iDreamPost
android-app
ios-app

ఫ‌లితాల‌పై ఆర్‌జేడీ సంచ‌ల‌న కామెంట్స్ : ‌జాబితాతో స‌హా ట్విట్ట‌ర్ లో హ‌ల్ చ‌ల్‌

ఫ‌లితాల‌పై ఆర్‌జేడీ సంచ‌ల‌న కామెంట్స్ : ‌జాబితాతో స‌హా ట్విట్ట‌ర్ లో హ‌ల్ చ‌ల్‌

మంగ‌ళ‌వారం రాత్రి 11.40 గంట‌ల‌కు బిహార్ తుది ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. ఆది నుంచీ ఉత్కంఠ‌గా సాగిన కౌంటింగ్ ప్ర‌క్రియ ముగిసే స‌రికి 125 స్థానాల‌తో ఎన్డీఏ కూట‌మి స్ప‌ష్ట‌మైన మెజార్టీ సాధించింది. తేజ‌స్వీ యాద‌వ్ నేతృత్వంలోని మ‌హా కూట‌మి 110 స్థానాల్లో గెలిచింది. బిహార్ పీఠం కైవ‌సం చేసుకున్న బీజేపీ అంటూ బ్రేకింగ్ న్యూస్ తో పాటు అంత‌కు ముందు నుంచే మ‌రో వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. బీహార్‌ ఎన్నికల కౌంటింగ్‌లో అక్రమాలు జ‌రుగుతున్నాయంటూ ఆర్‌జేడీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. తుది ఫ‌లితాల మేర‌కు ఆర్‌జేడీ 110 సీట్లు సాధిస్తే.. అంత‌కు మూడు గంట‌ల ముందే.. 119 స్థానాల్లో త‌మ కూట‌మి విజ‌యం సాధించింద‌ని ప్ర‌క‌టించుకుంది. ఆ జాబితా ను కూడా రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ ట్విట‌ర్ ఖాతాలో పోస్టు చేసింది.

బీజేపీ – జేడీయూ డైరెక్ష‌న్‌లో అక్ర‌మాలు

కౌంటింగ్ ప్ర‌క్రియ‌లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని ఆర్జేడీ ఆరోపించింది. “జేడీయూ – బీజేపీ నాయ‌కులు ముఖ్య‌మంత్రి నితీశ్ నివాసంలో కూర్చుని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం, ఎన్నికల అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల ఫలితాల ప్ర‌క‌ట‌న‌లో కుట్ర‌లు ప‌న్నుతున్నారు. ” అని ఆరోపించింది. అలాగే ఇప్పటి వరకూ తాము 119 స్థానాల్లో గెలుపొందినట్లు ఆర్జేడీ ప్రకటించుకుంది. గెలిచిన తమ అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు కూడా అభినందనలు తెలిపారని… కానీ 10 చోట్ల తమ అభ్యర్థులకు ఇంకా సర్టిఫికెట్లు ఇవ్వలేదని ఆరోపించింది. ఉద్దేశపూర్వకంగానే వారికి సర్టిఫికెట్లు ఇవ్వలేదని… ఇదేంటని అడిగితే ఓడిపోయారని చెప్తున్నారని పేర్కొంది. ఫలితాలను వారికి అనుకూలంగా మలుచుకునే కుట్ర జరుగుతోందని తుది ఫ‌లితాలు వెల్ల‌డి కావ‌డానికి మూడు గంట‌ల ముందు నుంచే తేజ‌స్వీ ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌స్తున్నారు.

ఈ మేర‌కు మంగ‌ళ‌వారం 8.50 గంట‌ల‌కు రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ ట్విట‌ర్ ఖాతాలో గెలిచిన కూట‌మి అభ్య‌ర్థుల జాబితా అంటూ ఓ లిస్టు తో పాటు హిందీలో పోస్టు చేశారు. సీఎం ఇంట్లో కూర్చుని నితీశ్‌తో కలిసి సుశీల్ కుమార్ మోదీ కుయుక్తులకు పాల్పడుతున్నారని తేజ‌స్వీ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. కౌంటింగ్ ఉత్కంఠ‌.. ఆరోప‌ణ‌లు కొన‌సాగుతుండ‌గానే మ్యాజిక్ ఫిగ‌ర్ 122ను దాటి ఎన్డీఏ స్ప‌ష్ట‌మైన మెజార్టీ సాధించిన‌ట్లు ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి.