Idream media
Idream media
రెండేళ్ల క్రితం భార్య శంకరమ్మ మృతి చెందితే దహన సంస్కారాలకు డబ్బు లేని పరిస్థితులు. కొడుకు అనారోగ్యానికి గురైతే చికిత్స చేయించలేని దుస్థితి. కుటుంబ పోషణకు దశాబ్దాల నాటి కళనే నమ్ముకుని ఊరూవాడా తిరిగేవాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కోటీశ్వరుడయ్యాడు. ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయాడు. అతనే దర్శనం మొగిలయ్య. పద్మశ్రీ పురస్కార గ్రహీత కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగిలయ్య ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పన్నెండు మెట్ల కిన్నెర ప్రావీణ్యం ఉన్నప్పటికీ దశాబ్దాలుగా గుర్తింపునకు నోచుకోని మొగిలయ్యకు ఇంత పాపులార్టీ రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కిన్నెరమెట్ల కళాకారుడు దర్శనం మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం తరపున రూ.కోటి బహుమతిగా ఇస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్‌లో నివాసస్థలం, ఇంటి నిర్మాణం, ఇతరత్రా అవసరాల కోసం ఈ మొత్తాన్ని ఇస్తున్నట్టు తెలిపారు. దర్శనం మొగిలయ్య శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి ప్రగతిభవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మొగిలయ్య కు శాలువా కప్పి సత్కరించారు. గొప్ప కళారూపాన్ని మొగిలయ్య కాపాడుతున్నారని ప్రశంసించారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. మొగిలయ్యకు గౌరవ వేతనాన్ని అందిస్తోందని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో నివాస స్థలం, ఇంటి నిర్మాణం విషయంగా మొగిలయ్యతో సమన్వయం చేసుకుని, కావాల్సిన ఏర్పాట్లు చూసు కోవాలని ఎమ్మెల్యే గువ్వల బాలరాజును సీఎం ఆదేశించారు.
మొగిలయ్యను తాజాగా ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు దంపతులు ఆదివారం ముచ్చింతల్‌లోని చిన్న జీయర్ స్వామిని వారి ఆశ్రమంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి ముందు కిన్నెర మొగిలయ్య తన కళను ప్రదర్శించారు. దాంతో ఈ కళను చిన్నజీయర్ స్వామి అభినందించారు. మరికొంతమందికి ఈ కళను నేర్పించాలని మొగిలయ్య కు సూచించారు. అనంతరం మొగిలయ్య ను చిన్న జీయర్ స్వామి సన్మానించారు. అలాగే బండి సంజయ్ కూడా మొగిలయ్యను ఆదివారం సత్కరించారు.
కిన్నెర విధ్వాంసుడిగా పేరున్న మొగిలయ్యను సెలబ్రిటీని చేసింది మాత్రం ‘భీమ్లా నాయక్’ పాటే. పన్నెండు మెట్ల కిన్నెర కళలో ఆయన ఆఖరితరం కళాకారుడు. ‘పద్మశ్రీ’కి ముందే ఆయనలో ఈ కళను గుర్తించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతగానో ప్రోత్సహించారు. మొగిలయ్య జీవిత చరిత్రను ఎనిమిదవ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా కూడా చేర్చారు.
అయితే ఇంత జరిగినా కూడా ఆయనకు , ఆయన వాయించే పరికరం, ఆయనకున్న కళ ఏమిటో చాలా మందికి తెలియదంటే అందులో అతిశయోక్తి లేనే లేదు. అలాంటి మొగిలయ్యను ఒక్కసారిగా సెలబ్రిటీని చేసింది మాత్రం ‘భీమ్లా నాయక్’ చిత్రమనే చెప్పుకోవాలి. పవన్ కల్యాణ్, రాణా దగ్గబాటి కాంబినేషన్‌లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘భీమ్లా నాయక్’.
ఈ చిత్రంలో మొగిలయ్యతో సంగీత దర్శకుడు థమన్ ఓ పాట పాడించారు. టైటిల్ సాంగ్‌గా విడుదలైన ఈ పాట సంచలనాలకు కేంద్ర బిందువుగా మారడమే కాకుండా.. ఇప్పుడు ఆయనకు ‘పద్మశ్రీ’ వరించడంలో కూడా కీలక పాత్ర వహించిందన్నది సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్.
కేసీఆర్‌తో పాటు ఈ కళను గుర్తించిన పవన్ కల్యాణ్ అతనితో ఈ చిత్రంలో ఓ పాట పాడించాల్సిందిగా దర్శకుడు త్రివిక్రమ్‌ని కోరాడట. ఈ విషయం స్వయంగా తమనే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాదు, ఈ పాట పాడిన తర్వాత మొగిలయ్యకు పవన్ కల్యాణ్ ఆర్థికంగానూ సహాయం అందించారు. ఈ పాట సోషల్ ప్రపంచంలో బాగా పాపులర్ అవడంతో.. మొగిలయ్యకు గుర్తింపు దక్కడమే కాకుండా.. ఆయన కూడా ఓ సెలబ్రిటీగా మారిపోయారు. పోనీలే ఏదైనప్పటికీ ఓ కళాకారుడికి గుర్తింపు రావడం, ఆయన ఇబ్బందులు కొన్నయినా తొలిగే అవకాశం కలగడం అందరూ సంతోషించే విషయం.