iDreamPost
android-app
ios-app

దూరంగా ఉంటున్న వారిపై బీజేపీ దృష్టి

దూరంగా ఉంటున్న వారిపై బీజేపీ దృష్టి

తెలంగాణ లో అధికారమే ధ్యేయంగా వ్యూహాలు రచిస్తున్న బీజేపీ అన్ని అంశాలపైనా దృష్టి పెడుతోంది. ఇతర పార్టీలోని కీలక నేతలపైనే కాదు.. తమ పార్టీలో ఉంటూ దూరంగా ఉంటున్న నేతల గురుంచి కూడా విచారణ చేస్తోంది. వారు ఎందుకు పార్టీకి దూరంగా ఉంటున్నారు.. ఏం చేస్తున్నారు.. అందుకు గల కారణాలను తెలుసు కుంటున్నారు. దానిలో భాగంగా ఓ ముగ్గురు నేతలు ఈ మధ్య ఎక్కువగా కనిపించడం లేదు. అంతా ఒకే సామాజికవర్గం నేతలు కావడంతో పార్టీలో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయట. ఒకవైపు బీజేపీ దూకుడుగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే.. పత్తా లేకుండా పోయిన వారి గురించి నిఘావర్గాలు ఆరా తీశాయట. ఇంతకీ ఎవరా నాయకులు అంటే..

తెలంగాణలో బీజేపీ నాయకులు వరసగా ఆందోళనలు నిర్వహిస్తూ రోడ్లపైనే ఉంటున్నారు. జాగరణ దీక్ష చేపట్టిన పార్టీ చీఫ్‌ బండి సంజయ్‌ను అరెస్ట్‌ చేయడంతో పార్టీలో యాక్టివిటీస్‌ ఇంకా పెరిగాయి. బీజేపీ ఆఫీస్‌కు ముఖ్య నాయకుల తాడికి ఎక్కువైంది. ఇంత సందడిలోనూ కొందరు బీజేపీ సీనియర్ నాయకులు పార్టీ ఆఫీస్‌లో కనిపించడం లేదట. గతంలో పార్టీ కార్యాలయాన్నే అంటిపెట్టుకుని ఉన్న ఆ నాయకులు ఎందుకు రావడం లేదని కమలనాథులు ఆరా తీస్తున్నారట.

మధ్యప్రదేశ్‌ సీఎం వచ్చినా పత్తా లేని మురళీధర్‌రావు
ఆ ముగ్గురు ఎవరో కాదు. ఒకప్పుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి.. సంఘ్‌ పరివార్‌ క్షేత్రాల్లో కీలకంగా ఉన్న మురళీధర్‌రావు ఆ ముగ్గురిలో ఒకరు. మురళీధర్‌రావు ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ బీజేపీ ఇంఛార్జ్‌. బండి సంజయ్‌ అరెస్ట్‌పై ఒక ట్వీట్‌ చేశారు తప్ప ఉలుకు పలుకు లేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తే ఆయన కనిపించలేదు. చివరకు మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వచ్చినా.. పత్తా లేరు. దీంతో మురళీధర్‌రావు ఎక్కడా అనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తున్నాయి. కాషాయ శిబిరంలో గుసగుసలు పెరిగాయి. వ్యక్తిగత పనులు, ఆరోగ్య కారణాల వల్ల అందుబాటులో లేరని పార్టీలో కొందరు చెబుతున్నా.. ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా అధిష్టానం ఆరా తీస్తోంది.

మరో నాయకుడు పేరాల శేఖర్‌రావు గురించి కూడా బీజేపీ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రస్తుతం ఖాదీ గ్రామీణ బోర్డు డైరెక్టర్‌గా ఉన్నారు శేఖర్‌. బీజేపీ కోర్‌ కమిటీ సభ్యుడు. మొన్నటి వరకు జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్‌ నుంచి పోటీ చేశారు కూడా. ఏబీవీపీ, బీజేపీలో కొన్నేళ్లు పూర్తి సమయ కార్యకర్తగా పనిచేసిన శేఖర్‌.. ఈ మధ్య పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. GHMC పరిధిలోని లింగోజీగూడ డివిజన్‌ ఉపఎన్నిక సమయంలో జరిగిన పరిణామాలు పార్టీలో దుమారం రేపాయి. ఆ తర్వాత పార్టీ చీఫ్‌ బండి సంజయ్‌తో శేఖర్‌కు గ్యాప్‌ వచ్చిందనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ దూకుడుగా వెళ్తున్న టైమ్‌లో శేఖర్‌ కనిపించడం లేదన్నది బీజేపీ వర్గాల మాట.

మూడో నాయకుడు.. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు. తెలంగాణలో ఏం జరిగినా స్పందించి మీడియాలో కనిపించే ఆయన.. ప్రస్తుతం చప్పుడు చేయడం లేదు. పార్టీ కార్యాలయానికి రెగ్యులర్‌గా వచ్చేవారు. ప్రస్తుతం అదీ బంద్‌. మీడియాతో ముచ్చట్లు లేవు.. ముఖ్య నేతలు వస్తే మాటలు కలపడం లేదు. బండి సంజయ్‌ అరెస్ట్‌ అంశంలోనూ స్పందించలేదని చెబుతున్నాయి పార్టీ వర్గాలు.

మురళీధర్‌రావు, శేఖర్‌రావు, కృష్ణసాగర్‌రావు ముగ్గురూ ఒకే సామాజికవర్గం. ఎందుకు సైలెంట్‌ అయ్యారన్నదానిపై కాషాయ శిబిరంలోనే అనేక సందేహాలు ఉన్నాయట. ఇదే సమయంలో రాష్ట్ర నిఘా వర్గాలు కూడా వీరి గురించి ఆరా తీస్తున్నారని బీజేపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. మరి.. ఈ మౌనానికి అసలు కారణం ఏంటో ఆ ముగ్గురు పార్టీ పెద్దలకైనా చెబుతారో లేదో..?