Idream media
Idream media
గురువులు రెండు రకాలు. ఉతికేవాళ్లు, ఉతకనివాళ్లు.
ఉతికే వాళ్లలో రెండు రకాలు, సూక్ష్మకొట్టుడు, బండకొట్టుడు.
సూక్ష్మ కొట్టుడు అంటే రాయదుర్గంలో మరియమ్మ టీచర్. ఊరికే చెవి పట్టుకునేది. స్కేల్‌తో సున్నితంగా చేతిని తాకేది. జుత్తు పట్టుకుని లాగేది కానీ, తల నిమిరినట్టుండేది. ఈ తల్లి వల్లే ఒకటో తరగతి భయం లేకుండా చదువుకున్నా. మూడో తరగతిలో బుజ్జమ్మ టీచరూ అంతే. బుగ్గ పట్టుకునేది, ప్రేమో కోపమో తెలియనంత సున్నితంగా.
ట్యూషన్‌లో గోపి సార్ ఇంతే. ఆయనకు చాలా కష్టాలుండేవి. చదువుంది, ఉద్యోగం లేదు. తమ్ముడు చిన్న ఉద్యోగంలో ఇంటిని నెడుతున్నాడు. ముసలి తల్లి, ఇవేవీ ఆయన్ని తాకేవి కావు. ట్యూషన్ పిల్లలపై స్నేహం, ప్రేమ, చిరునవ్వు. నేను సాయంత్రాల కోసం , ట్యూషన్ కోసం ఎదురు చూసిన ఏకైక వ్యక్తి. ఇంగ్లీష్ సాహిత్యాన్ని ఈ రోజు హాయిగా చదువుకోడానికి ఈయనే కారణం. A ఒక నిచ్చెనలా, B గణపతి బొజ్జలా, C కుక్కతోకలా భావిస్తున్న నన్ను ఇంగ్లీష్ దారి పట్టించాడు. భయం పోగొట్టాడు.
బండకొట్టుడు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది రాజయ్య సార్. ఆయన వయసు 60 ఏళ్లు. తెల్ల చొక్కా, పంచె, నుదుట బొట్టు. గోపీ సార్ టీచర్ ట్రైనింగ్‌కి వెళుతూ రాజయ్య దగ్గర మమ్మల్ని అప్పగించాడు. ఆరు నెలలు అక్కడ చదువుకున్నా.
రాజయ్య పద్ధతి వేరు. రావడం రావడమే అమరకోశం లోని శ్లోకాలు చదవాలి. నోరు తిరక్క “ధత్తతీ” అని నసిగితే బెత్తం విరిగిపోతుంది. భయంతో తెల్లారి లేచి కంఠస్తం చేసేవాన్ని. మొద్దు పిల్లలకి అక్కడ నరకమే. కోదండం వేయిస్తాననే వాడు. అంటే విద్యార్థిని తాడుతో వేలాడతీసి కింద ముల్లకంపలు పెట్టడం. తాడు తెచ్చి పైన దూలానికి వేసేవాడు. ఈ లోగా కోదండం కుర్రాడు అరిచే అరుపులకి సగం వూరు అక్కడ గుంపయ్యేది. జాలి తలచి వదిలేసేవాడు. వాడు ట్యూషనైనా మానేసేవాడు. లేదంటే చదువైనా నేర్చుకునేవాడు. అమరకోశం బట్టీ కొడుతున్నప్పుడల్లా ఏడ్పొచ్చింది. ఆయన దగ్గరుండి తప్పులు సరిచేసే వాడు. అపుడు నాకు తెలియదు నా తెలుగు భాషకి పునాదులు నిర్మిస్తున్నాడని. ఈ రోజు నాలుగు అక్షరాలు రాస్తున్నానంటే , అవన్నీ ఆయన పెట్టిన భిక్షనే.
ఆయనతో ట్యూషన్ మానేసిన ఏడాదికి వీధిలో శవయాత్ర కనిపించింది. రాజయ్యది అది. ఏదో దుక్కం. ఆయనంటే భయమే అనుకున్నా కానీ, అనుబంధం కూడా ఉందని అర్థమైంది.
తర్వాత స్కూల్లో కృష్ణమాచార్యులు, ప్రసాద్, శాంతినారాయణ, ప్రేమలత, యూనివర్సిటీలో కొలకలూరి ఇనాక్, రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, దేవకి ఇలా ఎందరో గురువులు. అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ వందనాలు.