Arjun Suravaram
Arjun Suravaram
గత కొంతకాలం నుంచి తెలంగాణలో టీచర్ల బదీలకు సంబంధించి ఇష్యూ నడుస్తూనే ఉంది. కోర్టు వివాదాలతో టీచర్ల బదిలీలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే బుధవారం ఉపాధ్యాయుల బదిలీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా కోర్టు నిర్ణయాలను అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 3 నుంచి టీచర్ల బదిలీల ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి.. టీచర్ల పదోన్నతులు, బదిలీలపై సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలపై ప్రధానంగా సమీక్ష జరిగింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టు వివాదాలతో కొన్ని నెలలుగా ఆగిన ఉపాధ్యాయుల బదిలీలకు హైకోర్టు బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం జనవరిలో తీసుకువచ్చిన జీవో 5 అమలును నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. బదిలీలను కొనసాగించడానికి అనుమతించింది. దీంతో టీచర్ల బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కోర్టు తీర్పునకు లోబడి బదిలీలు చేయాలని విద్యాశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
సెప్టెంబరు 3 నుంచి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ బదిలీల ప్రక్రియను కూడా పారదర్శకతతో నిర్వహించాలని సూచించారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వాలని ఆమె తెలిపారు. అంతేకాక బదిలీల ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అక్టోబరు 3లోపు ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శుక్రవారం లేదా శనివారం ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి షెడ్యూల్ విడుదలై అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.