kerala Cadre IPS Officer, Gungunata Lakshman Nayak – నాయకుడు అవ్వాలనుకుని.. నిందితుడైన పోలీస్ బాస్!

రాజన్న రాజ్యమే లక్ష్యంగా ఈ ఏడాది జులై 8న తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పేరుతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిన షర్మిల.. కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా నిరుద్యోగ సమస్యను భుజాలకెత్తుకున్న ఆమె పోరుబాటలో కదులుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేందుకు అక్టోబర్ 20న ఆమె ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సుమారు ఏడాదికిపైగా దాదాపు 4 వేల కిలోమీటర్లు చుట్టేసేలా ఈ పాదయాత్రకు ప్లాన్ చేశారు. కానీ ఇటీవల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో కోడ్ అమల్లోకి రావడంతో పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు.

ఇక గతేడాది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన బండి సంజయ్ తన దూకుడుతో పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతంపై దృష్టి సారించడంతో పాటు కేసీఆర్పై మాటల తూటాలు పేలుస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు షాకిచ్చిన బీజేపీ.. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికలోనూ విజయం అందుకుంది. మరోవైపు రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఆగస్టు 28న మొదలైన ఆయన తొలి విడత పాదయాత్ర 36 రోజుల పాటు 438 కిలోమీటర్లు సాగి అక్టోబర్ 2న ముగిసింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక విజయమిచ్చిన ఊపుతో రెండో విడత పాదయాత్రను ఆయన నవంబర్ 21 నుంచి మొదలెట్టాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ కారణంగా దాన్ని వాయిదా వేశారు.

మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికలో దారుణమైన ఫలితాలతో ఢీలా పడ్డ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో పాదయాత్రను వాయిదా వేసుకోవడమే మేలని భావించినట్లు తెలుస్తోంది. నవంబర్ 14 నుంచి 21వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ జన జాగరణ ప్రజాచైతన్య యాత్రలు పాదయాత్రలు నిర్వహించాలనుకుంది. కానీ ప్రస్తుతం పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలతో పాటు ఎన్నికల కోడ్ కారణంగా ఈ యాత్రలను పార్టీ వాయిదా వేసుకున్నట్లు సమాచారం. కోడ్ ముగిస్తే అన్ని పార్టీలూ త‌మ భ‌విష్య కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మ‌రి స‌ర్కారుపై పోరుకు ఎటువంటి నిర్ణ‌యాలు వెలువ‌రించ‌నున్నాయో వేచి చూడాలి.

Also Read : Telangana Congress -కాంగ్రెస్ మార‌దేంట‌య్యా..!?