Venkateswarlu
Venkateswarlu
తెలంగాణలోని నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి 24 గంటల నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. బుధవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఆయన నిరాహార దీక్షకు పూనుకున్నారు. అయితే, సాయంత్రం ఆరు వరకే పోలీసులు నిరాహార దీక్షకు అనుమతి ఇచ్చారు. అయినప్పటికి కిషన్ రెడ్డి మాత్రం రేపటి వరకు నిరాహార దీక్ష చేస్తానని అన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దీక్షను భగ్నం చేశారు. అనుమతి సమయం ముగిసిందని, దీక్ష వేదికను ఖాళీ చేయాలని కోరారు.
ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. దీంతో ఇందిరాపార్కు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులు బలవంతంగా బీజేపీ కార్యకర్తలను పక్కకు లాగేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు కూడా గట్టిగానే వారిని ప్రతిఘటిస్తున్నారు. అంతకు క్రితం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ ఈ తొమ్మిదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కారణంగా లక్షమ మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం పథకం ప్రకారమే నిరుద్యోగులకు అన్యాయం చేస్తోంది. కేసీఆర్ చేతగాని తనం వల్లే పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయి. హోంగార్డు రవీందర్‌ది ఆత్మహత్య కాదు.. బీఆర్‌ఎస్ చేసిన హత్య. నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేస్తున్నారు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అరెస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.