Idream media
Idream media
శ్రీ చైతన్య నారాయణ (చైనా) జూనియర్ కాలేజీలకు తెలంగాణ సర్కారు షాకిచ్చింది. ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కాలేజీలపై సీఎం కేసీఆర్ కొరడా ఝుళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కాలేజీలో పై దాడులు చేసిన ఇంటర్ బోర్డు తెలంగాణ వ్యాప్తంగా 68 కాలేజీలు మూసివేసింది. ఇందులో శ్రీ చైతన్య సంస్థకు చెందిన 26 కాలేజీలు, నారాయణ సంస్థకు చెందిన 18 కాలేజీలు ఉన్నాయి.
విద్యార్థుల భవితకు మూలమైన ఇంటర్ విద్య పై శ్రీ చైతన్య, నారాయణ సంస్థలదే తెలుగు రాష్ట్రాల్లో ఆధిపత్యం. నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు శ్రీ చైతన్య, నారాయణ బ్రాంచ్ లు వెలిశాయి. జి ప్లస్ టు భవనాలు, ఫైర్ సేఫ్టీ, పార్కింగ్ స్థలం, మ్యాథ్స్, సైన్స్ తదితర సౌకర్యాలతో ఇంటర్ కాలేజీలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఇలాంటివి ఏమీ లేకుండానే బహుళ అంతస్తుల భవనాల్లో శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలు నడుస్తున్నాయి.
ఈ విషయం ఇంటర్ బోర్డు అధికారులకు తెలిసినా రాజకీయ ఒత్తిళ్లతో చూసి చూడనట్లుగా వదిలేస్తారు. కార్పొరేట్ విద్యా సంస్థల అధిపతులు రాజకీయ పార్టీలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్నారని ఐదేళ్ల క్రితం బహిరంగంగా వెల్లడయింది. నారాయణ విద్యాసంస్థల చైర్మన్ గా ఉన్న పి.నారాయణ 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండానే అనూహ్యంగా చంద్రబాబు క్యాబినెట్ లో పట్టణ మరియు పురపాలక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తెలుగు రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. నారాయణ వియ్యంకుడు చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా చేసిన గంటా శ్రీనివాసరావు గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం ఈ సందర్భంగా గమనార్హం.