Idream media
Idream media
ఈటల రాజేందర్ భర్తరఫ్ ఎపిసోడ్ నుంచి రాజీనామా, మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచే వరకు తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా మారాయి. హుజూరాబాద్ లో జరిగింది ఉప ఎన్నికే అయినప్పటికీ, ఈటల ఆత్మాభిమానం వర్సెస్ కేసీఆర్ ప్రతిష్ట గా మారిపోయింది. దీంతో అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ రెండూ హోరాహోరీగా పోరాడాయి. అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం అందుకోలేక పోయింది. దీనంతటికీ కారణం ఈటలపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలు, ప్రభుత్వ చర్యలు. వాస్తవానికి కబ్జా ఆరోపణలు ఓ సాకు అనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే, ఈటల భర్తరఫ్ కావడం, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనమా చేసి మళ్లీ గెలవడం అన్నీ జరిగిపోయాయి. కానీ ఆ కేసు మాత్రం ఇప్పటికీ అలానే ఉంది.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామ వాసులు కొందరు.. తమ భూములను ఈటల రాజేందర్ ఆక్రమించాడంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు భూకబ్జాను తేల్చాలంటూ రెవెన్యూ, అటవీ, అవినీతి నిరోధక, విజిలెన్స్ శాఖలను ఆదేశించారు. సీలింగ్ భూములు, అసైన్డ్ భూముల ఆక్రమణను తేల్చేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా నియమించారు. అయితే, అప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి భర్తరఫ్ చేశారు. ఇప్పుడు కబ్జా నిజమని తేలడంతో ఈటలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. తాజాగా ఈటల భూకబ్జా వాస్తవమే అని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రకటించారు.
Also Read : Bjp ,Corporate Funds – బీజేపీ కి కార్పోరేట్ కనకాభిషేకం
మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్ పరిధిలో అసైన్డ్ భూములను జమునా హ్యాచరీస్ కబ్జా చేసిందని స్పష్టం చేశారు. 70.33 ఎకరాల భూమిని జమునా హ్యాచరీస్ కబ్జా చేసినట్లు రెవెన్యూ అధికారుల సర్వేలో తేలిందని వెల్లడించారు. ఈ మేరకు మెదక్ కలెక్టర్ హరీష్ ఆధ్వర్యంలో సర్వే జరిపిన కమిటీ.. అచ్చంపేట, హకీంపేట పరిధిలో గల సర్వే నెంబర్ 77 నుంచి 82, 130, హకీంపేట శివారులో గల సర్వే నంబర్ 97, 111లో సీలింగ్ భూములు ఉన్నాయని తేల్చారు.
అలాగే సర్వే నెంబర్ 78, 81, 130 లలో భారీ పౌల్ట్రీ షెడ్స్, ప్లాట్‌ఫామ్‌లు, రోడ్లను అనుమతి లేకుండానే నిర్మించారన్నారు. సర్వే నంబర్ 81లో 5 ఎకరాలు, 130 లో 3 ఎకరాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తేల్చారు. మొత్తంగా 56 మంది అసైనీల భూములను కబ్జా చేసినట్లు తేలిందన్నారు. జమునా హ్యాచరీస్ భూకబ్జా, అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి నివేదిక పంపామని కలెక్టర్ హరీశ్ తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారిపై, అక్రమాలకు సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
కబ్జా నిజమే అని తేలింది కాబట్టి మరి ఈటలపై చర్యలు తీసుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఈటలను భర్తరఫ్ చేయడం ద్వారా ఆత్మగౌరవ పోరాటం తెరపైకి వచ్చింది. కొందరు ఉద్యమకారులు రాజేందర్ కు మద్దతుగా నిలిచారు. ఆ అంశాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంది. అంతో ఇంతో పుంజుకుంది కూడా. ఈ క్రమంలో ఈటలపై చర్యలు తీసుకుంటే.. దాన్ని ఆసరాగా చేసుకుని మరింత దుమారం రేపేందుకు ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో కబ్జా నిజమేనని పేర్కొంటున్నప్పటికీ చర్యలపై సర్కారు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరగనుందో మున్ముందు చూడాలి.
Also Read : Pjr Son Vishnu – పీజేఆర్ కొడుకు కనిపించడం లేదట..!