iDreamPost
iDreamPost
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న T20 సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లు ఓడిపోయి భారత ఫ్యాన్స్ ని ఆందోళనలో పెట్టినా మూడో మ్యాచ్ నెగ్గి ఆశలు నిలిపింది టీమిండియా. ఇక తాజాగా నాలుగో మ్యాచ్ లో కూడా భారీ విజయం సాధించింది. రాజ్ కోట్ లో జరిగిన భారత్ – దక్షిణాఫ్రికా నాలుగో టీ20లో భారత్ 82 భారీ పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-2తో సమం చేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. మొదట్లో వరసగా వికెట్స్ పడి తడబడ్డా ఆ తర్వాత దినేష్ కార్తిక్ హాఫ్ సెంచరీ, హార్దిక్ పాండ్య 46 పరుగులతో మంచి స్కోర్ అందించారు. దక్షిణాఫ్రికాకి 170 పరుగుల లక్షాన్ని నిర్దేశించారు.
170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 87 పరుగులకే కుప్పకూలడం ఆశ్చర్యం. సౌతాఫ్రికా బ్యాటర్లలో వాన్ డెర్ డస్సెన్ కేవలం 20 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగిలిన వారెవ్వరూ వాళ్ళ బ్యాట్స్ కి పని చెప్పకుండానే పెవిలియన్ కి వెనుదిరిగారు. భారత బౌలర్లు చెలరేగిపోయారు. ఆవేష్ ఖాన్ నాలుగు వికెట్లతో అదరగొట్టగా, చాహల్ రెండు, హర్షల్ పటేల్, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ సాధించారు. దీంతో కేవలం 16.5 ఓవర్లకి 87 పరుగులు చేసి సౌతాఫ్రికా టీం మొత్తం కుప్పకూలడంతో భారత్ రాజ్ కోట్ లో రాజసంగా మ్యాచ్ గెలిచి సిరీస్ ని 2-2 తో సమం చేసింది. ఇంకొక్క మ్యాచ్ గెలిస్తే రిషబ్ పంత్ కెప్టెన్ గా తొలి సిరీస్ ని అందుకుంటాడు. మిగిలిన 5వ మ్యాచ్ జూన్ 19న బెంగుళూరులో జరగనుంది.