iDreamPost
android-app
ios-app

Telangana Congress, Etela Rajender – తెలంగాణ కాంగ్రెస్‌ను ఆ బాధ ఇంకా వెంటాడుతోందా..?

Telangana Congress, Etela Rajender – తెలంగాణ కాంగ్రెస్‌ను ఆ బాధ ఇంకా వెంటాడుతోందా..?

ఈటల రాజేందర్‌.. ఈ పేరు తెలంగాణలో ఓ సంచలనం. భూ కబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి తొలిగిస్తే.. టీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవి కూడా వద్దని రాజీనామా చేసి సీఎం కేసీఆర్‌ను సవాల్‌ చేసిన నేత. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో.. కేసీఆర్‌ను ఢీ కొట్టి.. గెలిచిన ఈటల రాజేందర్‌ తన సత్తా ఏమిటో చాటారు. హుజురాబాద్‌ ఉప ఎన్నిక ముగిసినా.. ఈటల గురుంచి తెలంగాణలో ఇప్పటికీ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీలో ఈటల గురించిన ప్రస్తావన తరచూ వస్తోంది. ఈటలను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకోలేకపోయామనే బాధ ఆ పార్టీ నేతల్లో నెలకొన్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఈటల రాజేందర్‌.. కొత్త పార్టీ పెడతారనే చర్చ సాగింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఏదో ఒక పార్టీలో చేరడం మంచిదనే నిర్ణయానికి వచ్చి.. కాంగ్రెస్‌ పార్టీ తలుపు తట్టారట. అయితే ఏమైందో ఏమో గానీ.. ఈటల బీజేపీలో చేరారు. మొదట ఈటల రాజేందర్‌ కాంగ్రెస్‌ పార్టీ వద్దకే వచ్చారని, కానీ ఎందుకు చేరలేదో తెలియదంటూ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌నేత వీహెచ్‌ హనుమంతరావు తాజాగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఏమైందన్న విషయం రేవంత్‌ రెడ్డి మాత్రమే చెప్పగలరని మరోసారి ఈటల రాజేందర్‌ ప్రస్తావన తెచ్చారు.

టీఆర్‌ఎస్‌ ను వీడిన తర్వాత.. ఇక ఈటల రాజేందర్‌ రాజకీయంగా ఇబ్బందులు పడతారని, ఆయన రాజకీయ పయనం మునుపటిలా సాగదనే విశ్లేషణలు సాగాయి. ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ రాక ముందు హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ బలంగా కనిపించింది. దళిత బంధు, నేతల పార్టీలో చేరికలు, నామినేటెడ్‌ పదవులు.. ఇలా సర్వశక్తులను టీఆర్‌ఎస్‌ ఒడ్డింది. అయితే నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత.. రోజు రోజుకీ టీఆర్‌ఎస్‌ బలం తగ్గుతూ.. రాజేందర్‌ పట్టు ఏ మాత్రం జారలేదనే సంకేతాలు వచ్చాయి. మొత్తంగా హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌ 20 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. కేసీఆర్‌ను ఢీకొట్టి నిలిచిన ఈటల రాజేందర్‌.. కాంగ్రెస్‌ పార్టీలో చేరితే ఎంతో లాభం ఉండేదనే అభిప్రాయాలు ఉప ఎన్నిక ఫలితం తర్వాత హస్తం పార్టీలో మొదలయ్యాయి. మంచి బలమైన నేతను చేజార్చుకున్నామనే బాధ ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీని వెంటాడుతోందని వీహెచ్‌ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది.

Also Read : Mamata,Kejriwal ,Congress – కాంగ్రెస్‌కి కొత్త సవాల్, ఆపార్టీల నుంచే పెద్ద ముప్పు