Idream media
Idream media
ఇటీవలే తెలుగుదేశం పార్టీ వర్చువల్ మహానాడు పూర్తి చేసుకుంది. సాధారణంగా మహానాడు ఆ పార్టీకి కొంత బూస్టప్ గా పని చేసేది. కానీ రెండేళ్లుగా ఆ కార్యక్రమం సాదాసీదాగా ఆన్ లైన్ లోనే ముగిసిపోతోంది. ఈ దఫా కూడా ఆశించినంత జోష్ పార్టీలో నింపలేకపోయింది. ఆత్మస్తుతి, పరనింద తప్ప.. పార్టీ పరంగా ఆశించినంత ప్రయోజనం కలిగేలా ముఖ్యనేతలు వ్యవహరించలేదన్న అపవాదు ఉంది.
దీనికి తోడు రెండేళ్లలో పార్టీ పరిస్థితి చూస్తే, భవిష్యత్ అగమ్య గోచరంగా మారుతోంది. దీంతో ఇంకా మూడేళ్లు ఉన్నప్పటికీ.. 2024 నాటికి 175 నియోజవర్గాల్లోనూ కనీసం పోటీ అయినా ఇవ్వగలమా అనే సంకట స్థితి పార్టీలో ఉందనడం అతిశయోక్తి కాదు. చంద్రబాబునాయుడు, తనయుడు లోకేశ్ పైకి డాంభికాలు పలుకుతున్నప్పటికీ పార్టీని పటిష్టం చేయడానికి నానా అవస్థలు పడుతున్నారు.
ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండేళ్లే అయింది. కానీ, ఆయన తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా వైసీపీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ బలంగా పాతుకుపోయింది. 20 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. సాధారణంగా అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా తొలి నాళ్ల కంటే చివరికి వచ్చే కొద్దీ పథకాల అమలు, ప్రజలు అభివృద్ధి ఫలాలు అందించడంలో వేగం పెంచుతుంది.
జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే పథకాల అమలులో దూసుకెళ్తున్నారు. కరోనా కాలంలో కూడా మహమ్మారి కట్టడికి చర్యలు చేపడుతూనే, సాధారణ పాలన ఎక్కడా గాడి తప్పకుండా ద్విముఖ వ్యూహం అనుసరిస్తున్నారు. సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారు. ఇవన్నీ వైసీపీని ప్రజలకు దగ్గర చేస్తుంటే, టీడీపీని మరింత దూరం చేస్తున్నాయి. ఇప్పటికే పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలే ఆ పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
వచ్చే మూడేళ్లలో యువ సీఎం నాయకత్వంలో ఇంకా అద్భుతాలు జరుగుతాయి.” అంటూ వైసీపీ నేతలు ఘంఠాపథంగా చెబుతున్నారు. జగన్ కూడా సంక్షేమ కేలెండర్లను రిలీజ్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. మరో పక్క టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చూస్తే, రెండేళ్లలో జరిగిన, జరుగుతున్న నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో ఆలోచించడం మాని, ఎప్పుడూ జగన్ టార్గెట్ గానే రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకు ఓడానో తెలియదని, తనను అర్థం చేసుకొనే శక్తిలేకే ఓడించారని ప్రజలే నేరం చేసినట్లుగా మాట్లాడుతున్నారు.
దీనిపై వైసీపీ నేతలు మాట్లాడుతూ.. ఎగ్జామ్ బాగా రాసినా పేపర్లు దిద్దిన టీచర్ కావాలనే తనను ఫెయిల్ చేశాడని విద్యార్థి ఏడ్చినట్టుంది బాబు వ్యవహారం.” అంటూ చురకలు అంటిస్తున్నారు. ఆరోపణల్లోనూ, ఆవేదన వ్యక్తం చేయడంలో కూడా బాబు ఫెయిల్ అవుతున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ పూర్వ వైభవం సాధిస్తుందా? అంతకంతకూ ఆదరణ పెంచుకుంటూ పోతున్న వైసీపీ ధాటికి కుప్పకూలుతుందా అనేది వేచి చూడాల్సిందే.