iDreamPost
android-app
ios-app

తెలంగాణ కార్పొరేషన్ పదవులు కీలక నేతలకు పదవులు

తెలంగాణ కార్పొరేషన్ పదవులు కీలక నేతలకు పదవులు

గులాబీ బాస్ కేసీఆర్ టీఆర్ఎస్ ను ముచ్చ‌ట‌గా మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు భారీగానే క‌స‌ర‌త్తు చేస్తున్నారు. పార్టీని బ‌లోపేతం చేసేందుకు విస్తృతంగా క‌మిటీలు వేయ‌డంతో పాటు.. నామినేటెడ్ పోస్టుల‌ను కూడా వ‌రుస‌గా భ‌ర్తీ చేస్తున్నారు. దీని వ‌ల్ల ఎక్కువ మంది నేత‌ల‌కు ప‌ద‌వులు ఇవ్వ‌డం ద్వారా బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించేలా చేస్తున్నారు. అలాగే.. త్వ‌ర‌లోనే జిల్లా క‌మిటీల‌కు అధ్య‌క్షుల‌ను ప్ర‌క‌టించి.. అనంత‌రం కేసీఆర్ ప‌ర్య‌టించే అవ‌కాశాలు ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోంది. త‌న ప‌ర్య‌ట‌న‌కు ముందే.. క‌మిటీలు, నియామ‌కాలు జ‌రిగితే అది మ‌రింత ప్ర‌భావం చూపుతుంద‌ని గులాబీ బాస్ వ్యూహంగా క‌నిపిస్తోంది.

ఈసారి ఎలాగైనా టీఆర్ఎస్ ను ఓడించాల‌ని బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను తిప్పికొట్టేందుకు కేసీఆర్ పార్టీలో జోష్ పెంచుతున్నారు. ఇప్పుడు తాజాగా.. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను తెలంగాణ ఆర్టీసీ చైర్మ‌న్ గా నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న పార్టీ నామినేటెడ్ పదవులపై నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ అంశంపై పార్టీ నాయకత్వానికి అనేకసార్లు విజ్ఞప్తులు చేశారు. అయితే వీటిని పెండింగ్లో పెడుతూ వస్తున్న టీఆర్ఎస్ నాయకత్వం.. నేతల్లో పెరుగుతున్న అసంతృప్తిని చల్లబరిచేందుకు త్వరలోనే నామినేటెడ్ పదవులను పూర్తిస్థాయిలో భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. క‌మిటీల్లో కార్య‌క‌ర్త‌ల‌కు, నామినేటెడ్ ప‌ద‌వుల్లో సీనియ‌ర్ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం ద్వారా కేసీఆర్ పార్టీ ప‌టిష్ట‌త‌కు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా సీనియర్ నేతలు ఎమ్మెల్యేలకు కూడా పదవులు ఇవ్వాలని యోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే పార్టీ సీనియర్ ఎమ్మెల్యేల్లో ఒకరిగా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ ను ఆర్టీసీ చైర్మన్ పదవి కట్టబెట్టారని సమాచారం. దీంతో మిగతా ఎమ్మెల్యేలకు కూడా త్వరలోనే నామినేటెడ్ పదవులు దక్కడం ఖాయమనే చర్చ జరుగుతోంది.

కొన్నేళ్లుగా నామినేటెడ్ పోస్టులను కేసీఆర్ భర్తీ చేయలేదు. ముఖ్యమైన నేతలకు మాత్రమే పదవులను కేటాయించారు. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వారికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. మరోవైపు బీజేపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు వల విసురుతుంది. దీంతో నామినేటెడ్ పోస్టులను వరసగా భర్తీ చేసి అవ‌కాశాలు ఇవ్వ‌డం ద్వారా నేత‌ల్లో జోష్ నింపేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందులో భాగంగా గ‌తంలోనే.. మెదక్ జిల్లాకు చెందిన సునీతా లక్ష్మారెడ్డికి తెలంగాణ మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ పదవికి ఎంపిక చేశారు. ఆరేళ్ల నుంచి తెలంగాణ మహిళ ఛైర్ పర్సన్ పదవిని కేసీఆర్ భర్తీ చేయలేదు. సునీతా లక్ష్మారెడ్డి మొన్నటి పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను వదలి టీఆర్ఎస్ లో చేరారు. 1999, 2004, 2009లో వరసగా సునీతా లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగానూ పనిచేశారు.

అలాగే.. ఇటీవ‌ల బీసీ క‌మిష‌న్ చైర్మ‌న్ గా వ‌కుళాభ‌ర‌ణం కృష్ణ‌మోహ‌న్ ను నియ‌మించారు. ఇప్పుడు తాజాగా.. బాజిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవిని ఇచ్చారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న నాయకుడిగా గోవర్ధన్ రెడ్డి గుర్తింపు పొందారు. గతంలో కాంగ్రెస్ తర్వాత.. వైసీపీ.. ఆ తర్వాత.. టీఆర్ ఎస్లో ఆయన చక్రం తిప్పారు. నిజామాబాద్ నాయకుల్లో ఆయన ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఉన్నారు మరో ప్రధాన ప్లస్. ఇక టీఆర్ఎస్ తరపున 2014 2018 ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ స్థానం నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ విజయం సాధించారు. జిల్లాలోని సీనియర్ నాయకుల్లో ఒకరిగా ఉన్న ఆయన మంత్రివర్గంలో స్థానం ఆశించారు. అయితే 2014లో జిల్లా నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకున్న సీఎం కేసీఆర్.. ఆ తరువాత వేముల ప్రశాంత్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకున్నారు. అప్పటి నుంచే బాజిరెడ్డి గోవర్ధన్కు సీఎం కేసీఆర్ కీలకమైన నామినేటెడ్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయనకు కీలకమైన ఆర్టీసీ చైర్మన్ పదవిని అప్పగించారు.

ఇక ఇప్పుడు పార్టీకి సంబంధించి క్షేత్రస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెలాఖరునాటికి గ్రామ మండల జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రస్థాయిలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. త్వరలోనే పార్టీ అధినేత కేసీఆర్ జిల్లా అధ్యక్షులను కూడా ప్రకటిస్తారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. దీనిని బట్టి.. పార్టీని పటిష్టం చేయడంపై కేసీఆర్ ప్ర‌ధానంగా దృష్టి పెట్టారని పరిశీలకులు భావిస్తున్నారు.