iDreamPost
iDreamPost
IPL అయిపోయింది. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ కూడా అయిపోయింది. ఇప్పటికే BCCI అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో మొదలయ్యే T20 ప్రపంచకప్‌ని దృష్టిలో పెట్టుకుని జట్టుని సిద్ధం చేస్తుంది. అయితే ఈ ప్రపంచకప్ లో భారత జట్టులో ఎవరికీ స్థానం దక్కుతుంది? తుది జట్టులో ఎవరూ ఉంటారు అని క్రీడాభిమానులు అంత ఎదురు చూస్తున్నారు. తాజాగా టీమిండియా కోచ్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతూ T20 ప్రపంచకప్ సన్నాహాలు గురించి మాట్లాడారు.
ఇటీవల గంభీర్ దినేష్ కార్తీక్ ని ఉద్దేశించి T20 ప్రపంచకప్ కి అతన్ని ఎంపిక చేయడం అనవసరం అన్నాడు. కానీ ద్రవిడ్ కార్తిక్ ని ఉద్దేశించి.. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ లో తన ఎంపికకు దినేశ్ కార్తీక్ న్యాయం చేశాడు. కార్తీక్ ప్రదర్శన చాలా బాగుంది. గత రెండేళ్లుగా ఐపీఎల్‌లో ఫినిషర్‌గా అతని ప్రదర్శన చూసి ఇప్పుడు జట్టులోకి తీసుకున్నాం. ఇన్నింగ్స్ చివరి అయిదు ఓవర్లలో చెలరేగి జట్టుకు అధిక స్కోరు అందించే వాళ్ళు మాకు కావాలి. దానికి కార్తీక్, హార్దిక్ సరిపోతారు. T20 ప్రపంచకప్ జట్టు ఎంపికలో కార్తీక్ కచ్చితంగా ఉంటాడు అని క్లారిటీ ఇచ్చేసాడు. ఇక హార్దిక్ కూడా ఉంటాడని చెప్పేసాడు ద్రవిడ్. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో పంత్ అంతగా రాణించలేకపోయినప్పటికీ అతను జట్టు భవిష్యత్ ప్రణాళికల్లో కీలకం. ఈ ఏడాది ఐపీఎల్‌లో అతను మంచి ప్రదర్శనే చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో మెరుగైన గణాంకాలు అందుకుంటాడనే అనుకుంటున్నాం. మా బ్యాటింగ్ లైనప్‌లో పంత్ అంతర్భాగంగా కచ్చితంగా కొనసాగుతాడు. పంత్ ఓ యువ కెప్టెన్. ఇప్పుడే అతనికి కెప్టెన్సీ, కీపింగ్, బ్యాటింగ్ అవకాశాలు రావడం మంచి విషయం అంటూ పంత్ ప్లేస్ ని కూడా ఫిక్స్ చేసేసారు ద్రవిడ్.
T20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లే భారత బృందంపై త్వరగా తేలుస్తాం. ప్రపంచకప్ కోసం 15 మంది ఆటగాళ్లనే తీసుకెళ్లాలి కానీ అంతకంటే ముందు 18 నుంచి 20 మంది అత్యుత్తమ క్రికెటర్లను గుర్తించాలి. చివరి నిమిషంలో ఆటగాళ్ల గాయాలు, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మళ్ళీ మార్పులు చేయాల్సి వస్తుంది. ఐర్లాండ్‌తో సిరీస్, ఇంగ్లాండ్‌తో టీ20 మ్యాచ్‌ల తర్వాత తుది జట్టుని ఫైనల్ చేస్తాం అని తెలిపాడు ద్రవిడ్.
కేవలం కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రాన ఆటగాళ్లపై ఓ అంచనాకు రాలేం. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోం. ఒక సిరీస్ లేదా ఒక మ్యాచ్‌లో ప్రదర్శన బట్టి ఆటగాళ్లపై ఓ నిర్ణయానికి రావడం నాకు నచ్చదు. కొన్ని మ్యాచ్‌ల్లో శ్రేయస్ ఎంతో అంకితభావంతో జట్టు కోసం ఆడాడు, ఓ మ్యాచ్‌లో రుతురాజ్ తన సత్తాచాటాడు. ఎవరి ప్రదర్శనా మాకు నిరాశ కలిగించలేదు. అందుకే అందర్నీ విశ్లేషించి టీంని ఫైనల్ చేస్తాం. ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాలో ఎలాంటి సిరీస్ ఆడే అవకాశం లేదు కాబట్టి ప్రపంచకప్‌కు ముందు రెండు వారాల సమయాన్ని మెరుగ్గా ఉపయోగించుకుని టోర్నీకి సిద్ధమవుతాం.
గతంలో ఇంగ్లాండ్ పర్యటనలో విరాట్ కోహ్లి సారథ్యంలోని టీమ్‌ఇండియా టెస్టు సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. అప్పుడు వాయిదా పడ్డ చివరి టెస్టు జులై 1న మొదలుకానుంది. గతేడాది సిరీస్‌తో పోలిస్తే ఇప్పుడు ఇంగ్లాండ్ మరింత బాగా ఆడుతుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో టెస్టు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని తెలిపారు ద్రవిడ్.