Idream media
Idream media
విజనరీ, గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని టీడీపీ శ్రేణులు చెప్పుకునే చంద్రబాబు 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా..పరిపాలన లో ఒక్క సంస్కరణ తీసుకురాలేకపోయారు. టీడీపీ కార్యకర్త ఠక్కున చెప్పగలిగే ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేక పోయారు. అనుభవం లేదని టీడీపీ నేతలు ప్రచారం చేసిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయిన తర్వాత గడిచిన మూడేళ్లలో విప్లవాత్మక సంక్షేమ పథకాలు,పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టారు. ప్రభుత్వాన్ని గ్రామాలకు చేర్చేలా ఏర్పాటుచేసిన గ్రామ సచివాలయాలు, దానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు విజయవంతం అయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేసి.. ప్రభుత్వ కార్యకలాపాలను ఈ నెల 4వ తేదీన ప్రారంభించారు.
కొత్తగా ఏర్పాటుచేసిన పలు జిల్లాలకు ప్రముఖుల పేర్లు పెట్టారు. ఎన్టీఆర్ పేరును జిల్లాకు పెడతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేయడంతోపాటు టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ పేరుని నిత్యం ప్రజలు స్మరించుకునేలా ఆయన పేరును విజయవాడ జిల్లాకు పెట్టారు. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో టీడీపీ నేతలకు అంతుచిక్కడం లేదు. తమ పార్టీ వ్యవస్థాపకుడు అయిన ఎన్టీఆర్‌కు.. ఘన నివాళి అర్పించేలా ఇప్పటివరకు పార్టీ తరపున ఏమీ చేయలేదు. ఎన్టీఆర్ జయంతి, వర్థంతి రోజున ఆయనకు భారతరత్న ఇవ్వాలనే అరిగిపోయిన డిమాండ్‌ను ప్రతిసారి వినిపించే చంద్రబాబు.. కేంద్రంలో అధికారం పంచుకున్న సమయంలో అది సాధించకపోగా.. తన చేతిలో పని అయిన ఎన్టీఆర్ పేరును ఏదైనా ఒక జిల్లాకు పెట్టే నిర్ణయం కూడా తీసుకోలేదు. అయితే తమ రాజకీయ ప్రత్యర్థి అయిన వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరుపెట్టడంతో.. ఈ విషయంపై ఎలా స్పందించాలో తెలియక టీడీపీ నేతలు తికమకపడుతున్నారు.
కొత్త జిల్లాలు, వాటికి పేర్ల విషయంలో టీడీపీ నేత, మాజీ మంత్రి కేఎస్ జవహార్ స్పందించిన తీరుతో.. ఆ పార్టీ ఎన్టీఆర్ పేరును జిల్లాకు పెట్టిన విషయంలో ఎంత గాబరా పడుతోందో తెలియజేస్తోంది. ఎన్టీఆర్ తెలుగుజాతి మొత్తానికి నాయకుడని అభివర్ణించిన జవహార్.. అలాంటి నేతను ఒక జిల్లాకు పరిమితం చేయడం ఏమిటంటూ ప్రశ్నించి.. వైసీపీ సర్కార్ చేసిన పని సరికాదనేలా మాట్లాడుతున్నారు.ఎన్టీఆర్ పేరును ఒక జిల్లాకు పెట్టడాన్ని తప్పుపడుతున్న జవహార్ అదే సమయంలో.. అంబేద్కర్, బాబూ జగజ్జీవన్ రామ్‌ల పేర్లు జిల్లాలకు పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తెలియదా..? గుర్తురాలేదా..? అంటూ ప్రశ్నించడం విశేషం. ఒక పక్క తెలుగుజాతి మొత్తానికి నాయకుడైన ఎన్టీఆర్ పేరును ఒక జిల్లాకు పెట్టడాన్ని తప్పుబడుతున్న జవహార్.. అదే సమయంలో భారత రాజ్యాంగ రూపకర్త అయిన అంబేడ్కర్, దళితుల అభ్యున్నతికి కృషి చేసిన బాబూ జగజ్జీవన్ రామ్ పేర్లను జిల్లాలకు ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తుండడం.. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం టీడీపీ నేతలను ఏ స్థాయిలో కలవరపెడుతుందో అర్థమవుతోంది.