iDreamPost
iDreamPost
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికార టీ.ఆర్.ఎస్ పార్టీని, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కుంటూ తమ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. కొత్త , పాత నాయకులతో ఏర్పాటైన ఈ కార్యవర్గంలో ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలను పార్టీ ఉపాధ్యక్షులుగా, ఒక మాజీ ఎమ్మెల్యేను పార్టీ కార్యదర్శిగా నియమిస్తూ అధికారిక ప్రకటన చేశారు. అయితే ఈ నియమకాల విషయం ఆ పార్టీలో నాయకుల మధ్య చిచ్చు రేపి తీవ్ర దుమారానికి దారి తీసింది.
పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నియమించిన ఈ కార్యవర్గంలో తనకి అవమానం జరిగిందని బీజేపి గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే తానే అని, గోషా మహల్ నుంచి వరసుగా రెండుసార్లు గెలిచిన కనీసం తాను సిఫార్సు చేసిన ఏ ఒక్కరికి నూతన కార్యవర్గంలో స్థానం కల్పించకపోవడం ఏంటని, అధ్యక్షుడి స్థానంలో ఉండి గ్రూపులు పెంచుతారా అని తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికైనా గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని హితవు పలికారు.