Idream media
Idream media
కొద్ది రోజుల ముందు వరకూ జీహెచ్ఎంసీ గల్లీల్లో హోరాహోరీగా పోరాడిన ప్రధాన పార్టీల నేతలందరూ ఇప్పుడు ఢిల్లీకి క్యూ కడుతున్నారు. కారణాలు వేరైనా.. పార్టీలు వేరైనా ఎన్నికలు ముగిసిన అనంతరం నేతలందరూ ఢిల్లీకి వెళ్తుండడం ఆసక్తికరంగా మారింది. తొలుత ఈ నెల 11న ఢిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ మూడు రోజుల పాటు అక్కడే పర్యటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. దేశ, రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. వరదల కారణంగా ఏర్పడిన నష్టం, తలెత్తిన ఇబ్బందులపై చర్చించి కేంద్ర నుంచి అందాల్సిన సహాయం, ఇతర అంశాలపై మాట్లాడారు. అలాగే పెండింగ్ లో ఉన్న జీఎస్టీ బకాయిలు విడుదల చేయాలని, సాగునీటి ప్రాజెక్టులకు సహాయం చేయాలని, నీతి అయోగ్ సిఫార్సు చేసిన రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని కూడా కేంద్రాన్ని కోరినట్లు తెలిసింది.
కేసీఆర్ పర్యటన ముగించుకుని ఆదివారం రాష్ట్రానికి చేరుకున్నారు. ఆయన వచ్చిన వెంటనే మరో ప్రధాన పార్టీ బీజేపీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ వెళ్లారు. ఆయన కూడా బీజేపీ ముఖ్యులతో సమావేశమయ్యారు. కేసీఆర్ వెళ్లి వచ్చిన వెంటనే బండి వెళ్లడంతో కారు వెనుకే బండి.. అంటూ ఆసక్తికర చర్చలు నడిచాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు కాంగ్రెస్ కు చెందిన ముఖ్య నేతలంతా ఢిల్లీకి క్యూ కడుతున్నారు. బుధవారం ఉదయం ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో సోనియా – కోమటిరెడ్డి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. పీసీసీ పదవి ఆశిస్తున్నవారిలో కోమటిరెడ్డి ప్రముఖంగా ఉన్నారు. ఓ దశలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికే పీసీసీ పీఠం అన్న ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పీసీసీ పదవి ఇవ్వాలని సోనియాను కోరినట్లుగా ఆయన అనుచరులు చెబుతున్నారు.
ఇదే క్రమంలో మరో ఎంపీ రేవంత్‌రెడ్డి కూడా ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. డిఫెన్స్ కమిటీ సమావేశంలో ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ తో పాటు రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేసులో మొదటిగా వినిపిస్తున్న పేరు రేవంత్ రెడ్డి. ఇటీవల టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణకు కొత్త రథసారధిని నియమించే పనిలో అధిష్టానం దృష్టి పెట్టింది. ఈ మేరకు ఏఐసీసీ కసరత్తు ప్రారంభించింది. కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణికం ఠాగూర్ తెలుసుకున్నారు. రాష్ట్రంలోని పార్టీ నుంచి పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచీ అభిప్రాయాలనూ మాణిక్కం ఠాగూర్ తీసుకోనున్నారు. పీసీసీ చీఫ్ పదవిపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు ఇప్పటికే ప్రారంభించింది. ఈ మేరకు ఐదుగురి పేర్లతో కూడిన జాబితా కాంగ్రెస్ అధిష్టానం వద్దకు చేరినట్లు తెలుస్తోంది.
ఇటీవలే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను కలిసి వచ్చారు. ఆ వెంటనే బీజేపీ నేత బండి సంజయ్ కూడా ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. వరుసగా ప్రధాన పార్టీల నేతలంతా హస్తినకు వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది.