iDreamPost
android-app
ios-app

కేసులు.. ఆందోళ‌న‌ల చుట్టూ తెలంగాణ రాజ‌కీయాలు

కేసులు.. ఆందోళ‌న‌ల చుట్టూ తెలంగాణ రాజ‌కీయాలు

ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర‌కు పైగా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ.. తెలంగాణ రాజ‌కీయాలు ఇప్ప‌టి నుంచే కాక పుట్టిస్తున్నాయి. ప్ర‌ధానంగా కేంద్రంపై కేసీఆర్ స‌ర్కారు తిరుగుబావుటా మొద‌లుపెట్టిన నాటి నుంచీ బీజేపీ కూడా దూకుడు పెంచింది. రాష్ట్రంలో రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తోంది. ఏదో అంశంపై ఆందోళ‌న‌లు చేప‌డుతూ అగ్గిరాజేస్తోంది.కోవిడ్ వేళ ఇలాంటి ప‌రిస్థితుల‌పై స‌ర్కారు ఉక్కుపాదం మోపే ప్ర‌య‌త్నం చేస్తోంది. దీంతో నేత‌ల‌పై కేసులు పెడుతూ జైలుకు పంపుతోంది. 317 జీవోను సవరించాలని కరీంనగర్ పట్టణంలో బీజేపీ చేపట్జిన జన జాగరణ దీక్షలో కోవిడ్ నిబంధనలు పాటించలేదని బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో మూడ్రోజుల పాటు బండి సంజయ్ జైల్లో ఉండి.. విడుదలయ్యారు. ఈ కేసుల‌పై ఇప్పుడు ఆందోళ‌న‌ల‌కు శ్రీ‌కారం చుడుతోంది బీజేపీ.

బంద్ కు పిలుపు..

బండి సంజ‌య్ అరెస్టుకు నిర‌స‌న‌గా మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ లో చేప‌ట్టాల‌నుకున్న బీజేపీ ర్యాలీకి పోలీసులు బ్రేక్ వేశారు. ర్యాలీలో పాల్గొనేందుకు ఏకంగా జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా విచ్చేశారు. ర్యాలీ చేస్తా.. ఎలా ఆపుతారో చూస్తా.. అంటూ స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. కానీ పోలీసుల ఆంక్ష‌ల‌తో చివ‌ర‌కు ర్యాలీ చేప‌ట్ట‌కుండా నిర‌స‌న‌తోనే స‌రిపెట్టారు. కానీ.. తాజాగా అక్ర‌మ అరెస్టుల‌కు నిర‌స‌న‌గా, 317 జీవోను పునఃసమీక్షించాలని అంటూ.. ఈ నెల 10న తెలంగాణ బంద్ కు బీజేపీ పిలుపు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేక జీవో అక్రమ అరెస్టులు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకు వచ్చిన 317 జీవోను పునఃసమీక్షించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అలాగే, ఇందుకు నిరసనగా ఆందోళన చేస్తున్న  వారిమీద అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

గుండు పోతే గుండు ఫ్రీగా వస్తుందా?..

మ‌రోవైపు టీఆర్ ఎస్ కూడా బీజేపీ రాజ‌కీయాల‌పై హాట్ కామెంట్స్ చేస్తోంది. ఆ పార్టీ ఆరోప‌ణ‌ల‌ను తిప్పికొడుతోంది. ఈ విష‌యంలో కేటీఆర్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కరీం‌నగర్‌లో జన జాగరణ దీక్ష భగ్నం సందర్భంగా పోలీసుల ఎదుట బండి సంజయ్ తనకు తానే తలను నెలకు కొట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆపడంతో బండి సంజయ్ తలకు స్వల్పంగా గాయమైంది. అయితే బండి సంజయ్ అలా చేయడం పట్ల మంత్రి కేటీఆర్ విమర్శలు కురిపించారు. బండి సంజయ్ పిచ్చోడని, ఎప్పుడు ఏం మాట్లాడతాడో.. ఏం చేస్తాడో ఆయనకే తెలియదని కేటీఆర్ విమర్శించారు. బండి పోతే బండి ఫ్రీగా వస్తుందని, గుండు పోతే గుండు ఫ్రీగా వస్తుందా?. అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

జేపీ న‌డ్డాపై కూడా కేటీఆర్ నిప్పులు చెరిగారు.

ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేందుకు నడ్డాకు సిగ్గుందా అని కేటీఆర్ నిలదీశారు. కేసీఆర్ పట్ల జేపీ నడ్డా వ్యాఖ్యలు హేయంగా ఉన్నాయన్నారు. బండి సంజయ్‌కి, జేపీ నడ్డాకు పెద్ద తేడా ఏమీ లేదన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన అని కువిమర్శలు చేస్తున్నారన్నారు. ఉద్యమంలో పాల్గొన్న నేతలు పాలించకూడదా అని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీలో కుటుంబ పాలన గురించి ఎందుకు చెప్పట్లేదని ఆయన నిలదీశారు. కేంద్ర హోం అమిత్‌షా కుమారుడికి బీసీసీఐ పదవి ఎలా వచ్చిందో నడ్డా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జేపీ నడ్డా అత్త జయశ్రీ బెనర్జీ మంత్రిగా లేరా అని ఆయన ప్రశ్నించారు. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను మార్చింది మీరు కాదా అని కేటీఆర్ మండిపడ్డారు. నీతి ఆయోగ్‌కు ఉన్న నీతి కూడా నడ్డాకు లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు.