iDreamPost
android-app
ios-app

పార్టీ కోసం కాదు.. పంతం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ సీనియ‌ర్లు

పార్టీ కోసం కాదు.. పంతం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ సీనియ‌ర్లు

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ అదే తెలంగాణ‌లో ఉనికి కోల్పోతుంది. ఎన్నిక ఏదైనా భంగ‌పాటుకు గుర‌వుతూనే ఉంది. ఎన్నిక‌ల్లో గెలుపు కోసం, రాష్ట్రంలో పార్టీ పున‌ర్ వైభ‌వం కోసం అంత క‌లిసిక‌ట్టుగా ప్ర‌య‌త్నించ‌ని సీనియ‌ర్లు ఓ విష‌యంలో మాత్రం గ‌ట్టిగా ప‌ట్టుబ‌డుతున్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్ప‌టికీ ఏ అంశంలోనూ పెద్ద‌గా పోరాడి నిల‌బ‌డ‌లేని ఆ పార్టీ సీనియ‌ర్లు అధికారం కోసం ఎగబడుతుండ‌డం, త‌మ‌కు రాక‌పోయినా ప‌ర్వాలేదు.. ఆయ‌న‌కు మాత్రం ఇవ్వ‌ద్దంటూ బ్లాక్ మెయిల్ కు దిగుతుండ‌డం సొంత పార్టీలోనే చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.

వారి ప్ర‌య‌త్నాలు వారి కోసం కాదు..

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్ ప‌ద‌విని ఉత్తమ్ కుమార్ రెడ్డ వ‌దులుకున్నారు. మిగిలిన సీనియర్ల పరిస్థితి ఏంటీ? వాళ్లు ఇప్పటి వరకు చేసిందేంటీ? అన్నది కూడా కార్యకర్తలకు తెలుసు. అయినప్పటికీ.. పీసీసీ అధ్యక్ష పదవి తమకే ఇవ్వాలని పోరు పెడుతున్నారు సీనియర్లు. ఇన్నాళ్లూ పార్టీలో ఉన్న తమను కాదని కొత్తగా వచ్చిన రేవంత్ కు పగ్గాలు ఎలా ఇస్తారన్నది వాళ్ల కడుపు మంటగా చెబుతున్నారు. రేవంత్ కు పీసీసీ ఇవ్వకుండా అధిష్టానం వద్ద తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారట కొందరు నేతలు. ఈ తీరుపై కాంగ్రెస్ కార్యకర్తలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బ్లాక్ మెయిల్ చేస్తున్నార‌ట‌

తెలంగాణ ఏర్పడిన దగ్గర్నుంచి ఇప్పటి వరకు టీఆర్ఎస్ ను నేరుగా ఎదుర్కొన్న నేత కాంగ్రెస్ లో లేడని అంటున్నారు. అందువల్లే.. దూకుడుగా వ్యవహరించే రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఇవ్వాలనే డిమాండ్ మొదలైంది. రోజురోజుకూ ఈ డిమాండ్ బలపడుతోంది కూడా. కేసీఆర్ ను ఎదుర్కోవడం రేవంత్ వల్లనే అవుతుందన్నది కాంగ్రెస్ శ్రేణుల నమ్మకం. కానీ.. దీనికి అడ్డం పడుతున్నారట సీనియర్లు. పార్టీకి ఏమైనా పర్వాలేదుగానీ.. రేవంత్ కు మాత్రం పగ్గాలు ఇస్తే ఊరుకోబోమని చెబుతున్నారట. ఈ మేరకు లేఖలు కూడా రాసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారట.

ఈ తీరు పార్టీకి మంచిదేనా

వేరే పార్టీలో నుంచి వచ్చినవారికి పీసీసీ పదవి ఎలా ఇస్తారని అంటున్నారట. ఖచ్చితంగా సీనియర్ కు మాత్రమే ఇవ్వాలని అంటున్నారట. ఒక వేళ తమను కాదని రేవంత్ కు ఇస్తే.. తాము సహకరించబోమని అంటున్నారట. ఈ తీరుపై పార్టీ బాగు కోరేవారు మండిపడుతున్నారు. ఇన్నాళ్లు పగ్గాలు కళ్లాలు మీ చేతుల్లోనే ఉన్నాయి కదా..? ఏం చేశారు అని సూటిగా నిలదీస్తున్నారు. పార్టీకి చేసేది ఏమీ లేకపోయినా.. పీసీసీ కిరీటం పెట్టుకొని గాంధీ భవన్లో కూర్చుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉన్న ఈ పరిస్థితుల్లో అందరూ కలిసి బాగుచేసుకోవడం మాని వ్యక్తిగత స్వార్థాలతో ఇలా చేయడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.