iDreamPost
android-app
ios-app

తేజ అ’ధర’హో…

తేజ అ’ధర’హో…

గుంటూరు మిర్చి ఘాటు లోనే కాదు ధర లోను అదరకొడుతుంది. గుంటూరు మార్కెట్ యార్డ్ చరిత్రలో మరెన్నడూ లేని విధంగా క్వింటాల్ మిర్చి ధర రికార్డ్ స్థాయి లో తేజా రకం గరిష్టంగా బుధవారం 23 వేల రూపాయల వరకు పలికింది. చైనా, మలేషియా దేశాలలో గుంటూరు మిర్చికి మంచి గిరాకీ ఉన్నందునే తేజ రకానికి ఈ సంవత్సరం రికార్డ్ ధర పలుకుతుందని రైతులు, వ్యాపారులు అంటున్నారు. ఈ తాజా ధరలతో రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ముందు ముందు ఇవే ధరలు ఫిభ్రవరి వరకు కొనసాగితే ఈ సంవత్సరం మిర్చి రైతులు మంచి లాభాలు కళ్లచూసే అవకాశం వుంది.

రాష్ట్రమంతా సమృద్ధిగా వర్షాలు పడడం, డ్యాములు నిండి కాలువలు నిండుగా ప్రవహించండంతో ఈ సంవత్సరం అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో 3.40 లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగయింది. సకాలంలో కాలువలకు నీరు విడుదల చెయ్యడంతో ఒక్క గుంటూరు జిల్లాలోనే 1.82 లక్షల ఎకరాల్లో మిర్చిని సాగు చేశారు. వాతావరణం అనుకూలించడంతో పల్నాడు ప్రాంతంలో మొదటి కోతలు ప్రారంభం అయ్యాయి. దీనితో రైతులు మొదటి కాపుని గుంటూరు మిర్చి యార్డ్ కి తీసుకొస్తున్నారు. అదే సమయంలో ఈ సంవత్సరం తెగుళ్ల భాధ కూడా తక్కువ గా ఉండడంతో పంట దిగుబడి బాగా పెరిగింది. దీనితో పలనాడు ప్రాంతంలో ఎకరాకు 25 నుండి 30 కింటాల్ వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందంటున్నారు.

చైనా, సింగపూర్, థాయిలాండ్, మలేషియా దేశాలలో గుంటూరు మిర్చి కి డిమాండ్ అధికంగా ఉండడంతో పాటు చైనాలో స్థానికంగా సాగైన పంటకి ఆశించిన స్థాయిలో నాణ్యత రాకపోవడంతో మన తేజా రకం మిర్చికి చైనా లో డిమాండ్ బాగా పెరిగింది. సాధారణంగా చైనా లో మిర్చి నుండి ఆయిల్ తీస్తారు. అలా తీసిన ఆయిల్ లో పెప్పర్ శాతం తో పాటు తేమా శాతాన్ని బట్టి మిర్చి నాణ్యతని ధరని నిర్ధారిస్తారు. మన దగ్గర పండే తేజా మిరపలో పెప్పర్ శాతం ఎక్కువగా ఉండడంతో పాటు మన రైతులు ఎండు మిర్చిని దాదాపు 14 నుండి 18 రోజుల పాటు ఎండబెట్టడం వల్ల ఎండు మిరపలో తేమ శాతం కూడా తక్కువగా ఉంటుంది. మిగతా రాష్ట్రాల్లో అయితే వారం రోజుల కన్నా ఎక్కువ ఎండబెట్టరు. అందువల్ల ఆ కాయలో తేమ శాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది.

గత నవంబర్, డిసెంబర్ నెలలో కూడా మంచి ధర లభించడంతో రైతులు, వ్యాపారులు శీతల గిడ్డంగుల్లో నిల్వచేసిన సరుకంతా అమ్ముకున్నారు. దానితో పాత నిల్వలు చాలావరకు ఖాళీ అయ్యాయి. దానితో పాటు పచ్చి మిరపకి మార్కెట్లో మంచి రేటు లభించడంతో చాలా మంది రైతులు పచ్చి మిరపనే అమ్ముకున్నారు. దీనితో కొత్త పంటకి మంచి డిమాండ్ ఏర్పడింది.

Read Also: గిట్టుబాటు ధర అదో చిరకాల కల

తేజా రకానికి వున్న గిరాకీని దృష్టిలో ఉంచుకొని చైనా కస్టమ్స్ దిగుమతి సుంకాలు తగ్గించడంతో పాటు ఆ దేశం నుండి భారీగా ఆర్దర్లు వస్తుండడంతో గుంటూరు మిర్చి యార్డ్ లో ధరలు అమాంతం పెరిగాయని తెలుస్తుంది. ప్రస్తుతం గుంటూరు మిర్చి యార్డ్ కి రోజుకి 45 వేల టిక్కీల ( ఒక టిక్కీ: 45- 55 కిలోలు) వరకు పంట వస్తుండగా అందులో సగానికి పైగా తేజా రకమే ఉండడం విశేషం. అందువల్లే ఎప్పుడు లేనిది ఈ సంవత్సరం సరుకు నాణ్యతని బట్టి తేజా రకం ధర నిన్న గరిష్టంగా 23 వేల వరకు పలికింది. ఆఖరికి ఎప్పుడు 2 వేలకు మించని తేజా రకం తాలుగాయ కూడా 6 వేల వరకు ధర పలుకుతుందంటే డిమాండ్ ఏవిధంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఆ తరువాతి స్థానంలో 334 రకం కిలో 195 వరకు పలుకుతుండగా, నంబర్-5 రకం కిలో 192 రూపాయలు, నంబర్- 341 రకం మిర్చి కిలో 190 వరకు పలుకుతుంది.

గత ఐదు సంవత్సరాలుగా జెమిని వైరస్, బొబ్బర తెగులు, ఆకు ముడత తెగులు లాంటి వైరస్ లతో పాటు సకాలంలో వర్షాలు, కాలువలు బోర్లలో నీటి లభ్యత లేకపోవడం, తీవ్ర వర్షాభావ పరిస్థితులు, గిట్టుబాటు ధరలు లేక మిర్చి రైతు తీవ్ర నష్టాలు కళ్లచూడాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాలలో ఎకరాకు 5, 10 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు.ధర కూడా క్వింటాల్ కి ఎప్పుడూ 4-5 వేళకి మించలేదు. ఈ సంవత్సరం మాత్రం వాతావరణ పరిస్తితులన్ని అనుకూలించడంతో దిగుబడి కూడా భారీగా పెరిగే అవకాశం వుంది. అన్ని కోతలు అయిపోయేటప్పటికీ ఎకరాకు 25 నుండి 30 క్వింటాళ్లు దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: పత్తి ,మిరప గిట్టుబాటు ధరల వెనక ఉన్న లెక్కలు

ప్రస్తుతం ఒక ఎకరా మిరప సాగుకి పెట్టుబడి ఒక ఎకరాకు పెట్టుబడుల సరాసరి అంచనా పనుల వారీగా సాగటున ఎంత అవుతుందో ఖర్చుల లెక్క చూస్తే

పొలం కౌలు : 20000.00
దుక్కి,అరక, నాగళ్లు : 15000.00
విత్తనం , నాటు వరకు : 15000.00
పురుగు మందులు. : 5000.00
ఎరువులు : 20000.00
కలుపులు , పై కూలి : 5000.00
నీటి పారుదల ఖర్చు : 4000:00
కోత , గ్రేడింగ్ : 30000:00
గోతాలు,తొక్కు కూలి : 4000:00
యార్డుకి ట్రాన్స్పోర్ట్ : 2000:00
సాదర ఖర్చులు. : 2000:00
———————-
* మొత్తం ఖర్చు = 1,42,000:00 ( అంచనా, షుమారుగా)

ఈ లెక్కన తేజా రకం మిర్చి కి ఇప్పుడున్న ధరలు ఫిభ్రవరి మధ్య వరకు కొనసాగితే డ్యామేజీ, తాలు పోగా ఎకరానికి తక్కువ లో తక్కువ 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది అనుకుంటే సగటున 20 X 20,000 = 4,00,000/-

Read Also: వరి ,పసుపు గిట్టుబాటు ధరల వెనక ఉన్న లెక్కలు

అంటే కౌలు రేటుని ని తీసివేసినా కూడా రైతుకి ఎకరాకు కనీసం మూడు నుండి మూడున్నర లక్షల వరకు మిగిలే అవకాశం వుంది. ఇటీవల కాలంలో వరుస నష్టాలు ఎదుర్కొని సంక్షోభంలో ఉన్న మిర్చి రైతాంగానికి ఈ సంవత్సరం మిర్చి రేటు కలసి రావడంతో మంచి ఆదాయం దక్కుతుందని చెప్పవచ్చు