iDreamPost
android-app
ios-app

తెలంగాణా పీసీసీ వార్ మళ్లీ మొదలైంది…!

తెలంగాణా పీసీసీ వార్ మళ్లీ మొదలైంది…!

కాంగ్రెస్ పార్టీలో కలహాలు కొత్తేమీ కాదు… సాధారణ స్థాయి పోస్ట్ నుంచి.. సీఎం స్థాయి సీటు వరకూ ఏ అంశం తెరపైకి వచ్చినా నాయకులందరూ… నాకంటే నాకు ఇవ్వాలంటూ.. పోటీ పడతారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. ఇప్పుడు తెలంగాణ పీసీసీ పీఠం కోసం కూడా అదే జరుగుతోంది. రేసులో నేను ఉన్నాను అంటే.. నేనున్నాను అని పార్టీ కీలకంగా భావించే నేతలందరూ బాహాటంగానే ప్రకటిస్తున్నారు.

ప్రధానంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మల్కాజగిరి ఎంపీ రేవంత్ రెడ్డి.. సమయం వచ్చినప్పుడల్లా.. పీసీసీ పై తమకున్న ఆసక్తిని వెలిబుచ్చుతున్నారు. కరోనా, లాక్ డౌన్ వంటి పరిస్థితుల నేపథ్యంలో కొన్ని నెలలుగా దీనిపై చర్చ నిశబ్దంగా సాగుతోంది. ఇప్పుడు తాజాగా జగ్గారెడ్డి వ్యాఖ్యలతో మళ్లీ పీసీసీ పీఠం కథ తెరపైకి వచ్చింది. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయినప్పుడే.. పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్పు అనివార్యమని ఎవరికి వాళ్ళు ఆ పదవి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

పీసీసీ రేసులో రేవంత్ రెడ్డి పేరు ప్రముఖంగా వినపడు తుండడతో.. ఆయనకు తప్ప ఎవరికి ఇచ్చిన ఓకే అంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా ప్రకటించాడు,పీసీసీ రేసులో నేను కూడా ఉన్నానని చెప్పారు. వచ్చే ఎన్నికల వరకు ఉత్తమ్ ని కొనసాగిస్తే తనకు అభ్యంతరం లేదని వెల్లడించారు. మా పార్టీలో మళ్లీ రాజకీయాలు మొదలయ్యాయని, రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే మాత్రం నా కొత్త రాజకీయాలు చూస్తారని విభిన్న వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ కాంగ్రెసులో మళ్లీ లొల్లి కి శ్రీకారం చుట్టారు. జగ్గారెడ్డి ఇప్పుడు తాజాగా ఈ అంశం లేవనెత్తడానికి సోషల్ మీడియా వేదికగా రేవంత్ అనుచరులు చేస్తున్న ప్రచారమే అసలు కారణం. అయితే.. జగ్గారెడ్డి వ్యాఖ్యలపై రేవంత్ ఏమంటారో, మిగిలిన వాళ్ళు కూడా ఇప్పుడు తమ వాయిస్ వినిపిస్తారేమో చూడాలి.