బీజేపీ కి మల్లన్న రాంరాం.. కొత్త పార్టీ..

తెలంగాణలో ఇప్పటికే మూడు ప్రధాన రాజకీయ శక్తులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. ఇక ఇవికాకుండా అరడజను చిన్నాచితకా పార్టీలు ఉన్నాయి. ఏఐఎంఐఎం, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ,ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారథ్యంలోని బహుజన సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ,తెలంగాణ జన సమితి మరియు మహా జన సమితిలు తెలంగాణలో ఇతర పార్టీలుగా ఉన్నాయి.

ఇప్పుడు రాష్ట్రంలో మరో ప్రాంతీయ పార్టీకి సమయం ఆసన్నమైంది. గత మూడేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న ప్రముఖ జర్నలిస్టు-కార్యకర్త-రాజకీయవేత్త చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇక బీజేపీ ఆఫీస్ గడప తొక్కనని.. ఒంటరిగా వెళుతున్నట్టు ప్రకటించారు. ఇక కొత్త పార్టీ దిశగా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.

వరంగల్ లోని పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపాలైన తీన్మార్ మల్లన్న ఆ తర్వాత ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టి టిఆర్ఎస్ పై మాటలదాడి చేశాడు. ఈ నేపథ్యంలో పలు కేసుల్లో అరెస్ట్ అయ్యాడు. చాలారోజులు బెయిల్ రాకపోవడంతో జైల్లో ఉన్నాడు. ఆ సమయంలోనే బీజేపీలో చేరికకు అంగీకరించాడు. విడుదలైన తర్వాత కొన్నినెలల క్రితం ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు.

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ తరపున కూడా ఆయన జోరుగా ప్రచారం చేశారు. అయితే ఆయనకు బీజేపీలో సరైన గుర్తింపు రాకపోవడంతో పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు బీజేపీ నేతల తీరుతో విసిగిపోయిన మల్లన్న త్వరలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

తన అనుచరుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్న టీఆర్ఎస్ నేతలపై తుపాకీ ఎక్కుపెడుతామన్నారు. తమ సంస్థకు మల్లన్న’టీమ్-7200′ అని నామకరణం చేశారు. దేశాన్ని దోచుకుంటున్న వెలమ టీఆర్ఎస్ నాయకులను మొత్తం 7200 మందిని గుర్తించామని తెలిపారు. వైద్యం,విద్య సామాజికన్యాయం వంటి ప్రాథమిక హక్కులను కాలరాస్తూ ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నారని ఆరోపించారు.

బీజేపీ కంటే తమ టీమ్7200 చాలా మెరుగ్గా ఉందని రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం చూపడంలో బీజేపీ విఫలమైందని మల్లన్న ఆరోపించారు. ఇకపై నేను బీజేపీ కార్యాలయంలోకి అడుగుపెట్టనని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో పర్యటిస్తూ ప్రచారం నిర్వహించి ఏడాదిన్నర తర్వాత 10 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని మల్లన్న తెలిపారు. రాష్ట్రంలో గూండాయిజానికి వ్యతిరేకంగా పోరాడతామన్నారు. మేము ఎవరికీ భయపడమని.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకుంటామని అన్నారు. తన ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి విరాళంగా ఇస్తానని సామాజిక న్యాయంకోసం పోరాడుతానని ప్రకటించారు.

Show comments