iDreamPost
android-app
ios-app

అప్పుల లెక్కలు చెప్పాలంటున్న మాజీ ఆర్థిక మంత్రి..!

అప్పుల లెక్కలు చెప్పాలంటున్న మాజీ ఆర్థిక మంత్రి..!

నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుందంటారు. ఈ నానుడి టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసే విమర్శలు చూస్తే అక్షరాలా నిజమనిపిస్తుంది. తనకు తాను ఆర్థిక మేథావిగా భావించే యనమల.. మరోసారి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భవిష్యత్‌పైన, వైసీపీ సర్కార్‌ చేసే అప్పులపైనా వర్చువల్‌ విధానంలో విలేకర్లతో మాట్లాడారు. గతంలో తాను మాట్లాడిన అంశాలను యనమల మరిచిపోతారో లేక తాను మాట్లాడినవి ప్రజలు, జర్నలిస్టులకు గుర్తుండవని భావిస్తోరో గానీ.. ఒకే అంశంపై యనమల భిన్నంగా మాట్లాడుతూ వైసీపీ సర్కార్‌పై విమర్శలు చేస్తున్నారు.

జగన్‌ సర్కార్‌పాలనపై విమర్శలు చేసేందుకు ఏ అవకాశం లభించకపోవడంతో యనమల అప్పులు అంశం తెరపైకి తీసుకొస్తున్నారు. అయితే అందులోనూ ప్రతిసారి భిన్నమైన వ్యాఖ్యలు చేస్తూ.. తాను చెప్పువి ఉత్త మాటలని ఆయనే నిరూపిస్తున్నారు. వైసీపీ సర్కార్‌ ఐదేళ్లలో మూడు లక్షల కోట్ల అప్పులు చేస్తుందంటూ.. మొదటి రెండేళ్లలో తెచ్చిన అప్పులను బట్టి ఇటీవల చెప్పిన యనమల రామకృష్ణుడు.. తాజాగా ఆ మొత్తాన్ని పెంచారు. 2024 నాటికి ఏపీ అప్పులు 8 లక్షల కోట్లకు పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే అప్పులు నాలుగు లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని వివరించారు. అదే సమయంలో గడచిన రెండేళ్లలో తెచ్చిన అప్పులు ఏం చేశారో చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు యనమల. ఏడాదికి 70 వేల కోట్ల రూపాయుల జీతాల రూపంలో చెల్లించాల్సి వస్తోందన్నారు.

తెచ్చిన అప్పులు ఏం చేశారని అడిగే హక్కు రాష్ట్ర ప్రజలకు ఉంది. అందులో యనమల కూడా ఒకరు. ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం కావాలంటే మూడు రోజుల క్రితం దినపత్రికలను తిరగేస్తే దొరుకుతుంది. జగన్‌ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయిన సందర్భంగా.. తమ ప్రభుత్వం ఏం చేసిందో వివరిస్తూ ప్రకటనల రూపంలో ప్రజల ముందు ఉంచింది. అందులో అభివృద్ధి పనులతోపాటు సంక్షేమ పథకాల గణాంకాలు ఉన్నాయి. ఏ పథకం ద్వారా.. ఎంత మందికి..? ఎంత మొత్తం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆర్థిక లబ్ధి చేకూర్చారన్నది వైసీపీ సర్కార్‌ ప్రజల ముందు పెట్టింది.

ఇప్పటికి అప్పులు నాలుగు లక్షల కోట్ల రూపాయలు అయ్యాయని చెబుతున్న యనమల రామకృష్ణుడు అందులో 2014కు ముందు ఉన్న మొత్తం అప్పులు ఎంత..? తాను ఆర్థిక మంత్రిగా ఉన్న గత టీడీపీ ప్రభుత్వంలో 2019–19 మధ్య చేసిన కొత్త అప్పు ఎంత..? వైసీపీ ప్రభుత్వం వచ్చాక కొత్తగా చేసిన అప్పులు ఎంత..? పాత అప్పులపై అసలు, వడ్డీ రూపంలో కడుతున్నది ఎంత..? ఈ సమాచారం కూడా యనమల రామకృష్ణుడు ప్రజల ముందు ఉంచితే.. అప్పులు బండారం బయటపడుతుంది.

ఇక అప్పులు తెచ్చి ఏం చేశారని ప్రశ్నిస్తున్న యనమల.. తాను ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ ప్రభుత్వం అప్పులు రూపంలో తెచ్చిన మొత్తాలను దేనికి ఖర్చు పెట్టారనేది కూడా కాదు.. కనీసం ఇంత అప్పులు తెచ్చామని ఒక్కసారి కూడా చెప్పలేకపోయారంటే అతిశయోక్తి కాదు. రాష్ట్ర అప్పు ఎంత..? టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఎంత అప్పులు చేశారని విలేకర్లు అడిగిన ప్రశ్నకు.. ప్రభుత్వం అన్నాక అప్పులు చేస్తుంది.. అవకాశం ఉంది కాబట్టే అప్పులు చేస్తున్నామన్న తాను చెప్పిన విషయాన్ని యనమల మరచిపోయారేమో గానీ.. విలేకర్లు.. ప్రజలు మరచిపోలేదు. ప్రభుత్వంపై చేసే విమర్శల్లో సహేతుకత ఉందా..? లేదా..? అనేది విమర్శలు చేసే వారు ఆలోచించకపోయినా.. వాటిని వింటున్న ప్రజలు మాత్రం ఆలోచిస్తారు.

Also Read : చంద్రబాబు గతం మరచిపోయారా..? ప్రజాధనం దుబారా గురించి మాట్లాడుతున్న మాజీ సీఎం