iDreamPost
android-app
ios-app

తెలంగాణ ఎమ్మెల్సీల పోరు.. హేమాహేమీల జోరు..!

తెలంగాణ ఎమ్మెల్సీల పోరు.. హేమాహేమీల జోరు..!

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు. దుబ్బాక‌, గ్రేట‌ర్ ఎన్నిక‌ల వెంట‌నే ప‌ట్ట‌భ‌ద్రుల న‌గారా మోగ‌డంతో మ‌ళ్లీ ఎన్నిక‌ల స‌మ‌రానికి పార్టీల‌న్నీసిద్ధ‌మ‌య్యాయి. ఈ నెల 23తో నామినేష‌న్ల ప‌ర్వం ముగియ‌డంతో తెలంగాణ‌లోని రెండు స్థానాల‌లోనూ బ‌రిలో నిలిచిందెవ‌రో తేలిపోయింది.

ఇప్పుడు ఏ ఎన్నిక జ‌రిగినా తెలంగాణ‌లో పార్టీల‌న్నీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్నాయి. రాష్ట్రంలో బీజేపీ దూకుడు పెరిగిన త‌ర్వాత టీఆర్ఎస్ కూడా అప్ర‌మ‌త్త‌మైంది. ఆ రెండు పార్టీల పోటీల మ‌ధ్య నిల‌దొక్కుకోవ‌డానికి కాంగ్రెస్ కూడా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో ఈసారి రాజకీయ చైతన్యం పాలు ఎక్కువగా కనిపిస్తోంది. పైగా బ‌రిలో హేమాహేమీలు ఉండ‌డం, అంద‌రూ సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌లు, ప్రొఫెస‌ర్లు, సామాజిక వేత్త‌లు కావ‌డంతో ప‌ట్ట‌భ‌ద్రుల‌ను ఆక‌ట్టుకునేదెవ‌ర‌నేది ఆస‌క్తిగా మారింది.

దివంగత ప్రధాని పివి నరసింహరావు కుమార్తె సురభి వాణి దేవి అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి తరపున బరిలోకి దిగగా… కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జి. చిన్నారెడ్డికి అవకాశమిచ్చింది. గత ఆరేళ్ళుగా ఎమ్మెల్సీగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ నేత ఎన్. రామచంద్రరావు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో ఓసారి ఎమ్మెల్సీగా వ్యవహరించిన ప్రొ. నాగేశ్వర్ మరోసారి వామపక్షాల మద్దతుతో రంగంలోకి దిగారు. వాళ్లే కాదు.. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా హర్షవర్దన్ రెడ్డి, టీఆర్ఎల్డీ నేత కపిలవాయి దిలీప్ కుమార్ పోటీలో ఉన్నారు.వీరంద‌రూ ప్ర‌చార‌ప‌ర్వంలో ఎవ‌రికి వారు ప్ర‌త్యేక శైలిలో దూసుకెళ్తున్నారు. సోష‌ల్ మీడియాను అధికంగా వినియోగించుకుంటున్నారు. త‌మ వాయిస్, ల‌క్ష్యాల‌ను పోస్టు చేస్తూ ప‌ట్ట‌భ‌ద్రుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

మరోవైపు ఖమ్మం- నల్లగొండ-వరంగల్ స్థానంలోనూ కీల‌క నేత‌లు పోటీకి దిగారు. అధికార పార్టీ నుంచి సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజశ్వేర్ రెడ్డి పోటీకి దిగగా కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీకి దిగారు. తెలంగాణ జనసమితి నుంచి కోదండరామ్ రెడ్డి పోటీకి దిగారు. గతంలో ఓసారి పోటీ చేసి దారుణంగా ఓటమి పాలైన మాజీ న్యూస్ ప్రజెంటర్, యువ తెలంగాణ పార్టీ నేత రాణి రుద్రమదేవితోపాటు మరో ఇద్దరు మీడియా నేపథ్యం వున్న వారు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచారు. మీడియా నేపథ్యం వున్న తీన్మార్ మల్లన్న, జయసారధి రెడ్డి ఖమ్మం-నల్లగొండ-వరంగల్ నియోజకవర్గం బరిలో పోటీ పడుతున్నారు. వీరిలో జయసారధికి వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. తెలంగాణ ఇంటి పార్టీ నేత చెరుకు సుధాకర్ కూడా పోటీలో ఉన్నారు.

తెలంగాణ ఏర్పాటై ఏడేళ్ళు కావ‌స్తున్నా యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైందంటూ ప్ర‌తిప‌క్షాలు ప్ర‌చారం చేస్తున్నాయి. ఉద్యోగాల క‌ల్ప‌న‌లో నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్న ప్ర‌భుత్వానికి బుద్ధి చెప్పాలంటూ విపక్షాలు గ్రాడ్యుయేట్లను ప్రసన్నం చేసుకునేందుకు యత్నాలు మొదలు పెట్టాయి. మ‌రోవైపు టీఆర్ఎస్ అభ్య‌ర్థులు అభివృద్ధి మంత్రాన్ని జ‌పిస్తున్నారు. భారీ సంఖ్య‌లో ఉద్యోగాల క‌ల్ప‌నకు ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ లు విడుద‌ల చేసింద‌ని, త్వ‌ర‌లో నిరుద్యోగులంద‌రికీ ప్ర‌భుత్వం మంచి అవ‌కాశాలు క‌ల్పిస్తోంద‌ని చెబుతున్నారు.

ప‌ట్ట‌భ‌ద్రుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి ఉద్యోగం అనే ఆయుధాన్నే ప్ర‌తి ఒక్క‌రూ ఉప‌యోగిస్తున్నారు. ‌ ఉపాధికి అవకాశాలు కలిగించే చర్యలను కూడా కేసీఆర్ ప్రభుత్వం చేపట్టలేదన్నది విపక్షాల అభ్యర్థుల ప్రధాన ప్రచారాస్త్రంగా కనిపిస్తోంది. అయితే, ఆరున్నరేళ్ళ కాలంలో తెలంగాణను దేశంలో అగ్ర రాష్ట్రంగా నిలబెట్టామంటూ టీఆర్ఎస్ అభ్యర్థులు చెప్పుకుంటున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి స్వర్గీయ ప్రధాని పి.వి.నరసింహారావు కుమార్తె సురభి వాణీ దేవికి టిక్కెట్ ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ రాజకీయ చతురత ప్రదర్శించారని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థుల సంగ‌తి అటుంచితే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజక వర్గం బరిలో ఉన్న వామ‌ప‌క్ష అభ్య‌ర్థి ప్రొ.నాగేశ్వ‌ర్ ఎంత వ‌ర‌కూ ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపుతార‌నేది ఆస‌క్తిగా మారింది. గ‌తంలోనే ఆయ‌న,కమ్యూనిస్టుల మద్దతుతో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచారు. మేధావి వ‌ర్గానికి చెందిన వ్య‌క్తిగా గుర్తింపు ఉన్న నాగేశ్వ‌ర్ కు యువ‌తలో ఫాలోయింగ్ ఎక్కువే. సామాజిక మాధ్య‌మాల ద్వారా ఆయ‌న నిర్వ‌హిస్తున్న పేజ్‌, చాన‌ళ్ల కు బాగానే వ్యూవ‌ర్స్ ఉన్నారు. కేంద్ర‌, రాష్ట్ర అంశాల‌పై ఆయ‌న ఇచ్చే వివ‌ర‌ణ‌లు యువ‌తను ఆక‌ట్టుకుంటాయి. మ‌రి ఈ నేప‌థ్యంలో ప‌ట్ట‌భ‌ద్రులు మ‌రోసారి ఆయ‌న వైపు మొగ్గుచూపుతారా, లేదా ప్ర‌ధాన పార్టీ అభ్య‌ర్థుల‌నే గెలిపిస్తారా అనే ఆస‌క్తి ఏర్ప‌డింది.

అలాగే ఖమ్మం- నల్లగొండ-వరంగల్ స్థానం నుంచి కోదండ రాం పోటీలో ఉన్నారు. చివ‌రి వ‌ర‌కు కాంగ్రెస్ మ‌ద్ద‌తు కోసం ప్ర‌య‌త్నించినా ఫ‌లించ లేదు. తెలంగాణ సిద్ధాంత క‌ర్త ప్రొఫెస‌ర్ జ‌య‌శంకర్ సార్ త‌ర్వాత ప్రొఫెస‌ర్ కోదండ‌రాంకు రాష్ట్ర అవ‌త‌ర‌ణ‌లో కీల‌క పాత్ర పోషించిన వ్య‌క్తిగా గుర్తింపు ఉంది. పైగా సుదీర్ఘ కాలం పాటు ఆచార్య వృత్తిలో కొన‌సాగుతున్నారు. వేలాది మంది విద్యార్థుల‌ను ఉత్త‌మ పౌరులుగా తీర్చిదిద్దారు. ఈ నేప‌థ్యంలో ఆ స్థానంలో ఆయ‌న ఎంత వ‌ర‌కూ ప్ర‌భావం చూపుతార‌నేది కూడా ఆస‌క్తిగా మారింది. ఈ నేప‌థ్యంలో అభ్యర్థుల భవితవ్యం మార్చి14తో తేలనుంది. ఆ రోజు పోలింగ్ జరగనుండగా…మార్చి17న ఫలితాలు వెల్ల‌డికానున్నాయి.